శుక్రవారం 29 మే 2020
Warangal-rural - Feb 12, 2020 , 03:20:12

సమష్టి కృషితోనే మేడారం జాతరలో నిరంతర విద్యుత్‌

సమష్టి కృషితోనే మేడారం జాతరలో నిరంతర విద్యుత్‌

వరంగల్‌ సబర్బన్‌, నమస్తే తెలంగాణ : సంస్థలో పని చేసే అన్నిస్థాయిల సిబ్బంది కృషితోనే మేడా రం జాతరలో నిరంతరం విద్యుత్‌ సరఫరా వీలైందని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు అన్నారు. ఆదే స్ఫూర్తిని ముందుముందు కూడా కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం నక్కలగుట్టలోని విద్యుత్‌ భవన్‌లో మహబూబాబాద్‌, భూపాలపల్లి, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌, జనగాం, ఖమ్మం, కొత్తగూడెం సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈ, ఏడీఈ, ఏఈలతో పాటు అన్ని స్థాయిల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బకాయిపడిన బిల్లులను కూడా వెంటనే వసూలు చేయాలని అన్నారు. సంస్థ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలను పూర్తి స్థాయిలో తగ్గించాలని చెప్పారు. డిపార్ట్‌మెంట్‌ వాహనాల్లోనే ట్రాన్స్‌ఫార్మర్లను రవాణా చేయాలని ఆదేశించారు. 33కేవీ, 11కేవీ విద్యుత్‌ లైన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. విద్యుత్‌ అంతరాయాలను తగ్గించాలంటే లైన్‌ పెట్రోలింగ్‌ తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పని చేసే సిబ్బంది తప్పనిసరిగా భద్రతాపరమైన చర్యలను తీసుకునేలా చూడాలన్నారు.  కాగా, మేడారంలో నిరంతరం విద్యుత్‌ సరఫరా చేసినందుకు భూపాలపల్లి కలెక్టర్‌ కర్ణన్‌ అందించిన మెడల్‌, షీల్డ్‌ను ఎస్‌ఈ నరేశ్‌ సీఎండీ గోపాల్‌రావుకు అందించారు. సమావేశంలో కంపెనీ డైరెక్టర్లు నర్సింగా రావు, సంధ్యా రాణి, మోహన్‌రెడ్డి, గణపతి, సీజీఎంలు తిరుపతిరెడ్డి, అశోక్‌, తిరుమల్‌రావు, మధుసూదన్‌, కిషన్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాస్‌, జీఎంలు సత్యనారాయణ, వెంకటకృష్ణ, వెంకటరమణ, వేణుబాబు, ఎస్‌ఈలు రాజు చౌహాన్‌, కేఎన్‌ గుట్ట, మల్లికార్జున్‌, నరేశ్‌, రమేశ్‌, సురేందర్‌, నాగప్రసాద్‌ పాల్గొన్నారు. 


logo