బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Feb 07, 2020 , 03:37:08

ఉప్పోంగిన జనగంగ

ఉప్పోంగిన జనగంగ

(మేడారం నుంచి వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, ములుగు జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ)  సమ్మక్క రాకతో మేడారం ఉప్పొంగింది. భక్త జనకోటి స్వాగతాల మధ్య రాత్రి 9గంటలకు ఆదివాసుల ఆరాధ్య దేవత గద్దెపై కొలువైంది. ఈ ఘట్టం కోసం ఎదురుచూసిన మేడారం భక్తులంతా ఒక్కసారిగా తల్లిని దర్శించుకునేందుకు భక్తిభావంతో గద్దెల దారి చీమలబారులా కనిపించింది. మేడారం జనావర్ణమైంది.. సమ్మక్క రాకకు ముందుగా దారి పొడవునా ముగ్గులతో అలంకరించి జీవాలను బలిచ్చి స్వాగతించారు. కోట్లాది భక్తుల కొంగు బంగారమై పసుపు పీతాంబరమై మురిసిపోయింది..  కోళ్లు, మేకలు, గొర్రెలు తలలు తెంచుకుని తల్లికి హారతి పట్టాయి. కొక్కెర కృష్ణయ్య సమ్మక్క  చేతబట్టిన కోయ బిడ్డలు అతి సామాన్యుడే అయినా అమ్మను చేతుల్లోకి తీసుకుని దైవదూతగా మారాడు. చిలుకలగుట్ట నుంచి తనకు మాత్రమే తెలిసిన రహస్యతావు నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్కను చేబూని జలకం వడ్డె అలుకు చల్లుతుండగా కొమ్మువడ్డెలు వాయిద్యాలు మోగిస్తుండగా సమ్మక్క తల్లి మేడారానికి పయనమైంది.


ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఉన్న గద్దెలపైకి అమ్మ సమ్మక్క చేరడంతో జాతర పరిపూర్ణమైంది. చిలుకలగుట్ట నుంచి తల్లి ఆగమనానికి సంకేతం ఇస్తూ  ములుగు ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపి ఆకాశ తల్లికి తూటా స్వాగతం పలికారు. జనరాశిపై జలవడ్డె నీళ్లు చల్లారు. కొమ్ము వడ్డెలు కోయ తల్లికి ఇష్టరాగాలు ఆలపించారు. ఈ అద్భుత దృశ్యాలతో మేడారం పులకించిపోయింది.  ఈ దృశ్యం చూసేందుకు కనివిని ఎరుగని రీతిలో చిలుకలగుట్టకు జనగంగ ఉప్పొంగింది. సమ్మక్క ప్రధానవడ్డె కొక్కెర కృష్ణయ్య సహ ఎవరికి వారుగా రహస్యదారుల్లో  తల్లి తావుకు చేరుకుని వెళ్లిపోయారు. సమ్మక్క నెలవైన చిలుకలగుట్ట పాదాల దగ్గర తల్లి కోసం మేడారం భక్తకోటి మోకరిల్లింది.  తారతమ్యా లు లేవు.. ఎవరైనా సరే చిలుకలగుట్ట దగ్గర చీమలైపోవాల్సిందే అన్నట్టు ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది.  ఇప్పటిదాకా సారలమ్మ దీవెనలు పొందిన జనం ఇక సమ్మక్క ఆశీర్వాదాలు అందుకోనున్నారు. మరో రెండు రోజులు వనదేవతలు తిరిగి అడవిలోకి వెళ్లిపోయే వరకు జాతరే జాతర.. 


అచ్చమైన ఆదివాసీ గిరిజన పండుగ

తల్లి సమ్మక్క రాకతో మేడారం జాతర పరిపూర్ణమైంది.. నింగి నుంచి ధ్రువతార తేవడమే అన్నట్లు వ్యవహరించిన అడవి బిడ్డలు.. సమ్మక్కను అధికార లాంఛనాలతో చిలుకలగుట్ట నుంచి మేడారంలోని గద్దెలపైకి చేర్చా రు. ఈ అపురూప సన్నివేశాన్ని కళ్లారా వీక్షించేందుకు గు రువారం మధ్యాహ్నం 2 గంటల నుంచే లక్షలాది మంది భక్తులు చీమలై దారులు తీశారు. కలెక్టర్‌, ఎస్పీ సహ అధికార యంత్రాంగం అంతా అతి సామాన్యులై చిలుకలగుట్ట పాదాల వద్ద మోకరిల్లారు. డోలి విన్యాసాలు.. కొమ్ము పాటలు, తుడుందెబ్బ ఆదివాసీ సంప్రదాయాలు ఆ తల్లికి ఇష్టమని ఆచరించారు. సంగ్రా మ్‌ సింగ్‌ జీ పాటిల్‌ తుపాకీ పేల్చి తూటా స్వాగతం చెబితే కలెక్టర్లు ఆర్‌వీ కర్ణన్‌, కృష్ణ ఆధిత్య సర్కార్‌ ప్రతినిధులుగా  తల్లికి స్వాగతం పలికారు. సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యను చేరుకుని పదేళ్ల పబ్బతి పట్టి ‘తల్లి నీకు స్వాగతం.. నీ రాజ్యానికి స్వాగతం.. మీ గద్దెకు గౌరవంగా మిమ్మల్ని తోడుకుని వెళ్తాం.. అనుమతి ఇవ్వండి’ అన్నట్టుగా వినమ్రపూర్వంగా తల్లికి అపూర్వస్వాగతం పలికారు.   


కుంకుమ భరిణె

చిలుకలగుట్ట నుంచి తనకు మాత్రమే తెలిసిన గృహం నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్కను చేతపట్టుకుని జలకం వడ్డె మల్లెల ముత్తయ్య అలుకు చల్లుతుండగా కొమ్ము వడ్డెలు వాయిద్యాలు వాయిస్తుండగా సమ్మక్క తల్లి మేడారానికి పయనమైంది. తల్లి రాకను గమనించిన మేడారం ఒక్కసారిగా భక్తిపారవశ్యంతో ఊగిపోయింది.   జనం గూడారాల్లోంచి వచ్చి చిలకలగుట్ట చుట్టూ వాలిపోయారు. తొవ్వ పొడవునా పొర్లు దండాలతో పులకించిపోయారు. పసుపు, కుంకుమను దారి పొడవునా చల్లారు. దాదాపు కిలో మీటరున్నర పొడవునా కోళ్లు, మేకలు, గొర్లు తలలు తెంచుకుని తల్లికి నెత్తుటి నైవేద్యాలయ్యాయి. చెర్నాకోలలు చేతబూనిన శివసత్తులు పూనకాలతో హోరెత్తించారు.  చిలుకలగుట్ట నుంచి చెల్పాయ చెట్టు దాకా.. అక్కడి నుంచి మేడారం గ్రామం వరకు ఒక్కటే సందోహం. ఇసుక పోస్తే రాలని జనం. సమ్మక్క తల్లికి జై..  అంటూ మొక్కుల నాదంతో మార్మోగింది. 


తల్లిని స్వాగతించిన మంత్రులు, ప్రముఖులు 

గురువారం సాయంత్రం చిలుకలగుట్ట దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ములుగు జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ సమ్మక్కకు స్వాగతం పలికారు.  వరంగల్‌ తూర్పు, ములుగు, భద్రాచలం ఎమ్మెల్యే లు నన్నపునేని నరేందర్‌, సీతక్క, పోదెం వీరయ్య, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషన్‌ క్రిస్టినా జడ్‌ చోంగ్తు, కలెక్టర్లు ఆర్వీ కర్ణన్‌, కృష్ణ ఆధిత్య, మేడారం జాతర నోడల్‌ ఆఫీసర్‌ వీపీ గౌతమ్‌ సహ ఆదివాసీ సంఘాలు స్వాగతం పలికారు. తుడుందెబ్బ ప్రతినిధులు వట్టం ఉపేందర్‌  నేతృత్వంలోని బృందం ఆదివాసీ ఆచార సంప్రదాయాల కళాబృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.   


నేడు గవర్నర్లు, సీఎం రాక

తల్లీబిడ్డలు గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళీసై సౌందర్‌రాజన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు తల్లులను దర్శించుకోనున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఉదయం 10గంటలకు గవర్నర్‌ తమిళీసై సౌందర్‌రాజన్‌ రానుండగా, 11గంటలకు సీం కేసీఆర్‌ రానున్నారు.


logo