మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Jan 25, 2020 , 02:37:34

టెన్షన్.. టెన్షన్!

టెన్షన్.. టెన్షన్!
  • నేడే మున్సిపోల్స్ ఓట్ల లెక్కింపు
  • తేలనున్న పుర అభ్యర్థుల భవితవ్యం
  • నర్సంపేట, పరకాల, వర్ధన్నపేటలో కౌంటింగ్
  • రెండేసి హాళ్లలో లెక్కింపునకు వార్డుకో టేబుల్
  • టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు
  • తొలుత కట్టలు.. తర్వాత ఒకే రౌండ్‌లో లెక్కింపు
  • మధ్యాహ్నం 12లోపు ఫలితాలు వెలువడే చాన్స్
  • ప్రతి హాలులో సీసీ కెమెరాలు.. లైవ్ వెబ్‌క్యాస్టింగ్


వరంగల్ రూరల్ జిల్లాప్రతినిధి-నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు శనివారం తెరపడనుంది. బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఆయా మున్సిపాలిటీల్లో అడుగు పెట్టే విజేతలెవరనేది వెల్లడి కానుంది. దీంతో పురపోరులో తలపడిన అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్. గత బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం శనివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఆయా పురపాలక సంఘాల కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి పురపాలక సంఘం కౌంటింగ్ రెండు హాళ్లలో నిర్వహించేందుకు నిర్ణయించారు. కౌంటింగ్ జరిగే ప్రతి హాలులో నాలుగేసి సీసీ కెమెరాలు అమర్చారు. లైవ్ వెబ్‌కాస్టింగ్ ద్వారా ఓట్ల లెక్కింపును వీక్షించేందుకు వీటిని హన్మకొండలోని కలెక్టరేట్, హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి అనుసందానం చేశారు. నర్సంపేటలో వ్యవసాయ మార్కెట్ రైతు రెస్టుహౌస్ భవనం, పరకాలలో గణపతి బీఈడీ కళాశాల, వర్ధన్నపేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో కౌంటింగ్ జరుగనుంది. ఆయా మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు బ్యాలెట్ బాక్సులను సదరు భవనాల్లోని స్ట్రాంగ్ రూంలకు తరలించారు. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేటలో గాని స్ట్రాంగ్ రూం కలిగిన భవనంలోనే ఓట్ల లెక్కింపునకు రెండు హాళ్లలో ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కోసం వార్డుకో టేబుల్ వేశారు. ఈ లెక్కన నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు 24, వర్ధన్నపేటలోని 12 వార్డులకు 12, పరకాలలో పోలింగ్ జరిగిన 11 వార్డులకు 11 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నర్సంపేట, పరకాలలో ప్రతి వార్డులో రెండు పోలింగ్ కేంద్రాల ద్వారా పోలింగ్ నిర్వహించారు. వర్ధన్నపేటలో మాత్రం 12 వార్డుల్లో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో బ్యాలెట్ బాక్సు ద్వారా పోలింగ్ జరిగినందున నర్సంపేటలో 48, పరకాలలో 22, వర్ధన్నపేటలో 15 బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నర్సంపేటలో 24 టేబుళ్లు, పరకాలలో 11 టేబుళ్లపై రెండేసి సార్లు, వర్ధన్నపేటలో 12 టేబుళ్లపై కొన్నింటిలో ఒకసారి, మరికొన్నింటిపై రెండుసార్లు మొదట బ్యాలెట్ బాక్కుల్లోని ఓట్లను కుప్పగా పోసి 25 ఓట్లకు ఒకటి చొప్పున కట్టలు కడుతారు. ఆ తర్వాత ప్రతి మున్సిపాలిటీ ఓట్లను ఒకే రౌండ్‌లో లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.

లెక్కించాల్సిన ఓట్లు..

జిల్లాలో నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 62,270. వీరిలో మహిళలు 32,158, పురుషులు 30,112 మంది ఉన్నారు. అయితే పరకాల పురపాలక సంఘం పరిధిలోని 22 వార్డులకు 11 వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. దీంతో ఈ మున్సిపాలిటీ పరిధిలో మిగతా 11 వార్డుల్లో మాత్రమే ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించారు. ఫలితంగా ఇక్కడి 22 వార్డుల్లో ఉన్న మొత్తం 25,293 మంది ఓటర్లలో పోలింగ్ జరిగిన 11 వార్డుల్లోని 12,644 మంది ఓటర్లలో 10,355 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నర్సంపేటలో 27,713 మంది ఓటర్లకు 23,353, వర్ధన్నపేటలో 9,263 మంది ఓటర్లకు 8,210 మంది ఓటు వేశారు. మూడు మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం 58 వార్డుల్లో 11 ఏకగ్రీవమైతే మిగతా 47 వార్డుల్లోని 49,620 మంది ఓటర్లలో 41,918 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ లెక్కన జిల్లాలో మొత్తం 84.48 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా వర్ధ్దన్నపేటలో 88.63 శాతం పోలింగ్ జరిగింది. 84.27 శాతంతో పోలింగ్‌లో నర్సంపేట రెండో స్థానంలో నిలిచింది. పరకాలలో 81.90 శాతం పోలింగ్ నమోదైంది. మూడు పురపాలక సంఘాల పరిధిలో పోలైన 41,918 ఓట్లను శనివారం కౌంటింగ్ చేయాల్సి ఉంది. వీటిలో నర్సంపేటవి 23,353, పరకాలవి 10,355, వర్ధన్నపేటవి 8,210 ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జిల్లా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సువర్ణపండాదాస్, కలెక్టర్ ఎం హరిత పరిశీలించారు. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల కమిషనర్లు శ్రీనివాసరావు, రాజు, రవీందర్‌కు కౌంటింగ్‌పై సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూంలతోపాటు  కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.logo