శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Feb 14, 2020 , 04:28:47

రేపు పోలింగ్‌

రేపు పోలింగ్‌

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరింది. శనివారం పోలింగ్‌ జరుగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు 271 పోలింగ్‌ కేంద్రాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఎన్నికలు జరిగే ఆయా ప్రాదేశిక నియోజకవర్గం(టీసీ) పరిధిలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో ఈ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 350 బ్యాలెట్‌ బాక్సులను ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలకు తరలించారు. ప్రిసైడింగ్‌ అధికారు(పీవో)లు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారు(ఏపీవో)లు ఒకరోజు ముందు అంటే శుక్రవారం పంపిణీ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్‌ బాక్సులు, పేపరుతో బయల్దేరి సాయంత్రం వరకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించి భోజనం చేశాక ఓట్ల లెక్కింపు జరుపుతారు. వెంటనే అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఆదివారం ప్రత్యేక అధికారులు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్‌) చైర్మన్ల, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. ఆయా పీఏసీఎస్‌ కార్యాలయాల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది. జిల్లాలో మొత్తం 31 పీఏసీఎస్‌ల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక కోసం జిల్లా కలెక్టర్‌ ఎం హరిత ప్రతి పీఏసీఎస్‌కు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. మూడు టీసీలకు ఎన్నికలు లేని గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి పీఏసీఎస్‌లో కూడా ప్రస్తుతం ఎన్నికయ్యే పది మంది డైరెక్టర్లలో మెజారిటీ సభ్యులు సమావేశానికి హాజరైతే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక 16వ తేదీన జరుగనుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 3వ తేదీన సహకార ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. ఈ మేరకు 6 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 9వ తేదీన పరిశీలన జరిగింది. 10న సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అదేరోజు ఎన్నికల అధికారులు బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. జిల్లాలో సహకార ఎన్నికలు నిర్వహించతలపెట్టిన 31 పీఏసీఎస్‌ల్లో గీసుగొండ మండలంలోని మొగిలిచర్ల, ఆత్మకూరు మండలంలోని పెంచికలపేట పీఏసీఎస్‌ల పరిధిలోని అన్ని టీసీల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎస్టీలు లేకపోవడం వల్ల మొగిలిచర్ల పీఏసీఎస్‌ పరిధిలో 1 టీసీకి, నామినేషన్లు తిరస్కరణకు గురి కావటంతో ఎలుకుర్తి పీఏసీఎస్‌ పరిధిలోని 3 టీసీల్లో ప్రస్తుతం ఎన్నికలు జరగటం లేదు. పెంచికలపేట, మొగిలిచర్ల సహా 25 పీఏసీఎస్‌ల పరిధిలో మొత్తం 128 టీసీల్లో ఎన్నిక ఏకగ్రీవం కావడంతో మిగిలిన 271 టీసీల్లో పోటీ ఏర్పడింది. ఈ 271 టీసీల్లో 627 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తలపడుతున్నారు. వీరిలో ఆయా టీసీ నుంచి ఒక్కొకరి లెక్కన 271 మంది టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు ఉన్నారు.

  తెలుపు రంగు బ్యాలెట్‌

శనివారం పోలింగ్‌ జరుగనున్నందున సహకార శాఖ అధికారులు తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ పూర్తి చేశారు. జిల్లాలో ఎన్నికలు జరిగే 29 పీఏసీఎస్‌ల పరిధిలోని 271 టీసీల పరిధిలో 71,934 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. దీంతో సుమారు 85 వేల బ్యాలెట్‌ పేపరును ముద్రించి ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలకు పంపినట్లు తెలిపారు. పరకాలలోని గణపతి బీఈడీ కళాశాల, వరంగల్‌ రంగశాయిపేట వద్ద ఉన్న గణపతి ఇంజినీరింగ్‌ కళాశాల, నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో ఈ ఎన్నికల సామగ్రి పంపిణీ సెంటర్లు ఏర్పాటు చేశారు. పీవోలు, ఏపీవోలు శుక్రవారం ఈ సెంటర్ల నుంచి ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్‌ బాక్సులతో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తారు. వీరి ప్రయాణానికి ఎన్నికల అధికారులు 28 వాహనాలు సిద్ధం చేశారు. 13 జోన్లు, 29 రూట్ల ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించారు. రూట్‌కు ఒక వాహనం సమకూర్చిన అధికారులు సంగెం మండలం చింతలపల్లి పీఏసీఎస్‌ పరిధిలో ఎన్నిక జరిగే టీసీ ఒకటే ఉండడం, దీని పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్య కేవలం 54 మాత్రమే కావడం వల్ల ఈ టీసీ గల రూట్‌లో ప్రత్యేక వాహనం అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక పీవోను, ఆయా పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఏపీవోలను రిజర్వ్‌లో ఉండే వారిని కలిపి మొత్తం సుమారు 850 పీవోలు, ఏపీవోలను నియమించారు. పోలింగ్‌ నిర్వహణ, కౌంటింగ్‌, ఫలితాల వెల్లడిపై వీరికి ఈ నెల 10వ తేదీన శిక్షణ ఇచ్చారు. పరకాల, ఖానాపురం పీఏసీఎస్‌కు సంబంధించి మాత్రమే స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర పీఏసీఎస్‌ల పరిధిలోని అన్ని టీసీల పోలింగ్‌ కేంద్రాలు ఆయా టీసీల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సహకార ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే పోలీసు అధికారులు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.