గద్దెనెక్కిన వరాల తల్లి

మేడారం బృందం : వన మేడారం జనమేడారంగా రూపాంతంరం చెందింది. రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజాతరలో తొలిఘట్టం ముగిసింది. కన్నెపల్లి వెన్నెలమ్మ గద్దెకు చేరింది. తమ ఇంటి ఆడబిడ్డను మేడారం గద్దెపై కొలువుదీర్చేందుకు కోయగిరిజన వడ్డెలు ఆదిమ గిరిజన సంసృ్కతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ఆచరించారు. బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మేడారం ఎటు చూస్తే అటు జనవర్ణమై పరివ్యాప్తమైంది. కన్నెపల్లి నుంచి సారలమ్మను ప్రధాన వడ్డె కాక సారయ్య చేబూని మేడారానికి తోడ్కొని రాగా ఆయనను ఇతర వడ్డెలు సహ సమస్త యంత్రాంగం భక్తకోటి కదిలివచ్చింది. కన్నెపల్లి నుంచి మేడారానికి మూడు కిలోమీటర్ల దూరం ఈ దారంతా జై సారక్క.. జై సమ్మక్క అంటూ నినాదాలతో మార్మోగింది. సారలమ్మ రాకతో మేడారం పులకించిపోయింది. మరోవైపు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు ఇలా ముగ్గురు కలిసి మేడారం గుడిలోని సమ్మక్క గుడి లో ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి అర్ధరాత్రి దాటాకా మేడారం గద్దెపై కొలువుదీరారు. సారలమ్మ రాకతో మేడారం పులకించిపోయింది. మేడారం భక్తజన గుడారంగా మారిపోయింది.
తొవ్వపొడవునా జనసందోహం
సారలమ్మ మేడారానికి బయలుదేరిందన్న సమాచారం తెలుయగానే మేడారం జాతర ప్రాంగణం నుంచి భక్తులు తండోపతండాలుగా కన్నెపల్లికి పరుగులు తీశారు. గుడి నుంచి బయటికి రాగానే సారలమ్మ కన్నెపల్లి వాడవాడ తిరగుతూ బిడ్డలకు దీవెనలిచ్చింది. ఇల్లిల్లూ సారలమ్మకు చీరె, సారె పోసి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంది. ఆదివాసీ సంంప్రదాయాల ప్రకారం అత్యంత నియమ నిష్టలతో ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ఉన్న ప్రధాన వడ్డె కాక సారయ్య అధ్వర్యంలో సారలమ్మ మేడారం గద్దెకు పయనమైంది. కన్నెపల్లి నుంచి మేడారానికి దాదాపు మూడు కిలోమీటర్ల పొడవునా దారికి ఇరువైపులా జన సందోహం పోటెత్తింది. శిగాలూగే శివసత్తుల పూనకాలతో జాతర మార్మోగింది. ఎదురుకోళ్లు సమర్పిస్తూ ఒడిబియ్యం చల్లుతూ, కొబ్బరికాయలు కొడుతూ జనం సారలమ్మకు నీరాజనం పలికారు.
పులకించిన మేడారం
మేడారం పోలిమేరలోకి సారలమ్మ రాగానే సంబుర వాతావరణం వెల్లివిసింది. అప్పటికే పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు తరలివచ్చారు. ఈ ఇద్దరు సారలమ్మ ఎదురు చూస్తున్న తరుణంలో మేడారానికి సారలమ్మ వచ్చిందన్న సంకేతంలో గుడి ప్రాంగణం సందడిగా మారింది. సారలమ్మ మేడారం గుడిలోకి చేరగానే ఆదివాసి సంప్రదాయ విన్యాసాలతో డోలి మోతలు, కొమ్ము బూరల నాదాలతో మేడారం దద్దరిల్లాయి. ప్రత్యేక పూజలు ముగిసిన తర్వాత ముగ్గురు కలిసి మేడారం గద్దెల ప్రాంగణానికి బయలుదేరారు. అర్ధరాత్రి 12:23 గంటలకు సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠించారు. అదే విధంగా పగిడిద్దరాజు, గోవింద రాజులు వారి వారి గద్దెలపై ఆసీనులయ్యారు. కాగా, గద్దెలపైకి చేరుకున్న సారలమ్మకు ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కర్ణన్, డీఆర్వో రమాదేవి స్వాగతం పలికారు.
అనేక రక్షణ వలయాల మధ్య సారలమ్మ
సారలమ్మను తోడ్కొని వచ్చేందుకు ఆదివాసీ యువత, తుడుందెబ్బ, సారలమ్మ యువజన సంఘం ప్రత్యేక వలయాలుగా మారి తమ ప్రాణపథంగా భావించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తుడుం దెబ్బ సహ పలు ఆదివాసీ సంఘాలు త్రివలయ విధానంతో సారలమ్మకు రక్షణగా నిలిచారు. పోలీసులు సైతం రెండు రోప్ పార్టీలను ఏర్పాటు చేయడమే కాకుండా రోడ్ క్లియరెన్స్ పార్టీలతో ఎటువంటి తొక్కిసలాట జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కన్నెపల్లి నుంచి జంపన్నవాగు దాక ఒక దృశ్యం.. జంపన్నవాగు నుంచి మేడారం వరకు మరో దృశ్యం. ఈ రెండు దృశ్యాల మధ్య జంపన్నవాగు ఒక్కసారిగా కో..కో.. రాగాలతో ఓలలాడింది. ఉప్పొంగిన జంపన్న అక్క కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నాడా.. అన్నంత ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మొత్తంగా మేడారం మహాజాతరలో తొలిఘట్టం బుధవారం రాత్రి వరకు కొనసాగి ముగిసింది. ఇక జాతరలో అసలు దృశ్యం, జాతర సంపూర్ణ దృశ్యం నేడు (గురువారం) ఆవిష్కృతం కాబోతున్నది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క రాక కోసం మేడారం భక్తకోటి ఒళ్లంతా కనులేసుకొని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆ అబ్బురపడే అపూర్వ సందర్భం ఈ రోజు సాయంత్రం నుంచి చిలుకలగుట్ట నుంచి మేడారం దాకా ఉద్విగ్న క్షణాలతో ఉప్పొంగే ఆనందంతో ఎదురు చూస్తోంది..
అలకబూనిన పూజారులు
మేడారం మహా జాతర తొలిఘట్టమైన సారలమ్మ రాక విషయంలో పూజారులు కొద్దిసేపు అలకబూనారు. ఆదివాసీ సంప్రదాయాలకు విఘాతం కలిగిందని, పూజాక్రతుల విషయంలో, తమకు అవమానం జరిగిందని, అందుకు పోలీసుల అత్యుత్సాహమే కారణమని కోయ గిరిజన పూజారులు పేర్కొన్నారు. మరోవైపు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు రాక సమయం ఆలస్యమైంది. ఈ ఆలస్యానికి కారణం పోలీసుల వ్యవహార సరళే కారణమని అటు పూజారులు, ఇటు ఆదివాసీ సంఘాలు ఆరోపించాయి.
తాజావార్తలు
- రైతు సంక్షేమానికి సర్కారు కృషి : మండలి చైర్మన్ గుత్తా
- నానబెట్టిన నల్ల శనగలు తినొచ్చా.. తింటే ఏంటి లాభం.?
- సీఎంఆర్ సంస్థను రద్దు చేయాలి
- ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్కు ఐదో స్థానం
- స్టంట్ చేస్తుండగా సంపూర్ణేశ్కు ప్రమాదం..!
- ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
- మెరుగ్గానే శశికళ ఆరోగ్యం
- రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్గా సంగక్కర
- శరీరంలో ఈ 7 అవయవాలు లేకున్నా బతికేయొచ్చు!!
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక