శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Feb 05, 2020 , 04:00:32

కన్నెపల్లి కల్పవల్లి

కన్నెపల్లి కల్పవల్లి

మేడారం బృందం : ఆదివాసీ ఆడబిడ్డ..కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ రాకకోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న ఘడియలు.. తమ ఇంటి ఆడబిడ్డను మేడారం గద్దెపై ప్రతిష్ఠించేందుకు కన్నెపల్లి ఆడపడచులు సర్వం సిద్ధం చేశారు. గిరిజనుల ఆరాధ్యదైవం సారలమ్మను ఆదివాసీ పూజారులు బుధవారం మేడారం గద్దెలపైకి తీసుకువచ్చేందుకు కోయగిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు, క్రతులు చేస్తున్నారు. మేడారానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోనున్న కన్నెపల్లిలో కొలువైన సారలమ్మ రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు.  


ప్రత్యేక ఉపవాస దీక్షలో ఉన్న సారలమ్మ ప్రధాన వడ్డె కాక సారయ్య నేతృత్వంలోని అనేక మంది వడ్డెలు, కన్నెపల్లి వెన్నెలమ్మను మేడారం తోడ్కొని వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డోలు వాయిద్యాలు, కొమ్ముబూరలు సహ  కోయ ఆచారాలకు అనుగుణమైన విధానంలో తమకు మాత్రమే ప్రత్యేకమైన పూజా విధానాలు ఆచరించి  మేడారానికి తోడ్కొని వస్తారు. ఈ సందర్భంగా సారలమ్మ ముందు సోలం వెంకటేశ్వర్లు హన్మంతుడి జెండా పట్టుకొని ముందుకు సాగుతుండగా ఆ వెనక సారలమ్మ మేడారానికి వచ్చే అపురూప సన్నివేశం ఆవిష్కృతంకానుంది.  సారలమ్మ తమ్ముడు జంపన్నను కలుసుకుని మేడారం పయనమవుతారు. ఈ సందర్భంగా తల్లి సమ్మక్కను కలుసుకునేందుకు మేడారంలో సమ్మక్క గుడి వద్దకు సారలమ్మను పూజారులు తీసుకొస్తారు. ఇదే సమయంలో పూనుగొండ్ల నుంచి తండ్రి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు సమ్మక్క గుడివద్దకు చేరుతారు.