ఆదివారం 17 జనవరి 2021
Warangal-rural - Feb 02, 2020 , 03:03:55

టీసీకో పోలింగ్‌ స్టేషన్‌!

టీసీకో పోలింగ్‌ స్టేషన్‌!
  • 31 పీఏసీఎస్‌ల పరిధిలో 403 టీసీలు
  • రేపు టీసీల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రదర్శన
  • పక్కా ప్రణాళికతో నిర్వహించాలని ఆదేశాలు
  • ఎన్నికల ప్రక్రియపై కలెక్టర్‌ హరిత శిక్షణ
  • ఈవోలకు సహాయకులు సీఈవోలు, సిబ్బంది
  • 36 మంది ఎన్నికల అధికారుల నియామకం
  • అదనపు పోలింగ్‌ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు
  • 403 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : జిల్లాలో సహకార ఎన్నికల నిర్వహణకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా జిల్లా కలెక్టర్‌ ఎం హరిత 36 మంది ఎలక్షన్‌ అధికారు(ఈవో)లను నియమించారు. వీరికి శనివారం సహకార ఎన్నికల నిర్వహణపై ఆమె శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, ఆఫీసు బేరర్ల ఎన్నికపై సూచనలు చేశారు. సహకార ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ వెలువడిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లాలోని 32 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్‌)ల్లో సంగెం పీఏసీఎస్‌ పాలకవర్గం పదవీ కాలం ఆగస్టు వరకు ఉంది. మిగతా 31 పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించే ఈవోలుగా జిల్లాలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయ అధికారు(ఏవో)లు నియమితులయ్యారు. గెజిటెడ్‌ అధికారులను మాత్రమే ఈవోలుగా నియమించాలని ప్రభుత్వం సహకార ఎన్నికల నిర్వహణపై విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీంతో జిల్లాలో 31 పీఏసీఎస్‌ల పరిధిలో 36 మంది గెజిటెడ్‌ అధికారులను జిల్లా కలెక్టర్‌ ఈవోలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పీఏసీఎస్‌కు ఒక ఈవో లెక్కన 31 పీఏసీఎస్‌లకు 31 మందితోపాటు మరో ఐదుగురు గెజిటెడ్‌ అధికారులను రిజర్వ్‌ ఈవోలుగా నియమించారు. వీరికి ఆయా పీఏసీఎస్‌ల పరిధిలోని సీఈవోలతోపాటు ఇతర సహకార శాఖ సిబ్బంది సహాయకులుగా ఈ ఎన్నికల్లో పనిచేస్తారు. ఈవోలతో పాటు సహాయకులకు శనివారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ సహకార ఎన్నికల నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. జిల్లా సహకార అధికారి ఎస్‌ పద్మ, సూపరింటెండెంట్‌ రఘురాం, ఈవోలుగా నియమితులైన తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏవోలు, సహకార శాఖ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.


పక్కా ప్రణాళికకు ఆదేశాలు..

సహకార ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ హరిత ఈవోలుగా నియమితులైన గెజిటెడ్‌ అధికారులను ఆదేశించారు. శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సహకార ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ప్రతి పీఏసీఎస్‌ పరిధిలో ప్రాదేశిక నియోజకవర్గం(టీసీ)కి ఒకటి లెక్కన 13 పోలింగ్‌ కేంద్రాల ద్వారా ఎన్నికలు జరపాలని చెప్పారు. ఒక్కో పీఏసీఎస్‌ పరిధిలో 13 టీసీలు ఉన్నాయని, జిల్లాలో ఎన్నికలు జరిగే 31 పీఏసీఎస్‌ల పరిధిలో ఈ లెక్కన మొత్తం 403 టీసీల్లో 403 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాలని స్పష్టం చేశారు. బ్యాలెట్‌ బాక్సులు, పేపరు, ఇతర ఎన్నికల సామగ్రి పోలింగ్‌ జరిగే ఒకరోజు ముందు అంటే ఈ నెల 14వ తేదీన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. 15వ తేదీన పోలింగ్‌ నిర్వహణ కోసం 14న ఎన్నికల సామగ్రి పంపిణీ చేయాలని హరిత చెప్పారు. ఓటర్ల తుది జాబితాను ఈ నెల 3వ తేదీన పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రదర్శించాలని ఆమె తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో అన్ని ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించామని, సమన్వయంతో పనిచేసి ఈ సహకార ఎన్నికలను కూడా సక్సెస్‌ చేయాలని అన్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 9న పరిశీలన, 10న ఉపసంహరణ పూర్తి చేయాలని చెప్పారు. పీఏసీఎస్‌లకు సంబంధించిన సమాచారాన్ని తమకు అందుబాటులో ఉండే సహకార సంఘాల సీఈవోల నుంచి పొందాలని ఈవోలకు కలెక్టర్‌ సూచించారు. ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాల్లో అదనంగా రెండో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఇది అమల్లోకి వస్తే జిల్లాలో ఎన్నికలు జరిగే 31 పీఏసీఎస్‌ల పరిధిలో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 403 దాటే అవకాశం ఉంది.


రేపు ఓటర్ల తుది జాబితా..

సహకార ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ఆయా పీఏసీఎస్‌ల పరిధిలో టీసీల వారీగా అధికారులు ఓటర్ల తుది జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చేర్పులు మార్పులతో ఓటర్ల తుది జాబితాను తయారు చేసే పనిలో సహకార శాఖ అధికారుల, ఉద్యోగులు నిమగ్నమయ్యారు. ఆయా పీఏసీఎస్‌ ఎలక్షన్‌ అధికారి సహకార ఎన్నికల నిర్వహణకు సోమవారం ఉదయం 10.30 గంటలకు నోటిఫికేషన్‌ విడదల చేస్తారు. రిజర్వేషన్ల వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపరుస్తారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ఓసీలకు రిజర్వ్‌ అయిన టీసీలేవి అనేది వెల్లడి కానుంది. ఈ రిజర్వేషన్ల ప్రకారం 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈవోలు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆయా పీఏసీఎస్‌ల పరిధిలోని 13 టీసీల నుంచి బరిలోకి దిగే అభ్యర్థుల నామినేషన్లను ఈవోలు సంబంధిత పీఏసీఎస్‌ కార్యాలయంలోనే స్వీకరిస్తారని డీసీవో పద్మ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,  ఉపసంహరణ ప్రక్రియ పూర్తిగా పీఏసీఎస్‌ హెడ్‌క్వార్టర్‌లోనే జరుగనుందని ఆమె చెప్పారు. నామినేషన్‌ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.500, బీసీలకు రూ.750, ఇతరులకు రూ.1,000గా ప్రభుత్వం నిర్ణయించినట్లు డీసీవో వెల్లడించారు.