శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Jan 31, 2020 , 03:00:38

బడికిపోతే బతుకుదురు బిడ్డా..!

బడికిపోతే బతుకుదురు బిడ్డా..!

 గీసుగొండ, జనవరి 30 : చేపల వేట కోసం వెళ్లిన ముగ్గురు చిన్నారులు చెరువులో పడి మృత్యువాత పడ్డారు. మమునూరు ఏసీపీ శ్యాంసుందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  గ్రేటర వరంగల్ 11 డివిజన్ క్రిస్టియన్ కాలనీకి చెందిన బరిగెల సుందర్‌రాజు-అర్పిత రెండో కుమార్తె రుచిత (7), ఇప్ప రాము-ఆశ దంపతుల కుమారుడు ప్రణీత్‌పాల్ (9) ప్రతాప్‌నగర్ కాలనీలోని  ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి,  3వ తరగతి చదువుతున్నారు. అదే కాలనీకి చెందిన అకినెపల్లి రాజు-శ్రీలత దంపతుల కుమారుడు ధనధీర్ (సిద్ధు) (9) గ్రెయిన్ మార్కెట్ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. వీరి తల్లిదండ్రులు పత్తి మిల్లులో కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.  బుధవారం ఐచ్ఛిక సెలవు కావడంతో చిన్నారులు పాఠశాలకు వెళ్లలేదు. దీంతో వారు ఉదయం 10 గంటలకు గాలం పట్టుకుని చేపల కోసం గ్రేటర్ మూడో డివిజన్ కీర్తినగర్‌లోని కట్టమల్లన్న చెరువు వద్దకు వెళ్లారు.  చెరువు వద్ద కాసేపు ఆడుకున్నారు.  అనంతరం చేపలు పట్టేందుకు గాలం పట్టుకుని ముగ్గురు చెరువులోకి దిగారు.  మెట్లు పాకురుపట్టి ఉండడంతో మొదట ధనధీర్ కాలు జారీ చెరువులో పడ్డాడు.  అతడిని కాపాడే ప్రయత్నంలో రుచిత, ప్రణీత్‌పాల్ కూడా చెరువులో పడ్డారు. చెరువు కట్టపై  ఉన్న కట్టమల్లన్న స్వామి దర్శనం కోసం వచ్చిన వరంగల్‌కు చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి పిల్లలు మునిగిపోతున్న తీరును గమనించి గట్టిగా కేకలు వేశాడు. చెరువు చివరలో చేపలు పడుతున్న గొర్రెకుంట గ్రామానికి చెందిన మత్స్యకారులు దండు రవి, మణికాంత్ పరుగున అక్కడికి చేరుకుని మునిగిపోతున్న రుచిత, ప్రణీత్‌పాల్‌ను ఒడ్డుకు చేర్చారు. పొట్టను ఒత్తి నీళ్లను కక్కిస్తున్న క్రమంలో కొన ఊపిరితో ఉన్న వీరిద్దరూ  మృతి చెందారు.  విషయం తెలుసుకున్న గీసుగొండకు చెందిన మత్స్యకారులు ఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అనంతరం మత్స్యకారులు, ఫైర్ సిబ్బంది చెరువులోకి దిగి అకినెపల్లి ధనధీర్ ఆచూకీ కోసం గంట పాటు  గాలించారు. చివరకు ధనధీర్ మృతదేహం లభ్యమైంది.  మృతదేహాలను ప్రైవేట్ వాహనంలో ఎంజీఎం మార్చురీకి తరలించారు. చెరువులో పడి చిన్నారులు మృతి చెందారనే  విషయం దావానంలా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ముగ్గురు చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు కట్టమల్లన్న చెరువు కట్టపై రోదించిన తీరు అక్కడున్న వారిని కంట తడి పెట్టించింది. స్కూల్‌కు సెలవు కావడంతోనే పిల్లలు చెరువు వద్దకు వెళ్లారని తల్లిదండ్రులు రోదించారు. మృతి చెందిన  ప్రణీత్‌పాల్ తల్లి ఆశ, రుచిత  తల్లి అర్పిత సొంత అక్కాచెల్లెళ్లు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుగొండ సీఐ శివరామయ్య, ఎస్సై నాగరాజు తెలిపారు. ఘటన స్థలానికి మమూనూరు ఏసీపీ శ్యాంసుందర్, తహసీల్దార్ కనకయ్య, కార్పొరేటర్లు లింగం మౌనిక, బాబు చేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు.