శుక్రవారం 05 జూన్ 2020
Warangal-rural - Jan 26, 2020 , 04:05:07

టీఆర్‌ఎస్‌కు జై

 టీఆర్‌ఎస్‌కు జై
 • -దుమ్మురేపిన కారు
 • - మున్సి‘పోల్స్‌'లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం
 • - మూడు పురపాలికల్లో విజయదుందుభి
 • -మొత్తం 58 వార్డుల్లో 41 స్థానాల కైవసం
 • - కాంగ్రెస్‌కు 9, బీజేపీకి 4, ఏఐఎఫ్‌బీకి 1
 • -టీడీపీ గల్లంతు.. ప్రతిపక్షాల బేజార్‌
 • - గులాబీ గూటికి ముగ్గురు ఇండిపెండెంట్లు
 • - జిల్లాలో 44 స్థానాలకు చేరిన కారు బలం
 • - ప్రతి మున్సిపాలిటీలో ఎగిరిన గులాబీ జెండా
 • -టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు
 • - విజేతలకు ఎమ్మెల్యేలు పెద్ది, చల్లా, అరూరి శుభాకాంక్షలు
 • - వర్ధన్నపేటలో ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థి
 • - రేపు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం కొనసాగింది. కాంగ్రెస్‌ కంచుకోటను బద్ధలు కొట్టింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలను దక్కించుకుని టీఆర్‌ఎస్‌ అజేయశక్తిగా నిలిచింది. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆధిక్యతను కనబరిచారు. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేటమున్సిపాలిటీల పరిధిలోని 58 వార్డుల్లో టీఆర్‌ఎస్‌  41 వార్డులను కైవసం చేసుకుంది.  స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ముగ్గురు గులాబీ గూటికి చేరడంతో టీఆర్‌ఎస్‌ బలం 44 స్థానాలకు చేరింది.  కాంగ్రెస్‌ 9, బీజేపీ 4, ఏఐఎఫ్‌బీ 1 స్థానంతో సరిపెట్టుకున్నాయి. అంచనాకు మించి ఫలితాలు రావడంతో గులాబీ శ్రేణుల్లో సంబురాలు అంబరాన్నంటాయి. వర్ధన్నపేటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి బ్యాలెట్‌ ఓటు వరంగా మారింది. ఒక్క ఓటుతో విజయం సాధించింది. జై కేసీఆర్‌, జై కేటీఆర్‌, జై టీఆర్‌ఎస్‌ నినాదాలతో మున్సిపాలిటీలు మార్మోగాయి. స్థానిక ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : ఎన్నికలేవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని మరోసారి వెల్లడైంది. తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లాలో కారు దుమ్ము రేపింది. మూడు పురపాలక సంఘాల్లో ప్రభంజనం సృష్టించింది. ప్రతిపక్ష పార్టీలను బేజారెత్తించింది. ప్రతి పురపాలికలో స్పష్టమైన ఆధిక్యంతో విజయ దుందుభి మోగించింది. అంతటా తిరుగులేని శక్తిని చాటింది. మూడు మున్సిపాలిటీల పరిధిలోని 58 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అత్యధికంగా 41 వార్డులను కైవసం చేసుకుంది. నర్సంపేట, వర్ధన్నపేటలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ముగ్గురు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గులాబీ గూటికి చేరడంతో టీఆర్‌ఎస్‌ బలం 44 స్థానాలకు చేరింది. అంచనాలకు అనుగుణంగా రిజల్ట్‌ రావడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. జై కేసీఆర్‌, జై కేటీఆర్‌, జై టీఆర్‌ఎస్‌ అంటూ నినాదాలు చేశారు. వర్ధన్నపేటలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ తమ పార్టీ కార్యకర్తలతో కలిసి నృత్యం చేశారు. జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మూడు మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం వార్డుల సంఖ్య 58. పరకాల పురపాలక సంఘం పరిధిలో గల 22 వార్డులకు  11 వార్డుల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఈ పదకొండు వార్డుల్లోనూ స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రత్యేక చొరవతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఎన్నిక కావటం రాజకీయంగా సంచలనం కలిగించింది. దీంతో ఇక్కడ మిగతా 11 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఈ 11 వార్డుల్లో 30 మంది అభ్యర్థులు తలపడ్డారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో మొత్తం 110 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వర్ధన్నపేట పురపాలక సంఘం పరిధిలోని 12 వార్డుల్లో 50 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. పరకాలలో ఏకగ్రీవ ఎన్నిక జరిగిన పదకొండు వార్డులను  పక్కనపెడితే మూడు మున్సిపాలిటీల పరిధిలో మిగత 47 వార్డులకు ఎన్నికల అధికారులు గత బుధవారం పోలింగ్‌ నిర్వహించారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో శనివారం ఓట్ల లెక్కింపు జరిగింది.

ఉత్కంఠ రేపిన కౌంటింగ్‌..

మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు అద్యంతం ఆసక్తి రేపింది. గట్టి పోటీ జరిగిన వార్డుల కౌంటింగ్‌ నరాలు తెగే ఉత్కంఠ కలిగించింది. అతి తక్కువ ఓట్లతో ఫలితం వెలువడిన ప్రతి వార్డులోనూ ఇదే పరిస్థితి. వర్ధన్నపేట పురపాలక సంఘం పరిధిలోని 5వ వార్డు ఓట్ల లెక్కింపు మూడుసార్లు జరిగింది. ఈ వార్డు నుంచి మొత్తం నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో స్వతంత్ర అభ్యర్థి బానోతు అనిత, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నేతవత్‌ శీభారాణితోపాటు ఇతర అభ్యర్థులు సపావత్‌  యమున, భూక్య రాధిక ఉన్నారు. ఇక్కడ పోలైన మొత్తం 864 ఓట్లలో బానోతు అనితకు 417, శీభారాణికి 416, యమునకు 15, రాధికకు 6 ఓట్లు లభించగా 10 ఓట్లు చెల్లలేదు. దీంతో అనితకు ఒక ఓటు ఆధిక్యం లభించడంతో శీభారాణి రీకౌంటింగ్‌ కోరారు. ఇలా మూడు సార్లు తిరిగి లెక్కించిన అధికారులు చివరకు స్వతంత్ర అభ్యర్థిని అనిత ఒక ఓటుతో గెలిచినట్లు ప్రకటించారు. ఈ సమయంలో శీభారాణి, ఆమె ఏజెంట్లు, కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో టెన్షన్‌... టెన్షన్‌. పరకాలలో తీవ్ర ఉత్కంఠ నడుమ టీఆర్‌ఎస్‌కు దక్కిన ఒకటో వార్డు ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఇదే పరిస్థితి. నర్సంపేటలో చైర్‌పర్సన్‌ పదవిని ఆశిస్తూ అభ్యర్థులు బరిలో నిలిచిన వార్డుల్లో కూడా ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠను రేపింది.

  ప్రతి పురపాలికలో ఆధిక్యం..

నర్సపేటలోని 24 వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపిన టీఆర్‌ఎస్‌ 16 వార్డులను గెలుచుకుంది. 6 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిస్తే రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన వెంటనే నర్సంపేటలో 3, 11వ వార్డుల నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు లుకావత్‌ కవిత, గడ్డమీది సునీత స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ కండువవా కప్పి వీరిని ఆయన టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. స్వతంత్ర అభ్యర్థుల చేరికతో నర్సంపేట మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ బలం 18 స్థానాలకు ఎగబాకింది. అలాగే వర్ధన్నపేట పురపాలక సంఘం పరిధిలో 5వ వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి బానోతు అనిత కూడా ఎన్నికల ఫలితాలు వెలువడగానే స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. గులాబీ కండువా కప్పి ఆమెను అరూరి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. వర్ధన్నపేటలో మొత్తం వార్డులు 12. వీటిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎనిమిదింటిలో విజయం సాధించారు. 2 వార్డుల్లో కాంగ్రెస్‌, 1 వార్డులో బీజేపీ అభ్యర్థి గెలువగా ఫలితాల అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరిన అనిత స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అనిత రాకతో ఇక్కడ టీఆర్‌ఎస్‌ బలం 9 స్థానాలకు చేరింది. పరకాల మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు జరిగిన 11 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆరింటిలో విజయకేతనం ఎగరవేశారు. 3 వార్డుల్లో కాంగ్రెస్‌, ఒక్కో వార్డులో కాంగ్రెస్‌, ఏఐఎఫ్‌బీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నికైన 11 మందితో టీఆర్‌ఎస్‌ బలం 17 స్థానాలకు చేరింది. ఈ స్థానాల నుంచి ఎన్నికైన 17 మంది అభ్యర్థులకు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అభినందనలు తెలిపారు.

 ఎన్నిక ఏదైనా గులాబీదే గెలుపు..

ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని మున్సి‘పోల్స్‌' ఫలితాలతో మరోసారి తేలిపోయింది. జిల్లాలో టీఆర్‌ఎస్‌ వరస విజయాలు సాధిస్తుంది. 2018 డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు. పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి, వర్దన్నపేట నుంచి ఆరూరి రమేశ్‌ తిరుగులేని ఆధిక్యంతో విజయబావుటా ఎగరవేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కొద్ది నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గాల నుంచి ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారు. భారీ మెజారిటీ ఇచ్చారు. 2019లో జరిగిన పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అఖండ విజయం నమోదు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవడమే కాకుండా మెజారిటీ జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరవేసింది. మున్సిపల్‌ ఎన్నికల్లో విశ్లేషకులు ఊహించినట్లుగానే టీఆర్‌ఎస్‌కు ఘన విజయం దక్కింది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల చేరికతో మూడు మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 58 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ బలం 44కు పెరిగింది. గెలిచిన అభ్యర్థులను ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌ శిబిరాలకు పంపినట్లు తెలిసింది. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక సోమవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా ఫలితాలతో మూడు పురపాలికల చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్ల పదవులు టీఆర్‌ఎస్‌ వశం కాగలవని తేలిపోయింది.logo