97599 ఇదీ జిల్లాలో సహకార ఓటర్ల సంఖ్య

వరంగల్‌రూరల్ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ : సహకార ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అధికారులు సోమవారం ఓటర్ల తుది జాబితా విడదల చేశారు. జిల్లాలో సహకార ఎన్నికలు జరిగే 31 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల పరిధిలోని 1,50,530 మంది సభ్యుల్లో ఓటు వేసేందుకు 97,599 మందికి అర్హత ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో పురుషులు 73,644, మహిళలు 21,459 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఓటర్ల తుది జాబితాతో పాటు ఆయా పీఏసీఎస్ పరిధిలో ప్రాదేశిక నియోజకవర్గం (టీసీ) వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్లను కూడా ప్రకటించారు. ప్రతి పీఏసీఎస్ పరిధిలోని 13 టీసీల్లో ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్సీ మహిళ, ఒకటి ఎస్టీ, 2 బీసీ, ఒకటి ఓసీ మహిళ, 7 ఓపెన్ కేటగిరి(ఓసీ)కి కేటాయించారు. ఈ లెక్కన జిల్లాలో ఎన్నికలు జరిగే 31 పీఏసీఎస్‌ల పరిధిలోని మొత్తం 403 టీసీల్లో 62 ఎస్సీ, 31 ఎస్టీ, 62 బీసీ, 248 ఓసీలకు కేటాయించినట్లు తెలిపారు. ఎస్సీలకు కేటాయించిన 62 టీసీల్లో 31, ఓసీలకు కేటాయించిన 248 టీసీల్లో 31 మహిళలకు రిజర్వ్ చేసినట్లు వెల్లడించారు. దీంతో మహిళలకు జిల్లాలో మొత్తం 62 టీసీలు రిజర్వ్అయినట్లు స్పష్టమైంది. ఓటర్ల తుది జాబితా, రిజర్వేషన్ల వివరాలను టీసీ వారీగా ఎన్నికల అధికారులు ప్రతి పీఏసీఎస్ పరిధిలో ప్రదర్శించారు. వెంటనే ఆయా పీఏసీఎస్ ఎలక్షన్ అధికారి (ఈవో) సహకార ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఆయా పీఏసీఎస్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ప్రాదేశిక నియోజకవర్గం(టీసీ) నుంచి దాఖలైన నామినేషన్లను 9వ తేదీ ఉదయం 11 గంటల నుంచి పరిశీలించి అర్హత పొందిన నామినేషన్ల జాబితాను అదేరోజు పీఏసీఎస్ కార్యాలయం నోటీసు బోర్డుపై ప్రకటిస్తామని తెలిపారు. ఉపసంహరణ గడువు 10వ తేదీ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అదేరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ప్రకటించి అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తామని తెలిపారు. పోటీ లేకపోవటంతో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల పేర్లను కూడా 10వ తేదీన పీఏసీఎస్ కార్యాలయంలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. పోటీ ఏర్పడిన టీసీల్లో ఈ నెల 15వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించి అదేరోజు ఫలితాలను వెల్లడించనున్నట్లు ఆయా పీఏసీఎస్ ఈవో జారీ చేసిన నోటిఫికేషన్లో ప్రకటించారు.
ఓటర్లలో నల్లబెల్లి ఫస్ట్
ఎన్నికల అధికారులు వెల్లడించిన ఓటర్ల తుది జాబితాను పరిశీలిస్తే జిల్లాలో ఎన్నికలు జరిగే 31 పీఏసీఎస్‌ల్లో నల్లబెల్లి పీఏసీఎస్ ఓటర్ల సంఖ్యలో నంబర్‌వన్ స్థానంలో ఉంది. నల్లబెల్లి పీఏసీఎస్ పరిధిలోని 13 టీసీల్లో మొత్తం ఓటర్లు 8,394 ఉన్నారు. దీంతో ఎన్నికలు జరిగే 31 పీఏసీఎస్‌ల్లో అత్యధిక ఓటర్లతో నల్లబెల్లి పీఏసీఎస్ అగ్రభాగాన నిలిచింది. 7,642 మంది ఓటర్లతో చెన్నారావుపేట పీఏసీఎస్ రెండో స్థానంలో ఉంది. దీని తర్వాత ఖానాపూర్ పీఏసీఎస్ 7,166 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. 6,125 మంది ఓటర్లతో రాయపర్తి పీఏసీఎస్ నాలుగు, 5,385 మంది ఓటర్లతో నర్సంపేట ఐదో స్థానంలో ఉంది. ఐదువేల మందికిపైగా ఓటర్లతో జిల్లాలో పెద్ద పీఏసీఎస్‌లుగా పనిచేస్తున్న ఈ ఐదింటిలో రాయపర్తి మినహా ఇతర నాలుగు పీఏసీఎస్‌లు నర్సంపేట శాసనసభ నియోజవర్గం పరిధిలోనివే. ఎన్నికలు జరిగే మిగతా 26 పీఏసీఎస్‌ల్లో ప్రతి పీఏసీఎస్ పరిధిలోనూ ఐదువేల మందిలోపు ఓటర్లు మాత్రమే ఉన్నారు. 646 మంది ఓటర్లతో సంగెం మండలంలోని చింతలపల్లి పీఏసీఎస్ చివరి స్థానంలో ఉంది. ఆ తర్వాత 710 మంది ఓటర్లతో గీసుగొండ మండలంలోని మొగిలిచర్ల పీఏసీఎస్ ఉంది. ఇదే మండలంలోని ఎలుకుర్తి పీఏసీఎస్ పరిధిలో 981, గీసుగొండ పీఏసీఎస్ పరిధిలో 1,199, నెక్కొండ మండలం సూరిపల్లి పీఏసీఎస్ పరిధిలో 1,465 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఐదు పీఏసీఎస్‌లు మినహా ఇతర పీఏసీఎస్‌ల పరిధిలో 1,500 మందికి పైగా ఓటర్లు ఉన్నట్లు తుది జాబితాను పరిశీలిస్తే వెల్లడవుతుంది. తక్కువ ఓటర్లలో రెండోదైన మొగిలిచర్ల పీఏసీఎస్ పరిధిలోని ఎస్టీ ఓటర్లు ఒకరు కూడా లేరు. దీంతో ఈ పీఏసీఎస్ పరిధిలోని 13 టీసీల్లో ఎస్టీకి రిజర్వ్ అయిన ఒక టీసీలో ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఆత్మకూరు మండలం పెద్దాపూర్, ఆత్మకూరుతో పాటు గీసుగొండ మండలంలోని వంచనగిరి, ఎలుకుర్తి పీఏసీఎస్‌ల పరిధిలో కేవలం ఎనిమిదేసి మంది ఎస్టీ ఓటర్లు మాత్రమే ఉన్నారు. గీసుగొండ పీఏసీఎస్ పరిధిలో 11, దుగ్గొండి పీఏసీఎస్ పరిధిలో 14, మదారం పీఏసీఎస్ పరిధిలో 16, పరకాల పీఏసీఎస్ పరిధిలో 20 మంది ఎస్టీ ఓటర్లు ఉన్నట్లు ఆయా పీఏసీఎస్ ఓటర్ల తుది జాబితాను పరిశీలిస్తే స్పష్టం అవుతుంది. ఓటర్ల తుది జాబితా, రిజర్వేషన్ల ప్రకటనతో ఆయా పీఏసీఎస్ ఎలక్షన్ అధికారి ఈ నెల 6 నుంచి 8 వరకు సహకార సంఘం కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
- బంగారు కమ్మలు కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
- ఎములాడలో దంతెవాడ ఎమ్మెల్యే పూజలు
- శ్రీలంక జలాల్లో మునిగిన భారత ఫిషింగ్ బోట్
- హెచ్-1బీ కోసం ఓపీటీ దుర్వినియోగం: దర్యాప్తుకు అమెరికా సిద్ధం!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- భద్రాద్రి కొత్తగూడెంలో తొలిసారిగా బాలల అదాలత్
- ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- దాహం తీర్చే యంత్రం.... వచ్చేసింది..!
- కామెడీ టచ్‌తో ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్
- ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన