శుక్రవారం 29 మే 2020
Warangal-rural - Jan 31, 2020 , 03:06:36

పట్టణ రూపురేఖలు మార్చాలి

పట్టణ రూపురేఖలు మార్చాలి

నర్సంపేట,నమస్తేతెలంగాణ : నర్సంపేట పట్టణ రూపురేఖలు మార్చాలని మున్సిపల్ పాలకవర్గానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సూచించారు.  మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, టీఆర్‌ఎస్ నాయకులు గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిక ఏదైనా ఓటు మాత్రం కారుకే ప్రజలు వేస్తున్నారన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ 32 జెడ్పీ స్థానాలను గెలుచుకుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ గెలుపు సాధించిందన్నారు. 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే 112 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేసిందన్నారు. ఎప్పుడో జరగాల్సిన ఎన్నికలను ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చి ఆపేశాయన్నారు.  ప్రతి వార్డు కౌన్సిలర్ వార్డుకి ఒక్క కేసీఆర్ కావాలని సూచించారు. పట్టణాల రూపురేఖలు మార్చాల్సిన బాధ్యత మనపై ఉందన్నా రు.  ప్రతిపక్షం వాళ్ల మాటలు పట్టించుకోకుం డా ముందుకు వెళ్లాలని సూచించారు. కొత్తగా అమలు చేసిన మున్సిపల్ చట్టాన్ని ప్రతి కౌన్సిలర్ బాధ్యతగా పాటించాలన్నారు. ప్రతి సమస్యనూ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల ద్వారా ప్ర భుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించా రు. చట్టాన్ని అతిక్రమించకుండా బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. పచ్చదనం, పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిధులతో పాటు విధులను కూడా మున్సిపల్ చట్టంలో ప్రస్తావించామన్నారు. ప్రతి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. 75 గజాల కంటే తక్కువ స్థలం ఉంటే ప్రభుత్వ అనుమతి లేకుండా ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చన్నారు. అంత కంటే ఎక్కువ స్థలం ఉంటే ఇల్లునిర్మాణానికి 21 రోజుల్లో అధికారులు అనుమతులు ఇవ్వాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే అధికారులు కూడా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మహిళలకు పెద్దపీట వేసి 57 శాతం రిజర్వేషన్లు కల్పించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు.  వెనుకబడిన కులాల అభ్యర్థులకు చైర్మన్లుగా అవకాశం కల్పించినట్లు తెలిపారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 11 మంది వైశ్యులు చైర్మన్లుగాఎన్నికయ్యారన్నారు. ఎన్నికల ముందు కూడా గొప్పలు చెప్పలేదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పట్టణాలను అభివృద్ధి చేసే సత్తా మన తెలంగాణకు ఉందన్నారు. అనంతరం నర్సంపేటలో రూ.200 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బ్రోచర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గుంటిరజినీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, రాయిడి రవీందర్‌రెడ్డి, కామగోని శ్రీనివాస్‌గౌడ్, నల్లా మనోహర్‌రెడ్డి , కౌన్సిలర్లు  గందెరజితచంద్రమౌళి, రాయిడికీర్తి,  నాగిశెట్టి పద్మప్రసాద్, వేల్పుగొండపద్మరాజు, శీలం రాంబాబు పాల్గొన్నారు.

కేటీఆర్‌ను కలిసిన ఐఎంఏ అధ్యక్షుడు

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావును నర్సంపేట ఐఎంఏ అధ్యక్షుడు లెక్కల విద్యాసాగర్‌రెడ్డి కలిశారు. హైదరాబాద్‌లో ఆయనను కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భం గా టీఆర్‌ఎస్ గెలుపునకు పాటుపడినందుకు మంత్రి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.   

రాయిడి కీర్తిరెడ్డికి అభినందనలు

నర్సంపేట మున్సిపల్ కౌన్సిలర్‌గా అమెరికా నుంచి వచ్చి ప్రజా సేవ కోసం పోటీ చేసి గెలిచినందుకు 9వ వార్డు కౌన్సిలర్ రాయిడి కీర్తిరెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. మంత్రి కేటీఆర్‌ను హైదరబాద్‌లో ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భం గా ఆమె అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి ప్రజా సేవ కోసం వచ్చినట్లుగా మంత్రి కేటీఆర్ దృష్టికి ఎమ్మెల్యే పెద్ది తీసుకొచ్చారు. దీనికి మంత్రి  సంతోషం వ్యక్తం చేశారు.  

 జెడ్పీటీసీల సమస్యల పరిష్కారానికి కృషి

జెడ్పీటీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని  మంత్రి  కేటీఆర్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంతిని  జెడ్పీఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో  జెడ్పీటీసీలతో సమావేశమై సమస్యను పరిష్కరిస్తామన్నారు.    

టీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు అభినందన

నర్సంపేట రూరల్ : ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన నర్సంపేట టీఆర్‌ఎస్ కౌన్సిలర్లను మంత్రి కేటీఆర్ అభినందించారు. నర్సంపేట మున్సిఫల్ వైస్ చైర్‌పర్సన్, 5వ వార్డు కౌన్సిలర్ మునిగాల వెంకట్‌రెడ్డితో పాటు నాలుగో వార్డు కౌన్సిలర్ శీలం రాంబాబు, 6వ వార్డు కౌన్సిలర్ రామసహాయం శ్రీదేవి, 7వ వార్డు కౌన్సిలర్ మినుముల రాజు, 2వ వార్డు కౌన్సిలర్ జుర్రు రాజుకు మంత్రి మొక్కలను అందించి అభినందించారు. 


logo