తల్లుల దర్శనానికి తరలిరండి

(వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ): ‘మేడారం జాతర అంటే చిన్నప్పటి నుంచి మస్తు సంబురం. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర వస్తుందంటే దేశంలోనే ఆదివాసీలకు పెద్ద జాతర. ఆదివాసీలు, గిరిజనులు మాత్రమే కాదు అందరూ తల్లులకు మొక్కులు చెల్లించేందుకు ఎక్కడిక్కెడినుంచో వస్తరు. ఈసారి కోటిన్నర భక్తులు వస్తరని ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనా వేశారు. ఆ అంచనాలకు తగ్గట్టుగా చరిత్రలో నిలిచిపోయే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినం. భక్తులకు ఎక్కడా ఏ చిన్నలోటు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేశ నలుమూలల నుంచి, వివిధ దేశాల నుంచి భక్తులు వస్తున్నారు. ఎవరికి వారుగా క్రమశిక్షణతో, తమ మొక్కులు అప్పగించేందుకు, ప్రశాంతంగా జాతరను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయంతో ముందుకు వెళుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదయాలకు అనుగుణంగా జాతరను నిర్వహించేందుకు ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అనేక రాష్ర్టాల నుంచి ఆదివాసీ సంప్రదాయ కళల్ని ప్రదర్శించేందుకు గిరిజన మ్యూజియాన్ని సిద్ధం చేశామన్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లు, జాతర ప్రాంగణంలో నెలకొల్పిన సౌకర్యాలు మొదలైన అంశాలపై ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలిలా ఉన్నాయి.
నమస్తే తెలంగాణ: మేడారం మహాజాతర నిర్వహణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
మంత్రి ఎర్రబెల్లి: దేశంలో ఇటువంటి జాతర ఎక్కడా లేదు. మేడారం అంటే ఆదివాసీ గిరిజనులు వారి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మేడారం సమ్మక్క-సారలమ్మలంటే చాలా ఇష్టం. తెలంగాణ ఉద్యమ దెబ్బకు ఆనాటి సమైక్యప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. అదీ అరకొరగా చేసేది. కానీ రాష్ట్రం వచ్చిన తరువాత జాతరకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. చరిత్రలో ఎప్పుడూలేనివిధంగా మూడునెలల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నాం. ఈసారి రూ.75 కోట్లను విడుదల చేశాం. జాతీయ రహదారి (163) జనగామ నుంచి రాంపూర్ దాకా కొద్దిగా ఇబ్బందులున్న విషయాన్ని దృష్టిలోపెట్టుకొని నేషనల్ హైవేస్ వాళ్లతో మాట్లాడినం. చాలా వరకు జాతరకొచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులులేకుండా మరమ్మతులు చేశాం. రాంపూర్ నుంచి ఆరేపల్లి మీదుగా ములుగు రోడ్‌తో కలిసే విధంగా ఏర్పాట్లు చేశాం. రోడ్లన్నీ మెరిసేలా చేశాం. కాటారం-కాల్వపల్లి రోడ్డుకొత్తగా ఈసారి తెరిచినం. భూపాలపల్లి మీదుగా వచ్చే మహారాష్ట్ర భక్తులకు అది చాలా దగ్గరి దారి అవుతుంది. అటు ఛత్తీస్గడ్ నుంచి వచ్చేవాళ్లకు ముళ్లకట్ట బ్రిడ్జి నుంచి, ఖమ్మం నుంచి వచ్చేవాళ్లకు మంగపేట నుంచి ఇట్ల అన్ని దిక్కులా అద్భుతమైన రోడ్లు ఏర్పాటు చేశాం.
నమస్తే తెలంగాణ: జాతర నిర్వహణలో వివిధ శాఖల మధ్య సమన్వయం సరిగా లేదని ప్రచారం జరుగుతోంది? దీనికి మీ కామెంట్
మంత్రి ఎర్రబెల్లి: అది తప్పుడు ప్రచారం. అన్ని శాఖల అధికారులు నెల రోజులుగా పనిచేస్తున్నారు. ఐఏఎస్ అధికారులు, పది మంది ఐపీఎస్ అధికారులు పనిచేస్తున్నారు. దేవాదాయ శాఖ, పోలీసు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్టీసీ, రోడ్లు భవనాలు, విద్యుత్ ఇలా జాతర నిర్వహణలో భాగస్వామ్యమైన అన్ని శాఖల మధ్య మంచి సమన్వయంతో పనిచేస్తున్నారు. జాతర అంటే ఒక్కశాఖ మాత్రమే కాదు.. అన్ని శాఖలు తమ ఇంటిపండుగలా భావించి అన్ని పనులు చేస్తున్నాయి. ఎక్కడా ఏ లోటు రాకుండా భక్తులు తల్లుల్ని దర్శించుకోవడానికి ప్రశాంతమైన ఏర్పాట్లు చేశాం.
నమస్తే తెలంగాణ: ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా?
మంత్రి ఎర్రబెల్లి: జాతరకొచ్చే భక్తులు ప్రశాంతంగా సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని తిరిగి వారి ఇండ్లండ్లకు సురక్షితంగా చేరే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. నేషనల్ హైవేస్వాళ్లతో మాట్లాడినం. వరంగల్ సిటీ మీద ట్రాఫిక్ భారం పడకుండా రాంపూర్ నుంచి ఆరేపల్లి మీదుగా వాహనాలు నడుపుతున్నం. ములుగు నుంచి పస్రా దాకా అక్కడి నుంచి తాడ్వాయి మీదుగా మేడారం, భూపాలపల్లి నుంచి మహారాష్ట్ర భక్తులు, ఛత్తీస్గడ్ నుంచి వచ్చే భక్తుల కోసం, ఖమ్మం నుంచి వచ్చే భక్తుల కోసం ట్రాఫిక్‌ను నియంత్రించాం. వన్‌వే ఏర్పాటు చేశాం. ఈసారి బేగంపేట్ నుంచి మేడారం ప్రత్యేక హెలీక్యాప్టర్ సేవలు అందుబాటులో ఉంచాం. అట్లనే ము ఖ్యమంత్రి కేసీఆర్ రై ల్వే వాళ్లతో మాట్లాడి జాతరకు 20 ప్రత్యేకరై ళ్లునడిపిస్తున్నారు. అనేక మార్గాల ద్వారా వచ్చే భ క్తుల కోసం ఎక్కడా ఎవరికి ఎటువంటి ఇబ్బందు లు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.
నమస్తే తెలంగాణ : ఇప్పటికే లక్షలాదిగా భక్తులు తల్లుల్ని దర్శించుకున్నారు? ఈసారి ఎంత మంది వస్తారని అంచనా ?
మంత్రి ఎర్రబెల్లి: నెల రోజుల నుంచే భక్తులు మేడారం బాట పట్టారు. ఇప్పటికే దాదాపు 30 లక్షల మంది భక్తులు తల్లుల్ని దర్శించుకున్నారు. ఈసారి కోటిన్నర దాకా రావచ్చని అంచనా వేశాం. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతీరోజు స్వయంగా ఆయనే ఫోన్ చేసి ఏర్పాట్లను ఆరా తీస్తున్నారు. సీఎస్‌ను, డీజీపీని, మంత్రుల్ని మేడారం పంపి ఏర్పాట్లల్లో ఎక్కడా ఏ లోటు రావద్దని చెబుతున్నారు. మేడారం జాతర అంటే సీఎంకు ప్రత్యేక అభిమానం.
నమస్తే తెలంగాణ: జాతరలో మీ అనుభవాలు వివరిస్తారా? మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మంత్రి హోదాలో తొ లిసారిగా జాతర ఏర్పాట్లను చూ స్తున్నారు. మీరెలా ఫీల్ అవుతున్నా రు?
మంత్రి ఎర్రబెల్లి: మేడారం జాతర అం టే చిన్నప్పటి నుంచి మస్తు సంబురం. జీపేసుకొని పోయేది. స్నేహితులతోని పో యి అక్కడే నాలుగు రోజులుండి వచ్చేది. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా సర్పంచ్‌లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, పార్టీ కార్యకర్తల్ని అందరినీ తీసుకొని తల్లుల్లి ద ర్శించుకొని వచ్చేది. అదృష్టం కొద్దీ ఈసారి మంత్రి గా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తున్న. చాలా సంతోషంగా ఉంది. సమ్మక్క దీవెన. ముఖ్యమంత్రి ఆశీస్సు లు. అంతా వారి దయ. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే మంత్రిగా జాతర ఏ ర్పాట్ల కోసం చాలా సార్లు వెళ్లిన. మంత్రుల్ని తీసుకెళ్లిన.
తాజావార్తలు
- జార్ఖండ్ సీఎంను కలవనున్న తేజస్వీ యాదవ్
- ట్రంప్ అభిశంసన.. ఫిబ్రవరిలో సేనేట్ విచారణ
- వరుణ్ ధావన్- నటాషా వివాహం.. టైట్ సెక్యూరిటీ ఏర్పాటు
- సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు
- ఎలుక మూతి ఆకారంలో చేప.. ఎక్కడో తెలుసా?
- సంప్రదాయానికి స్వస్తి.. తైవాన్ జామతో దోస్తీ..!
- ప్రభాస్‌తో ఢీ అనేందుకు సిద్ధమైన తమిళ హీరో
- కబడ్డీ.. కబడ్డీ.. అదరగొట్టెన్ అదనపు కలెక్టర్
- కాలినడకన తిరుమల కొండెక్కిన జబర్దస్త్ నటుడు
- అన్నాహజారేతో మహారాష్ట్ర మాజీ సీఎం భేటీ