ఆదివారం 07 జూన్ 2020
Warangal-rural - Jan 31, 2020 , 03:08:59

సహకార సమరం

సహకార సమరం

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల నగారా మోగింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు సహకార ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మేరకు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. ఎన్నికల అధికారులు 15న పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. పీఏసీఎస్‌ల ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం పొడిగింపు గడువు ఫిబ్రవరి 2తో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడదల చేసి ఫిబ్రవరి 15వ తేదీలోగా సహకార ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని బుధవారం సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో సహకార శాఖ అధికారులు రంగంలోకి దిగారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా సహకార ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ అడిషనల్ రిజిస్ట్రార్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం ఫిబ్రవరి 3న ఆయా పీఏసీఎస్ ఎన్నికల అధికారి ఫాం నంబర్-1 ద్వారా ఎలక్షన్ నోటీసు జారీ చేస్తారు. 6వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. పోటీ చేసే అభ్యర్థుల నుంచి 8వ తేదీ వరకు ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. వీటిని 9వ తేదీన పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 10వ తేదీ. అదే రోజు ఎన్నికల అధికారులు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు నిర్వహించి సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడిస్తారు. సహకార ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మూడురోజుల్లోగా ఆఫీస్ బేరర్ల ఎన్నిక జరగనుంది.

31 సంఘాలకు ఎన్నికలు..

జిల్లాలో మొత్తం 32 పీఏసీఎస్‌లు ఉన్నాయి. అయితే వీటిలో సంగెం పీఏసీఎస్ పాలకవర్గం పదవీకాలం గడువు వచ్చే ఆగస్టు 2వ తేదీ వరకు ఉంది. దీంతో మిగతా 31 పీఏసీఎస్‌లకు ఫిబ్రవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో సహకార ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత గల రైతులు ప్రస్తుతం 1,75,225 మంది ఉన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఆయా పీఏసీఎస్‌ల పరిధిలో వార్డుల వారీగా అధికారులు ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మొత్తం 1,75,225 మంది ఓటర్లలో మార్పులు చేర్పులతో పాటు సంఖ్య పెరగడం లేదా తగ్గడం వంటివి చోటుచేసుకునే అవకాశం ఉంది. ఎన్నికలకు నోటిఫికేషన్ విడదల కావడంతో సహకార శాఖ అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఓటర్ల జాబితాలను తయారు చేస్తున్నారు. 31 పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్దం అవుతున్నారు. ఎన్నికలు జరిగే 31 సంఘాల్లో నల్లబెల్లి, నర్సంపేట, గురిజాల, ఖానాపురం, దుగ్గొండి, నాచినపల్లి, మందపల్లి, మహ్మదాపూర్, చెన్నారావుపేట, అమీనాబాద్, సూరిపల్లి, రాయపర్తి, కొలన్‌పల్లి, నెక్కొండ, రెడ్లవాడ, పర్వతగిరి, చౌటపల్లి, చింతలపల్లి, కాపులకనపర్తి, ఊకల్, ఎలుకుర్తి, వంచనగిరి, గీసుగొండ, మొగిలిచర్ల, పరకాల, మాదారం, శాయంపేట, పెంచికల్‌పేట్, ఆత్మకూరు, పెద్దాపూర్, వర్దన్నపేట ఉన్నాయి. వీటిలో ఎక్కువగా గీసుగొండ మండలంలో ఐదు, దుగ్గొండి మండలంలో నాలుగు సంఘాలు ఉండడం విశేషం. ఈ 31 పీఏసీఎస్‌లకు 2013 జనవరిలో ఎన్నికలు జరిగాయి. వీటి పాలవకవర్గాల ఐదేళ్ల పదవీకాలం గడువు 2018 ఫిబ్రవరి 2న ముగిసింది. అప్పట్లో సహకార ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంకాగా వివిధ కారణాల వల్ల వాయిదాపడ్డాయి. దీంతో ప్రభుత్వం మొదటిసారి 2018 ఫిబ్రవరిలో సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం ఆరు నెలలు పొడిగించింది. ఇలా వరుసగా ఆరు నెలల గడువుతో నాలుగోసారి పొడిగించిన గడువు ఫిబ్రవరి 2న ముగిసిపోనుండడంతో సహకార ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

కొత్త సంఘాలకు ఇప్పుడు లేనట్టే.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో సహకార ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించిన సహకార శాఖ నోటిఫికేషన్ కూడా వెలువరించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 31 పీఏసీఎస్‌ల్లో ఎన్నికలు జరిపేందుకు మాత్రమే సహకార శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో కొత్తగా ప్రతిపాదించిన పీఏసీఎస్‌లకు ఇపుడు ఎన్నికలు లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఇటీవల పీఏసీఎస్‌ల పునర్వ్యస్థీకరణ చేపట్టింది. ఈ మేరకు ప్రతి మండలంలో రెండేసి పీఏసీఎస్‌లు ఉండేలా అధికారులు ప్రతిపాదనలు చేశారు. దీంతో జిల్లాలో కొత్తగా మరో ఎనిమిది పీఏసీఎస్‌లు ఏర్పడనున్నాయి. జిల్లాలో కొత్తగా ఆవిర్భవించిన దామెర, నడికూడ మండలాల్లో రెండు లెక్కన అంటే దామెర, ఊరుగొండ, నడికూడ, పులిగిల్ల కేంద్రంగా ఒక్కొక్కటి, ఖానాపురం మండలంలోని బుధరావుపేట, నల్లబెల్లి మండలంలోని మేడపల్లి, శాయంపేట మండలంలోని ప్రగతిసింగారం, వర్ధన్నపేట మండలంలోని కట్య్రాలలో ఒక్కో పీఏసీఎస్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ నెలలో నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. కొత్తగా నెలకొల్పే ఈ 8 పీఏసీఎస్‌ల ప్రతిపాదనలపై ఫిబ్రవరి 10 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. నూతనంగా ఆవిర్భవించే పీఏసీఎస్‌లతో జిల్లాలో పీఏసీఎస్‌ల సంఖ్య నలభైకి చేరనుంది. అనూహ్యంగా నోటిఫికేషన్ విడుదల కావడంతో కొత్తగా ఏర్పడనున్న ఎనిమిది పీఏసీఎస్‌లకు ఇప్పుడు ఎన్నికలు లేవని తేలిపోయింది. ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యాక కొత్త   పీఏసీఎస్‌లకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 

రిజర్వేషన్ల విధానం..

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు జరిగే ఆయా పీఏసీఎస్ పరిధిలో 13 వార్డులు ఉంటాయి. ఈ వార్డుల్లో సహకార శాఖ అధికారులు రిజర్వేషన్ల విధానం అమలు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్లు కేటాయిస్తారు. రిజర్వేషన్ కేటగిరీలోకి వెళ్లినవి పక్కనపెడితే మిగతా వార్డులను అన్ రిజర్వ్‌డ్‌విగా ప్రకటిస్తారు. ఇప్పటికే ఆయా పీఏసీఎస్‌ల పరిధిలోని వార్డుల్లో రిజర్వేషన్లు ఖారారు చేశారు. 13 కంటే తక్కువ వార్డులు ఉన్న పీఏసీఎస్‌లు కూడా కొన్ని ఉన్నట్లు తెలిసింది. రాజకీయాలకు అతీతంగా సహకార ఎన్నికలు జరుగనున్నాయి. నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే ఫిబ్రవరి 10వ తేదీన ఆయా వార్డుల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు సహకార శాఖకు సంబంధించిన గుర్తులను కేటాయిస్తారు. ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడిన అనంతరం మూడు రోజుల్లోగా ఆయా పీఏసీఎస్‌ల ఆఫీస్ బేరర్ల ఎన్నిక నిర్వహిస్తారు. పరోక్ష పద్ధతిన అంటే చేతులు పైకెత్తే విధానం ద్వారా పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుపుతారు.


logo