మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Jan 21, 2020 , 02:48:09

క్లీన్‌స్వీప్‌

క్లీన్‌స్వీప్‌
  • -ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే
  • - కాంగ్రెస్‌, బీజేపీలకు అభ్యర్థులే లేరు
  • - పరకాలను మోడల్‌ సిటీగా మార్చడమే లక్ష్యం
  • - పారదర్శకంగా పనిచేస్తున్నందునే ఏకగ్రీవాలు
  • -అభివృద్ధి కోసం ప్రజలందరూ టీఆర్‌ఎస్‌ వెంటే
  • -11వార్డుల్లోనూ గెలవబోతున్నాం
  • -‘నమస్తే తెలంగాణ’తో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

‘పుర పోరులో పరకాల మున్సిపాలిటీని క్లీన్‌స్వీప్‌ చేయడం ఖాయం. ఇక్కడ వార్‌ వన్‌సైడే. ప్రజలంతా గులాబీ దళం వెంటే ఉన్నారు.. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరకాలలో పారదర్శకంగా అమలవుతున్నాయి. అందుకే రాష్ట్రంలో మరెక్కడాలేని విధంగా 22 వార్డుల్లో 11వార్డులను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మిగతా 11 వార్డులనూ దక్కించుకోనుంది. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు బీఫారాలు పట్టుకుని తిరిగినా ఎవరూ దొరకని పరిస్థితి నెలకొంది. ఆ పార్టీల నేతలు పగటి కలలు కంటున్నారు. ఇప్పటికైనా నిజం తెలుసుకుంటే వారికే మంచిది’ అనిఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పురపోరుపై ఎమ్మెల్యే చల్లా ‘నమస్తే తెలంగాణ’తో సోమవారం ప్రత్యేకంగా ముచ్చటించారు.
                      -వరంగల్‌రూరల్‌ జిల్లాప్రతినిధి/నమస్తే తెలంగాణ

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి- నమస్తే తెలంగాణ : దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ తెలంగాణలో ప్రవేశపెట్టి పారదర్శకంగా ప్రజలకు చేరవేస్తున్నందునే ఈ సారి కూడా పురపాలికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.  మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

నమస్తే : రాష్ట్రంలో ఎక్కడాలేనివిధంగా పరకాలలో ఏకగ్రీవాలు జరిగాయి.  దీనిపై మీ కామెంట్‌?

ఎమ్మెల్యే : వాస్తవంగా ఈ రోజు తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో పరకాల నియోజకవర్గంలో గత ఐదేళ్ల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలెన్నో చేయడం జరిగింది. ఒక కుగ్రామంగా ఉన్న పరకాలను ఒక మోడల్‌ సిటీగా చేసేందుకు అహర్నిశలు కష్టపడి పట్టణంలో ప్రధాన రోడ్ల విస్తరణ, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు వంటివి చేశాం. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అనునిత్యం కాపాడుకుంటూ పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్‌ ఏది ఆదేశించినా, ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా, అభివృద్ధి కార్యక్రమాలేవి ఇచ్చినా పారదర్శకంగా ప్రజలకు అందించడం జరుగుతుంది. దీంతో ఈ రోజు అన్ని పార్టీల వారు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు మున్సిపల్‌ ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకుంటేనే మనకు మంచి అభివృద్ధి కనపడుతుందనే ఆలోచనకొచ్చి 11వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు. మరో ఐదారు వార్డులు ఏకగ్రీవమయ్యే సమయానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కై ఏకగ్రీవాలు కాకూడదనే దురుద్దేశంతో మున్సిపాలిటీ కార్యాలయం ముందు బైఠాయించి ఆపాయి. ప్రతిపక్షాలకు ఎన్నికల్లో నిలబడేందుకు అభ్యర్థులు కూడా దొరకలేదు. బీజేపీ నుంచి 18వార్డుల్లో, కాంగ్రెస్‌ నుంచి 16వార్డుల్లో అభ్యర్థులు పోటీలోనే లేరు. ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న 11వార్డుల్లో కేవలం నాలుగు వార్డుల్లో బీజేపీ, ఆరు వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారంటే వారికి అభ్యర్థులు లేరనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. మిగిలిన 11వార్డులను కూడా ఎన్నికల్లో గెలిచి పరకాల మున్సిపాలిటీని క్లీన్‌స్వీప్‌ చేయబోతున్నాం.
నమస్తే : ప్రచారానికి మీరు గడపగడపకూ వెళ్లారు.

పజల స్పందన ఎలా ఉంది?

ఎమ్మెల్యే : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ప్రణాళికాబద్ధంగా ముందే తయారుచేసుకోవడం జరిగింది. కాబట్టి ఏ ఇంటికి, ఏ గడపకు వెళ్లినా ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇస్తున్న స్పందన మరువలేనిది. ఎందుకంటే సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతీ ఇంటికి ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరాయి. కాబట్టే కరుడుగట్టిన కాంగ్రెస్‌, బలంలేని బీజేపీ వాళ్లు, ప్రతిపక్ష పార్టీలు అంతా కలిసి అభివృద్ధి కోసం కారు.. కేసీఆర్‌ కావాలని అంటున్నారు. కారు గుర్తుమీదనే ఓటేస్తమని ధీమాగా చెబుతున్నారు. మీకు ఏ అభ్యర్థితో పనిలేదు. మిమ్మల్ని బలపరుస్తున్నామని బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

నమస్తే : పరకాల మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళిక ఏవిధంగా ఉండబోతోంది?

ఎమ్మెల్యే : ఈ మున్సిపాలిటీ పరిధిలో గత ఐదేళ్లలో ప్రధాన కూడళ్లు, రోడ్లు బాగుచేసుకున్నాం. ఇప్పుడు అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ, దామెర చెరువు మినీ ట్యాంకుబండ్‌తో పాటు ఇతర పనులు పూర్తిచేయబోతున్నాం. అంబేద్కర్‌ సెంటర్‌, పాత ఏటీఎం సెంటర్‌, బస్టాండ్‌ సెంటర్‌, బస్‌ డిపో సెంటర్‌, కూడళ్లను సుందరీకరించబోతున్నాం. అంతేకాకుండా పట్టణంలో రెండు ఓపెన్‌ జిమ్‌లు, మహిళలు, పురుషులకు ప్రధాన కూడళ్లలో టాయిలెట్స్‌ సౌకర్యం ఏర్పాటు చేయబోతున్నాం. పట్టణ సుందరీకరణకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తాం. గతంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను తీసేసి నూతనంగా వేయబోతున్నాం. ప్రభుత్వ దవాఖానను వంద పడకలకు మార్చడం, డిగ్రీ కళాశాలకు నూతన భవనం, ఒక మంచి ఆర్‌అండ్‌బీ అతిథిగృహం, వీధి షాపుల వారికి షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టివ్వబోతున్నాం. అలాగే వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వబోతున్నాం. ప్రధానంగా పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టివ్వడం, బస్టాండ్‌ను ఆధునీకరించడం, మినీ స్టేడియం నిర్మించటం వంటివి చేపడుతాం.

నమస్తే : మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

ఎమ్మెల్యే : ప్రతిపక్ష పార్టీలకు వాస్తవంగా కరువొచ్చింది. పరకాల మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఇది కేవలం పరకాలలోనే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతిపక్ష పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. పరకాల మున్సిపాలిటీని మంచి ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం నా బాధ్యతగా తీసుకుంటా. 75 గజాల జాగ ఉంటే ఇల్లు కట్టుకోవటానికి మున్సిపాలిటీ అనుమతి తీసుకునే అవసరమే లేదు. 75గజాల కంటే ఎక్కువ స్థలం ఉంటే మున్సిపాలిటీ అనుమతి తప్పనిసరి. 21రోజుల్లో అనుమతి ఇప్పిస్తా. అదికూడా ఏ ఒక్క రూపాయి లంచం ఎవరికీ ఇవ్వకుండా. 21 రోజుల్లో అనుమతి రాకపోతే అనుమతి ఇచ్చినట్లే భావించొచ్చు. సీఎం కేసీఆర్‌ రూపొందించిన కొత్త మున్సిపల్‌ చట్టంతో ఇలా ఎన్నో మార్పులు చేయబోతున్నాం. కాబట్టి పరకాల మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగే 11వార్డులను టీఆర్‌ఎస్‌ గెలవబోతున్నది.