శుక్రవారం 29 మే 2020
Warangal-rural - Jan 29, 2020 , 03:52:52

అవినీతి లేని పాలన అందిస్తా..

అవినీతి లేని పాలన అందిస్తా..
  • చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయడం మరిచిపోలేను
  • దళిత కాలనీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా
  • ‘నమస్తే తెలంగాణ’తోపరకాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోదా అనిత

పరకాల టౌన్‌, జనవరి 28 : పరకాల మున్సిపాలిటీ పరిధిలో అనివీతిలేని పాలన అందిస్తా.. అన్ని రంగాల్లో మున్సిపాలిటీని అభివృద్ధి చేయడమే నాలక్ష్యం. అంతేకాకుండా పరకాల  అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సహకారంతో పట్టణంలోని దళిత కాలనీలను మోడల్‌గా తీర్చిదిద్ది ప్రజల మన్ననలను పొందుతానని పరకాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోదా అనిత అన్నారు. పరకాల పట్టణంలో 90 శాతం మంది తనకు తెలుసునని, వారికి నిత్యం అందుబాటులో ఉండి  సమస్యలకు పరిష్కారం లభించే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంగళవారం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో  మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.

చైర్‌పర్సన్‌గాఎన్నికవడం అదృష్టం..

పరకాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప అనుభూతిని కలిగించింది. ఎన్నడూ నేను ఈ విధంగా వెలుగులోకి వస్తానని ఊహించలేదు. అంతేకాకుండా పరకాల పట్టణ ప్రజలు నన్ను కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో ఏకగ్రీవం కావడమంటే సులువు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే, ప్రజల ఆశా జ్యోతి చల్లా ధర్మారెడ్డి  చేసిన అభివృద్ధితో పట్టణంలో ఒక్కటి కాదు ఏకంగా సగం సీట్లలో టీఆర్‌ఎస్‌ సభ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 22 వార్డుల్లో 17వార్డుల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టారు. ఇదంతా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తోనే సాధ్యమైంది. అలాంటి నాయకుల ఆధ్వర్యంలో చైర్‌పర్సన్‌గా ఎన్నికవడం నేను చేసుకున్న ఆదృష్టం. అంతే కాకుండా తన భర్త రామకృష్ణ మంచి తనమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. 


అందరినీ కలుపుకుని పోతా..

నేను కౌన్సిలర్‌గా గెలిచిన తొలిసారే చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యాను. రాజకీయంగా, ప్రజాప్రతినిధులుగా, వయస్సు పరంగా నా కంటే సీనియర్లు చాలామంది ఉన్నారు. వారి అభిప్రాయాలను గౌరవిస్తూ అందరినీ సమన్వయం చేసుకుంటూ కౌన్సిల్‌ను నడుపుతా. ఇప్పటికే చాలా మంది కౌన్సిలర్లు నాపై ఆప్యాయతను చూపుతున్నారు. దీంతో నేను కొత్త అనే భావన ఇప్పటికే సగానికి పైగా తొలగి పోయింది. అధికారులు, కౌన్సిలర్ల సహకారంతో అందరినీ కలుపుకుంటూ పట్టణ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తా.  పిల్లల చదువు, భర్త ఉద్యోగ రీత్యా మాత్రమే హన్మకొండకు వెళ్లాం.  పరకాల పట్టణం నుంచి తరలిపోలేదు. పరకాల పట్టణంలో మాకు సొంత ఇల్లు ఉంది. 


భర్త  ప్రోత్సాహం మరువలేనిది. .

రాజకీయాల్లో భాగంగా ప్రజలతో నా భర్త రామకృష్ణ మాట్లాడుతున్న తీరు నాకు బాగా నచ్చింది. వార్డుల్లో తిరుగుతున్న సమయంలో, ఇంటికి వచ్చిన వారితో ఆయన మాట్లాడుతున్న  తీరు ప్రత్యేకంగా ఉంటుంది. ఆయనలాగా ఎప్పటికైనా నేను ప్రజలతో మాట్లాడాలని ఉంది.  నాకు నాభర్త, కుటుంబ సభ్యులు ఇస్తున్న ప్రోత్సాహం మరువ లేనిది.  ప్రజలు నాపై చూపిన ఆదరణ ఎన్నటికీ గుర్తుంచుకుంటాను. అంతేకాకుండా నన్ను కౌన్సిలర్‌గా ఎన్నుకున్న వార్డు ప్రజలు, చైర్‌పర్సన్‌గా చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, తోటి కౌన్సిలర్లు, ప్రజలకు కృతజ్ఞతలు..


logo