మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Jan 22, 2020 , 04:04:39

నేడే పోలింగ్

నేడే పోలింగ్


(వరంగల్ జిల్లాప్రతినిధి- నమస్తేతెలంగాణ)మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ బుధవారం జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ నిర్వహణ కోసం ప్రిసైడింగ్ అధికారు(పీవో)లు, అసిస్టెంటు ప్రిసైడింగ్ అధికారు(ఏపీవో)లు బ్యాలెట్ పెట్టెలు, పేపర్, ఇతర సామగ్రితో మంగళవారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ లైవ్ ద్వారా వీక్షించేందుకు ఎన్నికల అధికారులు 36 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ ఏర్పాటు చేశారు. వీటిని హన్మకొండలోని కలెక్టరేట్ అనుసంధానం చేశారు. 21 లొకేషన్లలో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఇక్కడ 24 మంది విధులు నిర్వహిస్తారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మూడు మున్సిపాలిటీల పరిధిలో 58 వార్డులు ఉన్నాయి.

వీటిలో పరకాల పురపాలక సంఘం పరిధిలోని 22 వార్డులకు గాను 11 వార్డుల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ పదకొండు వార్డుల్లోనూ ఏకగ్రీవమైన పదకొండు మంది టీఆర్ అభ్యర్థులే. దీంతో పరకాల మున్సిపాలిటీ పరిధిలో మిగత 11 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పదకొండు వార్డుల్లో 30 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. నర్సంపేట పురపాలక సంఘం పరిధిలో 24 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 110 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వర్దన్నపేట మున్సిపాలిటీ పరిధిలో గల 12 వార్డుల్లో 50 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మూడు పురపాలక సంఘాల పరిధిలోని 58 వార్డులకు గాను ఎన్నికలు జరిగే 47 వార్డుల్లో మొత్తం 190 మంది అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్నారు. పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు 648 మంది పీవోలు, ఏపీవోలు, ఇతర పోలింగ్ అధికారు(ఓపీవో)లను నియమించారు. వీరిలో పీవోలు 129, ఏపీవోలు 129 మంది ఉన్నారు.

లైవ్ వెబ్

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 62,270 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 32,158, పురుషులు 30,112 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ కోసం మూడు పురపాలక సంఘాల పరిధిలో 107 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జరిగింది. వీటిలో 36 కేంద్రాల్లో లైవ్ వెబ్ ఏర్పాటు చేశారు. అధికారులు పోలింగ్ లైవ్ ద్వారా వీక్షించేందుకు ఈ 36 కేంద్రాలను కలెక్టరేట్ అనుసంధానం చేశారు. నర్సంపేటలో 10, పరకాలలో 9, వర్ధ్దన్నపేటలో 6 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ లైవ్ వీక్షించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నర్సంపేటలోని 6, పరకాలలోని 12, వర్ధ్దన్నపేటలోని 3 లొకేషన్లలో గల పోలింగ్ కేంద్రాల్లో 24 మంది మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తారు. పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎం.హరిత, ఇతర ఎన్నికల అధికారులు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. 107 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మకమైనవి 33 ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

వీటిలో సెన్సిటివ్ 18, హైపర్ సెన్సిటివ్ 9, క్రిటికల్ 6 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ప్రకటించారు. ప్రతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రంలో ఒక ఎస్సై, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహిస్తారు. ఈస్ట్ జోన్ డీసీపీ కేఆర్ నాగరాజు తమ పోలీసు అధికారులతో కలిసి మంగళవారం వివిధ పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు బ్యాలెట్ బాక్సులు, పేపర్, ఇతర ఎన్నికల సామగ్రితో ఆయా మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత బుధవారం సాయంత్రం బ్యాలెట్ బాక్సులను స్థానిక స్ట్రాంగ్ రూములకు తరలిస్తారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

పౌరుడి అస్తిత్వానికి ప్రతీక : కలెక్టర్ హరిత

ఓటు పౌరుడి అస్తిత్వనికి ప్రతీక. ఓటు హక్కు అనేది వజ్రాయుధం. ప్రతి ఒకరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు ఎంతో పవిత్రమైనది. ఒక ప్రాంత భవితను నిర్దేశించగల శక్తి ఒక్క ఓటుకే ఉందన్న విషయాన్ని మరువరాదు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయటం తమ బాధ్యతగా భావించాలి. నర్సంపేట, పరకాల, వర్దన్నపేట మున్సిపాలిటీల పరిధిలో బుధవారం జరిగే పోలింగ్ ప్రతి ఓటరు సామాజిక బాధ్యతగా ఓటు వేయాలి. మనం ఓటు వేసే ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. ఓటు ఆవశ్యకత, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు విలువను తెలుసుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది.