సర్వం సిద్ధం

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ ఆదివాసీ గిరిజన మహాజాతరకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిలుకలగుట్ట రహదారి పనులను చూశారు. ఆ మార్గంలో ట్యాంకు నిండి నీరు వృథాగా పోతుండడం చూసి అధికారులతో మాట్లాడారు. నీటి వృథాను అరికట్టాలని ఆదేశించారు. చిలుకలగుట్ట ప్రహరీపై వేసిన పెయింటింగ్‌ను పరిశీలించారు. జంపన్నవాగు వద్ద ఇసుక లెవలింగ్ పనులను, వాటర్ షవర్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించి, మీడియా సమావేశంలో మాట్లాడారు. జాతర నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్లు, జాతీయ రహదారి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అనుభవజ్ఞులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు డిప్యుటేషన్‌ను మంజూరు చేసినట్లు వివరించారు. సౌకర్యాలపై లైన్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
జంపన్నవాగుకు నీటి విడుదల
జంపన్నవాగులో భక్తులు స్నానాలు చేసే భక్తులకు లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. అతి త్వరలో లక్నవరం నీరు జంపన్నవాగుకు చేరుకుంటుందని, 3 కిలోమీటర్ల మేర స్నానఘట్టాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జంపన్నవాగులో ప్రమాదాలు జరగకుండా మూడు ఫీట్ల లోతులో నీరు ఉండేలా లెవలింగ్ చేసినట్లు చెప్పారు. భక్తులు స్నానాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులు సంతోషంగా అమ్మవార్లను దర్శించుకొని సుఖంగా గమ్య స్థలం చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.
10 వేల మందితో పారిశుధ్య పనులు
మేడారం జాతరలో పారిశుధ్యం మెరుగ్గా ఉంచేందుకు ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు 10వేల మంది పారిశుధ్య కార్మికులతో పనులు నిర్వహిస్తామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల కోసం 8200 తాత్కాళిక మరుగుదొడ్లు నిర్మించినట్లు వివరించారు. అధికారులు పారిశుధ్య కార్మికులను అప్రమత్తం చేస్తూ సంబంధిత లైన్ ఆఫీసర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జాతర పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ నీరు
జాతరలో భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణాల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖ ద్వారా చేపడుతున్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, క్రాస్ బండ్స్, దుస్తులు మార్చుకునే గదులు, ఫ్లోరినేషన్ పనులు 1, 2 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రదేశాల్లో భక్తుల కోసం మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేసే తాగునీటి నల్లాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్లాస్టిక్ లేకుండా జాగ్రత్తలు
మేడారంలో ప్లాస్టిక్ వాడొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. జాతరను ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. భక్తులు తెచ్చే ప్లాస్టిక్‌ను చెక్‌పోస్టుల వద్ద గుర్తించి తొలగించనున్నట్లు వివరించారు. ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహిస్తున్న మేడారంలో వనాలకు ఎలాంటి హానీ కలిగించరాదని, అడవులను నరకడం వంటి చర్యలు చేపట్టరాదని సూచించారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) రూ.2 కోట్లతో 229 సోలార్ లైట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.5కోట్లతో ఫిలిగ్రిమ్స్ షెడ్లను నిర్మిస్తున్నట్లు, ఈ నెల 30వ తేదీ వరకు షెడ్డులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని, భక్తులు జాగ్రత్తలు తీసుకునేందుకు వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కల్పించేందుకు సీడీని విడుదల చేశారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చొంగ్తూ మాట్లాడుతూ.. మేడారం జాతరలో మిగులు పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జాతరలో అలంకరణ పనులు వెంటనే పూర్తి చేయడానికి చర్యలు వేగవంతం చేశామని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా 20 మీటర్ల దూరంలో షాపులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రోడ్డుకు ఆనుకొని ఉన్న షాపులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతరలో తాజా ఆహార పదార్థాలు ఉండేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జాతర నోడల్ ఆఫీసర్ వీపీ గౌతమ్, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌శెట్టి, ఓఎస్డీ సురేశ్‌కుమార్, డీఆర్వో రమాదేవి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు
- ఎలుక మూతి ఆకారంలో చేప.. ఎక్కడో తెలుసా?
- సంప్రదాయానికి స్వస్తి.. తైవాన్ జామతో దోస్తీ..!
- ప్రభాస్‌తో ఢీ అనేందుకు సిద్ధమైన తమిళ హీరో
- కబడ్డీ.. కబడ్డీ.. అదరగొట్టెన్ అదనపు కలెక్టర్
- కాలినడకన తిరుమల కొండెక్కిన జబర్దస్త్ నటుడు
- అన్నాహజారేతో మహారాష్ట్ర మాజీ సీఎం భేటీ
- క్యారెక్టర్ ఎమోజీ పొందిన తొలి భారతీయ నటి సమంత !
- ఈత చెట్టుపై వాలి.. కల్లు తాగిన చిలుక
- రేపు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష