మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Jan 31, 2020 , 02:58:06

క్షేమంగా గమ్యం చేరాలి

క్షేమంగా గమ్యం చేరాలి

ములుగు జిల్లా ప్రతినిధి/ నమస్తే తెలంగాణ: మేడారం జాతరకు వచ్చే భక్తులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ సూచించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. మేడారం పార్కింగ్ మ్యాప్‌ను గురువారం విడుదల చేశారు. ఫిబ్రవరి 5నుంచి 8వ తేదీ వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరలో ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. జాతర వేళ లక్షల సంఖ్యలో వాహనాలు మేడారం వస్తాయని, హన్మకొండ నుంచి పస్రా వరకు ప్రతీ 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ ఔట్ పోస్టు, పస్రా నుంచి మేడారం వరకు ప్రతీ రెండు కిలోమీటర్లకో పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 

వేగ నియంత్రణ పాటించాలి

మేడారం వచ్చే వాహనాల డ్రైవర్లు నిర్దేశిత వేగంలో వాహనం నడపాలన్నారు. అధిక వేగంతో నడిచే వాహనాలను లేజర్ గన్‌ల ద్వారా గుర్తించి కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కండీషన్ లేని వాహనాలను జాతరకు ఉపయోగించవద్దని సూచించారు. వాహనాలు రోడ్డుపై చెడిపోతే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి వాహనాలను ఉపయోగించవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్లను గుర్తించి కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. వాహనాలు, ఎడ్లబండ్లకు ముందు, వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు అంటించాలని సూచించారు. పోలీసుల సూచనలు పాటించి ప్రమాదరహిత జాతరకు సహకరించాలని ఎస్పీ కోరారు.

 నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా 

జాతరకు వచ్చే భక్తులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. రోడ్డు పక్కన నిలిపే వాహనాలను టోయింగ్ వెహికిల్స్ ద్వారా పక్కకు తొలగించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వాహనాలను ఓవర్ టెక్ చేయొద్దని, రోడ్డుకు ఎడమ వైపు ఒకే లైన్‌లో నడపాలని సూచించారు.