కబ్జాదారులను ప్రోత్సహిస్తే చర్యలు

- - సీసీ కెమెరాల పనితీరుపై రోజువారీగా సమీక్ష నిర్వహించాలి
- - పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్
- -కమిషనరేట్‌లో పోలీస్ అధికారులతో నేర సమీక్ష
వరంగల్ క్రైం, జనవరి 23: భూ కబ్జాదారులను ప్రోత్సహించే పోలీస్ అధికారులపై శాఖపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వీ రవీందర్ హెచ్చరించారు. గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నెలవారీ నేరసమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఠాణాల వారీగా అధికారుల పని తీరుతో పాటు కేసుల నమోదు, వాటి పరిష్కారం, ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి తప్పక రశీదు అందజేయాలని, చట్టాలను అనుసరించి కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. విజబుల్ పోలీసింగ్‌లో భాగంగా బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది ముమ్మరంగా గస్తీ నిర్వహించడమే కాకుండా పా త నేరస్తుల సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ప్రజలతో మమేకమైనప్పుడే నేరాలను నియంత్రించగల్గుతామని, ఆ దిశగా పోలీస్ సి బ్బంది పని చేయాలన్నారు. నేరాల నియంత్రణ కోసం ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించేలా సంబంధిత అధికారి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ సీపీ స్థాయి అధికారులు సీసీ కెమెరాల పనితీరుపై రోజువారీ సమీక్ష జరపాల్సి ఉంటుందన్నారు.
ట్రాఫిక్ సమస్య రానివ్వొద్దు..
మేడారం జాతరకు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీస్ అధికారులు ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలని సీపీ పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పరిష్కార మార్గాలను సూచించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రతి ఐదు కిలో మీటర్లకు ఒక సూచిక బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సరళీని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మావేశంలో డీసీపీలు నాగరాజు, శ్రీనివాస్‌రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ యోగేశ్ గౌతం, అదనపు డీసీపీలు మల్లారెడ్డి, భీంరావు, గిరిరాజు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.