బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Feb 05, 2020 , 04:04:42

7న మేడారానికి సీఎం, గవర్నర్‌ రాక

7న మేడారానికి సీఎం, గవర్నర్‌ రాక

మేడారం బృందం, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళీసై సౌందర్‌రాజన్‌ ఈ నెల 7న మేడారం మహాజాతరకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 7న ఉదయం 11గంటలకు హెలికాప్టర్‌ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడారానికి చేరుకుంటారు. సుమారు అరగంట పాటు జాతరలో ఉండి తల్లులను దర్శించుకోనున్నారు.  అదేవిధంగా ఉదయం పది గంటలకు గవర్నర్‌ వనదేవతలను దర్శించుకోనున్నారు. ఒకేరోజు ముఖ్యమంత్రి, గవర్నర్‌ మేడారం వనదేవతల దర్శనానికి వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు  భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తున్నారు. 


పర్యటనను విజయవంతం చేయాలి : కలెక్టర్‌

ఈనెల 7న మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వస్తున్న  గవర్నర్‌ తమిళీసై సౌందర్‌రాజన్‌, సీఎం కేసీఆర్‌ పర్యటనను విజయవంతం చేయాలని ములుగు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మంగళవారం డీఎస్‌వో, జెడ్పీ సీఈవో, ట్రాన్స్‌కో ఫైర్‌ ఆఫీసర్‌, డీపీవో, జిల్లా పౌరసంబంధాల అధికారితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ అధికారులు జనరేటర్‌ను ముందుగానే పరీక్షించుకోవాలన్నారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌తో ఆహార భద్రతకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. పారిశుధ్య చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారితో సూచించారు. జిల్లా పరిషత్‌ సీఈవో శిరీషను జంపన్నవాగువైపు, పారిజాతంను ఆర్టీసీ రోడ్డు వైపు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. దేవాలయ క్యూలైన్లలో 9చోట్ల తాగునీటికి చర్యలు తీసుకోవాలని జేసీకి సూచించారు. సమావేశంలో ములుగు ఓఎస్డీ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో హనుమంతు, జేసీ స్వర్ణలత, ఇన్‌చార్జి డీఆర్వో రమాదేవి పాల్గొన్నారు.


logo