మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Jan 25, 2020 , 02:36:47

పరకాలలో ఏకపక్షమే!

పరకాలలో ఏకపక్షమే!


పరకాల టౌన్, జనవరి 24 : పరకాలలో మున్సిపల్ ఎన్నికలు ఏకపక్షంగానే జరిగాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు ఆ పార్టీ అభ్యర్థులకే మద్దతు తెలిపారు. దీంతో శనివారం జరుగనున్న కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్ మొజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు. పట్టణంలో 22వార్డుల్లో ఇప్పటికే 11వార్డుల్లో టీఆర్‌ఎస్ సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. కాగా, ఎన్నికలు జరిగిన మిగిలిన స్థానాల్లో కూడా ప్రజల మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉండడంతో ప్రతిపక్ష పార్టీలకు మింగుడు పడడం లేదు. ఎంతో ఘన చరిత్ర ఉన్న పరకాల పట్టణం ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు. స్వరాష్ట్రంలో పరకాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు మద్దతు తెలిపారు. దీంతో పట్టణంలో పోలింగ్ ఏకపక్షమే జరుగగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించనున్నారు. పరకాలను అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణంలో 81.90 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పరకాల పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు పలు పార్టీల నాయకులు ఇప్పటికే టీఆర్‌ఎస్‌తో కలిసి వచ్చారు. దీంతో ప్రతి పక్ష పార్టీలకు కనీసం పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు కరువైన పరిస్థితులు ఎదురయ్యాయి.

నోటిఫికేషన్ విడుదల నుంచే టీఆర్‌ఎస్ హవా

మున్సిపల్ ఎన్నికల నోటిపికేషన్ విడుదల అయిన దగ్గరి నుంచి పోలింగ్ ముగిసే వరకు టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. మొదటి నుంచి ఎక్కడా ప్రతి పక్ష పార్టీలు టీఆర్‌ఎస్‌కు పోటీ ఇవ్వలేదు. కనీసం నామినేషన్లు వేసేందుకు కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ముందుకు రాలేదు. దీంతో నామినేషన్ల ఉపసంహరణ వరకు పట్టణంలోని సగం వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పట్టణంలో ఇంటింటి ప్రచారం చేపట్టగా ప్రజలు బహ్మరథం పట్టారు. పట్టణంలో ప్రచారం కోసం ఎమ్మెల్యే ఏ వార్డుకు వెళ్లినా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆదరణ చూపారు. నేరుగా అక్కడి ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను  పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. ప్రచారంలో ముందంజలో దూసుకుపోయిన టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల జోరుకు కాంగ్రెస్, బీజేపీ విలవిలలాడాయి.

 చతికిలపడిన ప్రతిపక్ష పార్టీలు

ప్రచారంలో వెనుకంజ నిలిచిన ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ అనంతరం చతికిలపడిపోయాయి. పట్టణంలో ఏకగ్రీవమైన 11వార్డుల్లో ప్రతిపక్ష పార్టీలు కనుమరుగు కాగా.. మిగిలిన 11స్థానాల్లో కాంగ్రెస్ ఒక్క స్థానం, బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే పోటీ ఇవ్వగా.. మరో రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్ రెబల్స్ పోటీ ఇచ్చారు. మిగిలిన అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్లారు.  వారం రోజులపాటు జరిగిన జరిగిన ప్రచారంలో టీఆర్‌ఎస్ దూసుకుపోడంతో వన్‌సైడ్ పోలింగ్ జరిగింది. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పట్టణంలో అర్హ్హులైనప్రతి ఒక్కరికి ప్రభూత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

మోడల్ పరకాలగా తీర్చిదిద్దుతా

టీఆర్‌ఎస్‌పై నమ్మకం ఉంచి పరకాల మున్సిపాలిటీలో మరోసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలోనే పరకాల పట్టణాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తా. పరకాల మున్సిపాలిటీలో మంచి కౌన్సిలర్లను ప్రజలు ఎన్నుకోనున్నారు. గత ప్రభుత్వాల హయాంలో వివక్షకు గురికావడంతో పరకాల అభివృద్దికి నోచుకోలేదు. కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రధాన రోడ్ల రూపు మారడంతో పట్టణానికి ప్రత్యేక కళ వచ్చింది.  పట్టణంలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయడంతో పాటు రానున్న 5సంవత్సరాల్లో పట్టణంలోని అన్ని కాలనీల్లో అంర్గత రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తా. ప్రజలకు మౌలిక వసతులను కల్పించేందుకు పాలక వర్గం కృషి చేసే విధంగా చర్యలు తీసుకుంటా.
- చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే