బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Jan 24, 2020 , 04:51:38

27న ఆమె ఎన్నిక !

27న ఆమె ఎన్నిక !
  • - చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికకు షెడ్యూల్‌
  • - ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
  • - మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశం
  • -మూడు పుర చైర్‌పర్సన్‌ పదవులు మహిళలకు రిజర్వ్‌
  • - కైవసం చేసుకోనున్న టీఆర్‌ఎస్‌
  • - వైస్‌ చైర్‌పర్సన్‌ కోసం టీఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీకి చాన్స్‌
  • - రేపు కౌంటింగ్‌.. ఏర్పాట్లపై జనరల్‌ అబ్జర్వర్‌ సమీక్ష


మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఈ మేరకు ఎన్నిక షెడ్యూల్‌ను గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 27వ తేదీన ఆయా పురపాలక సంఘాల కార్యాలయాల్లో ఎన్నిక నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ప్రకటించారు. జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లోని చైర్‌పర్సన్‌ పదవులు మహిళలకే రిజర్వ్‌ అయ్యాయి. నర్సంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళ, పరకాల పురపాలక సంఘం చైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ మహిళ, వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్‌ అయింది. చైర్‌పర్సన్‌ పదవిని ఆశిస్తూ ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఇద్దరు ముగ్గురు మహిళలు పోటీ చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా వ్యూహాత్మకంగా తమ పార్టీ నుంచి చైర్‌పర్సన్‌ పదవిని ఆశిస్తున్న ఇద్దరుముగ్గురిని బరిలో నిలిపాయి. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అత్యధిక వార్డులను గెలుచుకుని చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులను కైవసం చేసుకునే ధీమాలో టీఆర్‌ఎస్‌ ఉంది. కాగా, ఈనెల 25న ఓట్ల లెక్కింపు జరుగనుంది. కౌంటింగ్‌ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ సువర్ణపండాదాస్‌ గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ ఎం హరిత, డీఆర్వో హరిసింగ్‌, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.
- వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి- నమస్తే తెలంగాణ 

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి- నమస్తే తెలంగాణ : జిల్లాలో మూడు పురపాలక సంఘాలు ఉన్నాయి. రిజర్వేషన్ల కేటాయింపులో ఈ మూడు పురపాలికల చైర్‌పర్సన్‌ పదవులు మహిళలకే రిజర్వ్‌ కావడం విశేషం. నర్సంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళ, పరకాల పురపాలక సంఘం చైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ మహిళ, వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్‌ అయింది. నర్సంపేటలో 24, పరకాలలో 22, వర్ధ్నపేటలో 12 వార్డులు ఉన్నాయి. వీటిలో యాభై శాతం వార్డులను అధికారులు మహిళలకు కేటాయించారు. ప్రధానంగా మూడు పురపాలక సంఘాల చైర్‌పర్సన్‌ పదవులు మహిళలకు రిజర్వ్‌ కావడంతో కొన్ని అన్‌ రిజర్వ్‌డ్‌ స్థానాల్లోనూ మహిళలు పోటీకి దిగారు. దీంతో మున్సిపల్‌ ఎన్నికల బరిలో తలపడిన అభ్యర్థుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. చైర్‌పర్సన్‌ పదవిని ఆశిస్తూ ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఇద్దరు ముగ్గురు మహిళలు పోటీ చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా వ్యూహాత్మకంగా తమ పార్టీ నుం చి చైర్‌పర్సన్‌ పదవిని ఆశిస్తున్న ఇద్దరు ముగ్గురిని బరిలో నిలిపాయి. చైర్‌పర్సన్‌ పదవి కోసం అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తపడ్డాయి. ఫలితంగా ప్రతి పురపాలక సంఘం పరిధిలో ఆయా మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవి రిజర్వ్‌ అయిన సామాజికవర్గం నుంచి ఇద్ద రు నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో దిగారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అత్యధిక వార్డులను గెలుచుకుని చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులను కైవసం చేసుకునే ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్‌లోనూ ఇదే పరిస్థితి. అవకాశాన్ని బట్టి చైర్‌పర్సన్‌ పదవికి అభ్యర్థిని ఖరారు చేసే విధంగా ముందుచూపుతో ఆయా మున్సిపాలిటీల పరిధిలోని రెండు మూడు వార్డుల నుంచి చైర్‌పర్సన్‌ అభ్యర్థులకు పోటీ చేసే చాన్స్‌ ఇచ్చింది. జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట పురపాలక సంఘాల్లో 27వ తేదీన చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నిక జరుగనుంది. ఈ మూడు మున్సిపాలిటీల్లోనూ వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ నుంచి పలువురు ఆశిస్తుండడంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కనపడుతున్నది. ఆయా పురపాలక సంఘాల చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికలో స్థానిక ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయడంతో జిల్లాలో ఆయా మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికపై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.

రేపు ఓట్ల లెక్కింపు..

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో బుధవారం పోలింగ్‌ జరిగింది. ఈ నెల 25వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. అదేరోజు సాయంత్రం 4 గంటల వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. నర్సంపేట పురపాలక సంఘం ఓట్ల లెక్కింపు స్థానిక వ్యవసాయ మార్కెట్‌ రైతు రెస్టుహౌస్‌ భవనంలో జరుగనుంది. పరకాల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు స్థానిక గణపతి బీఈడీ కళాశాలలో, వర్ధన్నపేట పురపాలక సంఘం కౌంటింగ్‌ ఇక్కడి ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఆయా మున్సిపాలిటీల పరిధిలోని పోలింగ్‌ స్టేషన్ల నుంచి బ్యాలెట్‌ బాక్సులను ఓట్ల లెక్కింపు జరిగే భవనాల్లోని స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. బ్యాలెట్‌ బాక్సులు భద్ర పరిచిన స్ట్రాంగ్‌ రూంల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘం ఓట్ల లెక్కింపు స్ట్రాంగ్‌ రూం ఉన్న భవనంలోని రెండు హాళ్లలో నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. కౌంటింగ్‌ రోజు తొలుత బ్యాలెట్‌ బాక్సులోని బ్యాలెట్‌ పేపర్లను టేబుల్‌పై కుప్పగా పోసి కట్టలుగా కడుతారు. ఆ తర్వాత రెండు రౌండ్లలో లెక్కిస్తారు. సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల ఫలితాలు వెలువడొచ్చని కలెక్టర్‌ ఎం హరిత చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లాలో 84.48 శాతం పోలింగ్‌ నమోదైంది. నర్సంపేటలో 84.27, పరకాలలో 81.90, వర్ధన్నపేటలో 88.63 శాతం పోలింగ్‌ జరిగింది. మొత్తం ఓటర్లలో మహిళలు ఎక్కువ శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరకాలలోని 22 వార్డులకు  పదకొండింటిని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఈ పదకొండింటిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. పోలింగ్‌ జరిగిన మిగతా 11 వార్డుల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారనే ధీమాతో టీఆర్‌ఎస్‌ ఉంది. నర్సంపేటలోని 24 వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని గులాబీ నేతలు విశ్వసిస్తున్నారు. వర్ధన్నపేటలోని 12 వార్డుల్లోనూ ఇదే పరిస్థితి. వార్‌ వన్‌సైడ్‌ సాగిందని ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు తేల్చి చెపుతున్నారు.

కౌంటింగ్‌ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష..మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ సువర్ణపండాదాస్‌ గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ ఎం హరిత, డీఆర్వో హరిసింగ్‌, వరంగల్‌ రూరల్‌, పరకాల ఆర్డీవోలు మహేందర్‌జీ, కిషన్‌, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపల్‌ కమిషనర్లు శ్రీనివాసరావు, రాజు, రవీందర్‌ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ నెల 25న మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సువర్ణపండాదాస్‌ అన్నారు. ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్‌ ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. ప్రతి టేబుల్‌కు మైక్రో అబ్జర్వర్‌, సూపర్‌ వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లు ఉండాలని స్పష్టం చేశారు. ప్రతీది వీడియోగ్రఫీ చేయాలని, ఓట్ల లెక్కింపును లైవ్‌ ద్వారా చూసేందుకు వెబ్‌ క్యాస్టింగ్‌ కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. ఒక అభ్యర్థితో పాటు ఒక ఏజెంట్‌ మాత్రమే కౌంటింగ్‌ హాలులో ఉండాలని, ఈ నెల 27వ తేదీన చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికలూ జరుగనున్నందున అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయాలని జనరల్‌ అబ్జర్వర్‌ సూచించారు. కలెక్టర్‌ హరిత మాట్లాడుతూ ఎన్నికల నియమావళికి అనుగుణంగా కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు కోసం పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని, చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక కోసం ఒక నోడల్‌ అధికారిని నియమిస్తున్నట్లు ఆమె తెలిపారు.logo