బుధవారం 20 జనవరి 2021
Warangal-rural - Feb 01, 2020 , 03:39:11

చివరి ఆయకట్టుకూ నీరందాలి

చివరి ఆయకట్టుకూ నీరందాలి
  • పంటకాల్వల మరమ్మతు చేపట్టాలి
  • తూముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి
  • త్వరలో పాకాలకు గోదావరి జలాలు
  • నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

ఖానాపురం, జనవరి 31 : పాకాల చివరి ఆయకట్టు పంటలు ఎండిపోకుండా సక్రమంగా నీటిని అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు శుక్రవారం హన్మకొండలోని చింతగుట్టు క్యాంప్‌ కార్యాలయంలో  ఇరిగేషన్‌ సీఈ బంగారయ్యతో పాకాల ప్రాజెక్టు సాగునీటిపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాకాల తూములు మరమ్మతుకు వచ్చాయన్నారు. దీంతో ఏటా మూడు ఫీట్ల నీరు వృథాగా పోతోందన్నారు. అలాగే, పాకాల పంటకాల్వలు అధ్వానంగా మారాయన్నారు. కాల్వల్లో గుర్రపుడెక్క, సిల్ట్‌ పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డుపడుతోందన్నారు. దీంతో చివరి ఆయకట్టుకు నీరందడంలేదన్నారు. పాకాల ఆయకట్టు కింద యాసంగిలో పెద్దఎత్తున పంటలు సాగవుతున్నందున వెంటనే పంట కాల్వలకు మరమ్మతు చేపట్టాలన్నారు. పాకాలలోకి గోదావరి జలాలు రాబోతున్నందున పంటకాల్వల ఆధునీకరణ, ఆయకట్టు రోడ్ల అభివృద్ధి, నూతన తూముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం సీఈ మాట్లాడుతూ పాకాల పంట కాల్వలకు తాత్కాలిక మరమ్మతు పనులను వెంటనే చేపడతామన్నారు. యాసంగిలో చివరి ఆయకట్టుకు సరిపడా నీరందిస్తామన్నారు. పాకాల పూర్తిస్థాయి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, గంగాధర రమేశ్‌, లాదినేని ఎల్లయ్య, ఇరిగేషన్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.logo