మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Feb 09, 2020 , 03:07:55

జనంలో నుంచి వనంలోకి

జనంలో నుంచి వనంలోకి
  • చిలుకలగుట్టకు సమ్మక్క
  • మొక్కులు చెల్లించుకున్న కోటిన్నర భక్తులు
  • తల్లులను దర్శించుకున్న ప్రముఖులు
  • చివరి రోజు వర్షంలోనూ భారీగా మొక్కులు
  • తిరుగు పయనమైన భక్తులు
  • ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాగనంపిన పూజారులు
  • ముగిసిన మేడారం మహాజాతర

మేడారం బృందం, నమస్తే తెలంగాణ:‘సమ్మక్కా.. సల్లంగజూడు .. పిల్లాజెల్లను, గొడ్డూగోదను, చేనూచెలకను, సారలమ్మా.. కడుపులబెట్టుకొని కాపాడు తల్లీ!”..అంటూ వనదేవతల ఎదుట భక్తులు శనివారం మోకరిల్లారు. గద్దెలమీద కొలువైన తల్లులను భక్తులు, ప్రముఖులు చివరి రోజు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, నిలువెత్తు బంగారం కానుకలుగా సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండా, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌ తదితరులు దర్శించుకున్నవారిలో ఉన్నారు. సాయంత్రం వేళ గిరిజన పూజారులు తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వనప్రవేశం చేయించారు. సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు, గోవిందరాజును కొండాయికి సాగనంపారు. సాయంత్రం వర్షం కురవగా, భక్తులు తన్మయత్వంతో ఊగిపోయారు. రెండేళ్లకు మళ్లీ వస్తామని చెబుతూ స్వస్థలాలకు పయనమయ్యారు.