శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Feb 07, 2020 , 03:36:23

సర్వం.. సమ్మక్క నామస్మరణం

సర్వం.. సమ్మక్క నామస్మరణం

వరంగల్‌,నమస్తేతెలంగాణ: కోట్లాది భక్తుల ఆరాధ్యదైవం సమ్మక్క చిలుకలగుట్ట దిగి గద్దెకు బయలుదేరిన క్షణాల్లో మేడారం భక్తి పారవశ్యంతో ఊగిపోయింది. రెండేళ్ల జ్ఞాపకాలను మూట కట్టుకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తల్లి సమ్మక్క వచ్చే అద్భుత దృశ్యాన్ని ఒళ్లంతా కండ్లు చేసుకుని చూశారు. చిలుకలగుట్ట నుంచి గద్దె వరకు దారి వెంట లక్షలాది మంది భక్తులు జయజయ ధ్వానాలతో స్వాగతం పలికారు. జాతర అంతా శివసత్తులు పూనకాలతో ఊగిపోయింది. తన్మయత్వంతో భక్తులు చేసిన సమ్మక్క నామస్మరణతో మేడారం మార్మోగింది. తల్లీ.. సమ్మక్క దీవించూ అంటూ  భక్తులు పరవశించిపోయారు. సమ్మక్క వచ్చే దారి పొడవునా ముగ్గులు వేసి ఎదురుకోళ్లతో తల్లికి స్వాగతం పలికారు. గద్దెపైకి సమ్మక్క వస్తున్న అపురూప సన్నివేశాన్ని చూసేందుకు  భక్తులు పోటెత్తారు. జన్మధన్యమైందంటూ సమ్మ క్క స్మరణలో మునిగిపోయారు. నాలుగు రోజుల జాతరలో భాగంగా సమ్మ క్క రాకతో ప్రధాన ఘట్టం ముగిసింది. మూడు రోజుల నిద్రతోనే ముక్తి అని నమ్మే భక్తులు ఇక తల్లీబిడ్డల దర్శనం కోసం గద్దెల వద్దకు పయనమయ్యారు.


ఉద్విగ్న క్షణాలు

మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసువచ్చే క్షణమే.. తల్లి గద్దెకు చేరుకున్న వెంటనే భక్తులు పరవశించిపోయారు. గుడారాలు, విడిది కేంద్రాల వద్దనే భక్తులు సమ్మక్కకు మొక్కుతూ కోళ్లు, గొర్రెలను బలిచ్చారు. రెండు రోజుల పాటు గద్దెలపై కొలువుదీరనున్న తల్లీబిడ్డలను దర్శించుకునేందుకు జాతర అంతా సన్నద్ధమైంది.  


ముగిసిన ప్రధాన ఘట్టం

నాలుగు రోజుల మహా జాతరలో ప్రధాన ఘట్టం ముగిసింది. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపై కొలువుదీరడంతో మొదలైన జాతర గురువారం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెలను చేరుకోవడంతో జాతరలోని ప్రధాన ఘట్టం ముగిసింది. ఇక మొక్కులు చెల్లించే ఘట్టం మిగిలింది.  రెండు రోజులు వనదేవతలు భక్తులకు దర్శనం ఇవ్వనుండడంతో మేడారం భక్త జనంతో నిండిపోయింది. శనివారం సాయంత్రం వరకు తల్లులు గద్దెలపై ఉండడంతో జాతర అంతా భక్తిభావం ఉప్పొంగుతోంది.


ఇక మొక్కుల చెల్లింపులు

మేడారం జాతరలో సమ్మక్క-సారలమ్మ గద్దెకు చేరుకోవడంతో క్యూ లైన్లు మొక్కులు చెల్లించే భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవార్లు భక్తులు తల్లీబిడ్డలకు మొక్కులు చెల్లించుకున్నారు. లక్షలాదిగా భక్తులు తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు గద్దెల వద్ద పోటెత్తారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నప్పటికీ తల్లీబిడ్డలు సమ్మక్క-సారలమ్మ గద్దెకు చేరుకున్నాకనే మొక్కులు చెల్లించాలని లక్షల మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. 


logo