ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - Jan 28, 2020 , 05:26:20

అటవీ సంరక్షణ అందరి బాధ్యత

అటవీ సంరక్షణ అందరి బాధ్యత
 • తొలిసారిగా వెదురు విక్రయస్టాల్స్‌..
 • ప్లాస్టిక్‌ వస్తువులు, వంట నిప్పుతో హానికరం
 • విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
 • ‘నమస్తే తెలంగాణ ’ఇంటర్వ్యూలో అటవీ శాఖవరంగల్‌ సర్కిల్‌ కన్జర్వేటర్‌ అక్బర్‌

 • సుబేదారి, జనవరి 25 : ‘చెట్లు, కొండలు, వాగులు..వంకలు, సెలయేళ్లు, పక్షులు, మూగజీవాలు.. ఇలా ప్రకృతి ఒడిలో జరుపుకునే గొప్ప పండుగ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. వనదేవతలు కోట్లాది మంది భక్తుల మొక్కులు అందుకుంటున్నారంటే.., వందల ఏళ్ల నుంచి విరాజిల్లుతున్నారంటే వారు ప్రజల కోసం చేసిన త్యాగమే. అందుకే వారు వనంలో ఉండే జన దేవతలయ్యారు. రెండేళ్ల కోసారి ప్రపంచం మొత్తం మేడారం వైపుచూస్తుంది. తల్లుల సేవలో పనిచేయడం మహాభాగ్యం. వనంతోనే జాతరకు ప్రత్యేకత’ అని చెబుతున్నారు.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా అటవీ శాఖ సంరక్షణ అధికారి అక్బర్‌. మేడారం మహాజాతర సందర్భంగా అటవీశాఖ తరఫున చేపట్టిన ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు, అటవీ సంపద పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను ఆయన ‘నమస్తేతెలంగాణ’కు వెల్లడించారు. 


  సెప్టెంబర్‌ నుంచే సమాయత్తం 

  మేడారం అంటేనే వనంలో జరుపుకునే జాతర. జాతర సందర్భంగా   పరిసర ప్రాంతాల్లో అటవీ సంపద సంరక్షణపై దృష్టిసారించాం. సెప్టెంబర్‌ నుంచే ములుగు జిల్లా అటవీశాఖ నుంచి ఉమ్మడి వరంగల్‌ జిల్లా సర్కిల్‌ తరుఫున  జాతర కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యలపై ముందుస్తు ప్రణాళికలు రూపొందించాం. గత జాతరలో అటవీ సంపదకు కలిగిన హానిని గుర్తించి.. ఈసారి ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాలని ప్రధానాంశంగా పెట్టుకున్నాం. భవిష్యత్‌ తరాలు వనసంపద మధ్య జాతరను జరుపుకునే అవకాశం కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. ఈజాతర వల్ల ఒక్క వృక్షం కూడా పోకూడదనేది ప్రభుత్వ నిర్ణయం. జాతర వల్ల  చింతల్‌ వద్ద అంతరించిపోయిన వన సంపదను తిరిగి 26 ఎకరాల్లో హరితహారంలో   మొక్కలు పెంచుతున్నాం. గత జాతరలో షాపుల యజమానులు , గుడారాల కోసం భక్తులు వెదురు బొంగులను విచ్చలవిడిగా నరికేశారు. ఈసారి దీన్ని అరికట్టేందుకు అటవీ శాఖ నుంచే వెదురు ఇవ్వడానికి స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.


  పక్కాగా అనుమతులు ..

  గతంలో అటవీశాఖ అధికారులకు, ఇతర డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లకు జాతర సమయంలో రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణ విషయంలో వైరుధ్యం  ఉండేది. జాతర సమయంలో తమపై ఒత్తిడి తెచ్చి రోడ్డు నిర్మాణం చేసే వారు. ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో మా సిబ్బంది పనులు అడ్డుకునేవారు. ఈవిషయంలో గొడవలు, చివరికి కేసులు కూడా అయ్యాయి. ఈసారి అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌ మాసంలో హైదరాబాద్‌లో హైపర్‌మీటింగ్‌ ఏర్పాటు చేసింది. ఇందులో ఈ జాతరకు అటవీ శాఖ నుంచి తీసుకోవాల్సిన అనుమతులు శాఖల వారీగా నేషనల్‌ హైవే, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, శానిటేషన్‌ , గిరిజన సంక్షేమ శాఖల నుంచి ముందస్తు ప్రతిపాదనలు తయారు చేసి తమ శాఖకు అందజేశారు. అటవీ శాఖ తరుఫున క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక్క చెట్టును నరకకుండా అఫడవిట్‌ తీసుకొని అనుమతులు ఇచ్చాం. తాడ్వాయి- మేడారం మధ్య కల్వర్టు, మేడారం చిలుకల గుట్ట రోడ్డు మరమ్మతు పనులు,  నార్లాపూర్‌ మధ్య బ్రిడ్జి నిర్మాణం, తాడ్వాయి -గంగారం, లింగాల ,  ఊరట్టం మట్టి రోడ్డు మరమ్మతులు, వరంగల్‌- ఏటూరునాగారం- వెంకటాపూర్‌ ఛత్తీస్‌గఢ్‌ జాతీయ రహదారి రిపేరింగ్‌ తదితర పనుల్లో అటవీ సంపదకు హాని జరగకుండా అనుమతులు జారీ చేశాం. ఆమేరకు పనులు సైతం పూర్తికావొచ్చయి. ఇతర శాఖల సమన్వయంతో జాతర కోసం తమ వైపు నుంచి తగిన చర్యలు తీసుకున్నాం.


  తొలిసారిగా వెదురు స్టాల్స్‌

  ప్రకృతి ఒడిలో సాగేదే మేడారం జాతర. వనంతోనే జాతరకు ప్రత్యేకత. షాపుల ఏర్పాటు కోసం, భక్తులు గుడారాల ఏర్పాటు కోసం ఈసారి వెదురు స్టాల్స్‌ ఏర్పాటు చేశాం. తాడ్వాయి- మేడారం బస్‌స్టేషన్‌ రూట్‌లో ఒకటి, నార్లాపూర్‌- చింతల్‌ మార్గంలో ఒకటి, జాతర మధ్యలో మరొక స్టాల్‌ ఏర్పాటు చేశాం. వీటిని రేంజ్‌ ఆఫీసర్‌ పర్యవేక్షిస్తుంటారు. జాతర మొదలైనప్పటి నుంచి, జాతర ముగింపు వరకు స్టాల్స్‌లో వెదురు అందుబాటులో ఉంటుంది. వెదురు స్టాల్స్‌ మొదటిసారిగా ఏర్పాటు చేశాం.

  అటవీ సంరక్షణపై అవగాహన..

  మేడారం జాతరతో అటవీ సంపదకు ఎలాంటి ముప్పురాకూడదు. భవిష్యత్‌ తరాలు వనసంపద మధ్య జాతరను చూసే భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అటవీశాఖకు ఆదేశాలు ఇచ్చింది. అటవీ సంపద పరిరక్షణ అనేది అందరి బాధ్యత. భక్తులకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. మయూరి పేరుతో ప్రత్యేక వాహనం తయారు చేసి ప్రొజెక్టర్‌ ద్వారా అటవీసంపదను కాపాడుకోవడం, రేంజ్‌ ఆఫీసర్‌ స్థాయిలో జాతరలో పలుచోట్ల అటవీ సంపద సంరక్షణపై లౌడ్‌ స్పీకర్లతో అవగాహన కల్పించడం, బస్‌ స్టేషన్‌, గుడి వద్ద, జంపన్నవాగు పరిసర ప్రాంతాల్లో ఫ్లెక్సీల ఏర్పాటుతో అవగాహన కల్పించనున్నాం. 


  జాతర పరిసరాల్లో నిఘా బృందాలు..

  జాతర సమయంలో చుట్టూ 20 కిలో మీటర్ల పరిసర ప్రాంతాల్లో నిఘాపెడుతున్నాం. జాతర ఉన్న అటవీ ప్రాంతం ములుగు, ఏటూరునాగారం  డివిజన్ల పరిధిలో ఉంది. పది కిలోమీటర్ల చొప్పున బేస్‌ క్యాంపులను ఏర్పాటు చేసి రేంజ్‌ ఆఫీసర్‌ నుంచి బీట్‌ ఆఫీసర్‌ వరకు 200 మంది ఉద్యోగులతో గస్తీ చేపట్టనున్నాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ద్విచక్ర వాహనాలతో మొబైల్‌ టీంలను ఏర్పాటు చేశాం. ఎడ్ల బాటలు, నడుచుకుంటూ వచ్చే తొవ్వలు, ప్రధాన రహదారుల వెంట  టీంలు 24 గంటలు పనిచేస్తుంటాయి. ఎక్కడైనా చెట్లు నరికినట్లు సమాచారం వస్తే వెంటనే అక్కడికి చేరుకొని బాధ్యుడిపై చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా అడవిలో నిప్పురాజుకోకుండా ఫైర్‌ ఇంజిన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి 15 ఫైర్‌ బ్రోవర్స్‌ టీంలను ఏర్పాటు చేశాం.  


  భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి 

  భక్తులకు అటవీ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. చెట్టుతో మనిషి జీవితం పెనవేసుకొని ఉంది. చెట్టు లేకుంటే మనుగడ లేదు. జాతరకు వచ్చే భక్తుల్లెవరూ చెట్లను నరకకూడదు. ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగం వల్ల భూసారం దెబ్బతీని, జీవరాశి ఉనికి ప్రమాదంలో పడుతుంది. ఒకవేళ ప్లాస్టిక్‌ వస్తువులు వాడితే చెత్తకుండిలో వేయాలి. అలాగే వంట చేసుకున్నప్పుడు నిప్పు చెలరేగకుండా చూసుకోవాలి. జాతర సమయంలో ఎక్కువగా నిప్పులు చెలరేగి అడవి అంటుకునే ప్రమాదం ఉంటుంది. జాతరకు వచ్చే భక్తులు బాధ్యతగా వంట చేసుకున్న తర్వాత నిప్పులను చల్లార్చాలి.


logo