బుధవారం 20 జనవరి 2021
Warangal-rural - Feb 16, 2020 , 03:28:15

సత్తాచాటిన టీఆర్‌ఎస్‌

సత్తాచాటిన టీఆర్‌ఎస్‌

వరంగల్‌రూరల్‌ జిల్లాప్రతినిధి- నమస్తేతెలంగాణ : సహకార ఎన్నికల్లోనూ జిల్లాలో టీఆర్‌ఎస్‌ తన సత్తా చాటింది. టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. అత్యధిక ప్రాదేశిక నియోజకవర్గా(టీసీ)ల్లో అఖండ విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన టీసీల్లో డబ్బు ఎనిమిది శాతం(78) స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించారు. 399 టీసీల్లో సహకార ఎన్నికలు జరిగితే 311 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు విజయ కేతనం ఎగరవేశారు. మెజారిటీ స్థానాల్లో తమ పార్టీ మద్దతుదారులు గెలుపొందడం వల్ల ఇప్పటికే జిల్లాలో ఎన్నికలు జరిగిన 31 ప్రాదేశిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్‌)ల్లో 29 పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఆరు పీఏసీఎస్‌ల పరిధిలో నూటికి నూరు శాతం టీసీల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు విజయ బావుట ఎగరవేసి క్లీన్‌స్వీప్‌ చేయటం విశేషం. నల్లబెల్లి, నెక్కొండ మండలంలోని రెడ్లవాడ, పరకాల మండలంలోని మాదారం, ఆత్మకూరు మండలంలోని పెంచికలపేటతో పాటు శాయంపేట, వర్ధన్నపేట పీఏసీఎస్‌ల పరిధిలోని ప్రతి టీసీలో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. మరికొన్ని పీఏసీఎస్‌ల పరిధిలో 13 టీసీలకు గాను 12 టీసీల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుతో ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు విజయం సాధించారు. ఖానాపురం, దుగ్గొండి మండలంలోని మందపల్లి, దుగ్గొండి, పర్వతగిరి మండలంలోని చౌటపల్లి పీఏసీఎస్‌ల పరిధిలో పన్నెండేసి టీసీల నుంచి టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఇంకొన్ని పీఏసీఎస్‌ల పరిధిలో పదకొండేసి టీసీల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు విజయ కేతనం ఎగరవేశారు. రాయపర్తి, చెన్నారావుపేట, పరకాల, పర్వతగిరి, దుగ్గొండి మండలంలోని నాచినపల్లి, నెక్కొండ మండలంలోని సూరిపల్లి, రాయపర్తి మండలంలోని కొలన్‌పల్లి పీఏసీఎస్‌ల పరిధిలో ఈ విజయం నమోదైంది. గీసుగొండ, చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్‌ పీఏసీఎస్‌ల పరిధిలో పదేసి టీసీల నుంచి టీఆర్‌ఎస్‌ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులు గెలిచారు. పది నుంచి 13 టీసీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్న పీఏసీఎస్‌లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌, గండ్ర వెంకటరమణారెడ్డి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలోనివి కావటం రాజకీయంగా ఆసక్తి కలిగించింది. ఒక్కో పీఏసీఎస్‌ పరిధిలో మొత్తం టీసీల సంఖ్య పదమూడు. సహకార ఎన్నికల విజేతలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్‌, గండ్ర వెంకటరమణారెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సాయంత్రం విజేతలు మంత్రి, ఎమ్మెల్యేలను కలిశారు. తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం, మెజారిటీ స్థానాలు కైవసం కావటంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు జిల్లావ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు. 

31 పీఏసీఎస్‌లకు ఎన్నికలు

జిల్లాలో 32 పీఏసీఎస్‌లు ఉన్నాయి. వీటిలో సంగెం పీఏసీఎస్‌ పాలకవర్గం పదవీకాలం గడువు వచ్చే ఆగస్టు వరకు ఉన్నందున ఈ సొసైటీకి ప్రస్తుతం ఎన్నికలు జరగలేదు. దీంతో అధికారులు 31 పీఏసీఎస్‌లకు సహకార ఎన్నికలు నిర్వహించారు. ప్రతి పీఏసీఎస్‌ పరిధిలో 13 చొప్పున 31 పీఏసీఎస్‌ల పరిధిలో మొత్తం టీసీల సంఖ్య 403. అయితే ఎస్టీలు లేకపోవటం వల్ల గీసుగొండ మండలం మొగిలిచర్ల పీఏసీఎస్‌ పరిధిలో 1, దాఖలైన నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురి కావటం వల్ల ఇదే మండలంలోని ఎలుకుర్తి పీఏసీఎస్‌ పరిధిలో 3 టీసీల్లో ఇపుడు ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో 31 పీఏసీఎస్‌ల పరిధిలో 399 టీసీల్లో ఎన్నికలు జరిగాయి. 6 నుంచి 8వ తేదీ వరకు స్వీకరించిన 1,564 నామినేషన్లను ఎన్నికల అధికారులు 9వ తేదీన పరిశీలించారు. 164 నామినేషన్లు తిరస్కరించి 1,400 నామినేషన్లను ఓకే చేశారు. 10వ తేదీన 645 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 25 పీఏసీఎస్‌ల పరిధిలోని 128 టీసీల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. పెంచికలపేట, మొగిలిచర్ల పీఏసీఎస్‌ల పరిధిలో అన్ని టీసీల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. మిగత 271 టీసీల్లో 627 మంది అభ్యర్థులు తలపడ్డారు. నూరుశాతం టీసీల్లో ఎన్నిక ఏకగ్రీవమైన రెండింటిని పక్కనపెడితే ఇతర 29 పీఏసీఎస్‌ల పరిధిలో గల 271 టీసీల్లో అధికారులు శనివారం పోలింగ్‌ నిర్వహించారు. సాయంత్రం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఎన్నిక ఏకగ్రీవమైన 128 టీసీలను కలుపుకుని 31 పీఏసీఎస్‌ల పరిధిలోని మొత్తం 399 టీసీల్లో 311 స్థానాల నుంచి టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలిస్తే కాంగ్రెస్‌ కేవలం 80 టీసీలకు పరిమితమైంది. ఇక బీజేపీ బలపర్చిన అభ్యర్థులు కేవలం ఆరు టీసీల్లో గెలువగా ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. 31 పీఏసీఎస్‌ల్లో మెజారిటీ టీసీల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందటం వల్ల 29 పీఏసీఎస్‌లను గులాబీ పార్టీ కైవసం చేసుకున్నట్లు తేలిపోయింది.   ఆత్మకూరు, సంగెం మండలంలోని చింతలపల్లి పీఏసీఎస్‌ల్లో మాత్రమే కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులు మెజారిటీ టీసీల్లో గెలిచినట్లు తెలుస్తుంది. ఆదివారం ఆయా పీఏసీఎస్‌ కార్యాలయంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరగనుంది.

 అత్యధికం ఎలుకుర్తి... అత్యల్పం అమీనాబాద్‌

కొద్ది రోజుల నుంచి రాజకీయంగా ఉత్కంఠ రేపిన సహకార ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. పరకాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో నిర్వహించిన స్థానిక పీఏసీఎస్‌ పోలింగ్‌ కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ జరిగిన 271 టీసీల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 71,934 మంది. వీరిలో 55,824 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే జిల్లాలో సహకార ఎన్నికల పోలింగ్‌ 77.60 శాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి పీఏసీఎస్‌ పరిధిలో 93.78 శాతం పోలింగ్‌ నమోదైంది. 92 శాతంతో పోలింగ్‌ శాతంలో దుగ్గొండి పీఏసీఎస్‌ రెండో స్థానంలో నిలిచింది. సూరిపల్లి పీఏసీఎస్‌ పరిధిలో 91.64 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అమీనాబాద్‌ పీఏసీఎస్‌ పరిధిలో అతి తక్కువగా అంటే కేవలం 48.37 శాతం పోలింగ్‌ మాత్రమే జరిగింది. 68.31 శాతంతో తక్కువ పోలింగ్‌ నమోదైన పీఏసీఎస్‌ల్లో నల్లబెల్లి రెండో స్థానంలో ఉంది. మధ్యాహ్నం పోలింగ్‌ ముగిసిన వెంటనే భోజనం చేసి ఎన్నికల అధికారులు తమ సిబ్బందితో కలిసి ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ఫలితాలు వెల్లడించారు. 29 లొకేషన్లలో 271 టీసీల ఎన్నికలు జరిగాయి. వీటిలో సమస్యాత్మకమైనవిగా గుర్తించిన 26 లొకేషన్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ కేఆర్‌ నాగరాజు స్వయంగా బందోబస్తు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, సహకార ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఆయన వెల్లడించారు. ఆదివారం 31 పీఏసీఎస్‌ కార్యాలయాల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నిక జరిగే పీఏసీఎస్‌ ఆఫీసుల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికతో సహకార ఎన్నికల ప్రక్రియ ముగిసిపోనుంది. 


logo