శుక్రవారం 29 మే 2020
Warangal-rural - Jan 27, 2020 ,

కేసీఆర్‌ లేకుంటే తెలంగాణే లేదు

కేసీఆర్‌ లేకుంటే తెలంగాణే లేదు

సంగెం, జనవరి 26 : కేసీఆర్‌ లేకుంటే తెలంగాణే లేదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. మండలంలోని పల్లార్‌గూడ గ్రామానికి చెందిన సీఎండీ ప్రభాకర్‌రావు ఆదివారం తన సొంత గ్రామంలో పర్యటించారు.  పల్లార్‌గూడ గ్రామంలోని కంఠమహేశ్వర ఆలయం  వద్ద గౌడ సంఘం స్థలంలో  సీఎండీ తల్లిదండ్రుల విగ్రహాలను ఏర్పాటు చేయగా వాటిని ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన సీఎండీ ప్రభాకర్‌రావు, ఆయన కుటుంబ సభ్యులకు గ్రామస్తులు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. మేళతాళాలతో  క్రాస్‌రోడ్‌ నుంచి విగ్రహావిష్కరణ స్థలం వరకు వారిని తీసుకొచ్చారు. అనంతరం కంఠమహేశ్వరుడికి పూజలు చేసి,  విగ్రహాలను ఆవిష్కరించారు. తర్వాత సీఎండీ ప్రభాకర్‌రావు, కుటుంబ సభ్యులను గౌడ కులస్తులు, విద్యుత్‌ అధికారులు  ఘనంగా సత్కరించారు.  అనంతరం జరిగిన సమావేశంలో సీఎండీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తో తనకు 1991 నుంచి పరిచయం ఉందని, రాష్ట్ర ఏర్పాటుకు ముందు తనతో కరంటు సరఫరా, నీటి గురించి మాట్లాడేవారని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత తనకు సీఎం కేసీఆర్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా అవకాశం ఇచ్చారన్నారు. 2014కు ముందు అంధకారంలో ఉన్న రాష్ర్టానికి వెలుగులు చూపించారన్నారు. రూ.26వేల కోట్లు ఖర్చు చేసి రాష్టంలో నాణ్యమైన 24 గంటల కరంటు ఇస్తున్నట్లు తెలిపారు. మరో రూ.45వేల కోట్లు వెచ్చించడానికి సిద్దంగా ఉన్నామన్నారు. 


పచ్చటి పొలాలు ఆహ్లాదంగా ఉన్నాయి 

తాను పుట్టి పెరిగిన గ్రామానికి వస్తుంటే పచ్చటి పొలాలు, చేన్లతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని ప్రభాకర్‌రావు అన్నారు. 1984 వరకు అమ్మనాన్నలు ఊర్లో ఉన్నప్పుడు వస్తూ పోతుండే వాడినని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.  24 గంటల కరంటు, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వచ్చే నీటితో పొలాలు చక్కగా పండుతున్నాయన్నారు. తన బాల్య మిత్రులు కొమురయ్య, ఉప్పలయ్యతో ఎంతో అనుబంధం ఉందన్నారు. పుట్టిన ఊరికి సేవచేసే భాగ్యం  దక్కడం సంతోషంగా ఉందన్నారు.  గ్రామంలో ఎల్‌ఈడీ లైట్లు, లైబ్రరీ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామానికి ఎల్‌ఈడీ లైట్లు, లైబ్రరీ కోసం బుక్స్‌ను సర్పంచ్‌ కక్కెర్ల కుమారస్వామికి అందజేశారు. అనంతరం  అనారోగ్యంతో ఉన్న ఓదెల ఉప్పలయ్య ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆయనకు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సీఎండీ ప్రభాకర్‌రావు సతీమణి లీలాదేవి, కుమారుడు, కోడలు చైతన్య హిమబిందు,  మనుమలు, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు, డీఈ మల్లికార్జున్‌, ఎంపీపీ కందకట్ల కళావతి, జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ గుగులోతు వీరమ్మ, ఏడీ ప్రశాంత్‌, ఏఈ శ్రీకాంత్‌, నాయకులు గోపిసింగ్‌ పాల్గొన్నారు.


logo