మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Jan 26, 2020 , 04:01:46

సమన్వయ సాథ్యం

సమన్వయ సాథ్యం


(వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తేతెలంగాణ): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తొమ్మిదింటికి తొమ్మిది మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కు విజయాన్ని సాధించడంలో, పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు సమన్వయం చేయడంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మరోసారి తన సమన్వయానికి ఎదురేలేదని నిరూపించుకున్నారు. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీరాథోడ్‌ సైతం తన పరిధిలో చేసిన సమన్వయం పార్టీ అభ్యర్థుల్ని విజయతీరాలవైపు నడిపించారు. ముందునుంచి చెబుతున్నట్టుగానే తొమ్మిది మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అపూర్వబహుమానం అందించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని గెలిపించడంలో అన్నిమున్సిపాలిటీలను మంత్రి దయాకర్‌రావు తనదైన శైలిలో వ్యూహరచన చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో ఆయన విస్తృతంగా పర్యటించి కిందిస్థాయి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రచారంలోనూ తనదైన ఒరవడిని ప్రదర్శించారు. నాయకులను సమన్వయం చేసుకుంటూ ప్రచారపర్వాన్ని ముందుకు తీసుకెళ్లారు. పోలింగ్‌ రోజు బూత్‌ల పరిధిలో ఇన్‌చార్జిలను నియమించి ఓటర్లను బూత్‌స్థాయి వరకు తీసుకురావడానికి ముందస్తుగానే ఆయన వ్యూహరచన చేశారు. మంత్రి దయాకర్‌రావు వ్యూహం ఫలించి అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరవేయడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతీరాథోడ్‌ సైతం పార్టీ శ్రేణుల్ని సమన్వయం చేసూకుంటూ ముందుకు సాగారు. ఎమ్మెల్యేలకు, పార్టీ శ్రేణులకు మధ్య ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నిరంతరం కృషి చేశారు. ఇద్దరు మంత్రులు, తొమ్మిది మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసేందుకు క్షేత్రస్థాయిలో ఉంటూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇటు పార్టీకి, అభ్యర్థులకు నడుమ వారధిగా పనిచేస్తూ ముందుకు నడిపారు.

విజయ సారథ్యం

 మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ ఇద్దరూ సమన్వయంతో వ్యవహరిస్తూ ఒకవైపు పార్టీ ఆదేశాన్ని, దిశానిర్దేశాన్ని కార్యకర్తలకు వివరిస్తూనే, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేసిన దిశానిర్దేశానికి అనుగుణంగా ఆచరించారు. అంతేకాకుండా మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో తమతమ శక్తియుక్తులన్నీ ధారపోశారు. ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి. పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, బానోత్‌ శంకర్‌నాయక్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డీఎస్‌ రెడ్యానాయక్‌లకు తోడుగా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగానే ప్రతీ మున్సిపాలిటీలకి ప్రచార బాధ్యులని నియమించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌లు దాస్యం వినయభాస్కర్‌, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ టీ. రాజయ్య, నన్నపునేని నరేందర్‌ ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ మాత్రమే అదీ ఒక్కరోజు మాత్రమే వచ్చి ప్రచారం నిర్వహించారు. వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్ని మున్సిపాలిటీల్లోనూ పర్యటించారు. మేయర్‌ ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి. నాయకులు వాసుదేవరెడ్డి, కృష్ణారెడ్డి, జన్ను జకార్య, మెట్టు శ్రీనివాస్‌, నాగుర్ల వెంకటేశ్లర్లు తొమ్మిది మున్సిపాలిటీల్లో ఇన్‌చార్జీలుగా నియమించిన వాళ్లే కాకుండా ఆయా మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీలోని అన్ని విభాగాల బాధ్యలు, సామాన్య, క్రియాశీల కార్యకర్తలు విస్తృతంగా తామే బరిలో నిలిచామా అన్నట్టుగా కష్టపడి పనిచేశారు. బలమైన పార్టీ కార్యకర్తల బలం, అంతకంటే బలమైన పార్టీ ఇమేజ్‌, ముఖ్యమత్రి కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు పట్టణ ప్రజల్ని విశేషంగా ఆకర్షించడంలో కీలక పాత్రపోషించాయి. 

సీఎం కేసీఆర్‌ అభినందన

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఆయన సూచిస్తూ పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజల మేలు కోసం నిరంతరం పాటుపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారని ఇది అందరి విజయమని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.