సారూ.. కారూ.. కేసీఆరే ఇదీ ప్రజల మాట

- -అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయం
- - రూ.వందల కోట్లతో అభివృద్ధి చేసినం..
- -ఓట్లడిగే హక్కు టీఆర్ఎస్కే ఉంది
- -మున్సిపాలిటీలను నాశనం చేసింది కాంగ్రెస్
- -కాంగ్రెసోళ్లకు ప్రజల వద్దకు వెళ్లే ముఖమే లేదు
- -బీజేపీ వాళ్లు ఎక్కడ గెలుస్తరో చెప్పే ధైర్యం ఉందా..?
- -కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లేస్తే మురికి కాలువలో వేసినట్టే
- -మా కార్యకర్తలు, నాయకులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నరు
- -‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి
(వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ): ‘నా రాజకీయ జీవితంలో ఇంత వన్‌సైడ్ ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. ప్రజలు సిద్ధంగా ఉన్నరు. ఎక్కడ చూసినా సారూ..కారూ..కేసీఆరే అంటున్నరు. ఇది నేను చెప్పడం కాదు. ప్రజలు చెబుతున్నరు’ అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ నాశనం పట్టించింది. బీజేపీ ఉనికే లేదు. బీజేపీ వాళ్లకు దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు ఇప్పించి జనం దగ్గరికి వస్తే ముఖం తెలివుండు. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లేస్తే మురికి కాలువల వేసినట్టే అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రజలు దేవుడిలెక్క కొలుస్తున్నరు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశనంతో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయన్న నమ్మకం ప్రజల్లో వచ్చిందని ఆయన అన్నారు. ఎక్కడికి పోయినా జనం బ్రహ్మరథం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ సహా కొన్ని చోట్ల ఉనికి కోసం పోటీలో నిలవాలని చూస్తున్నరే కానీ గెలిచేందుకు కాదని ఆయన తేల్చిచెప్పారు. ప్రజాస్పందన, టీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిదికి తొమ్మిది మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అంటున్న ఆయన ధీమా వెనుకున్న ఆంతర్యం ఏమిటో ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూ వివరాలిలా ఉన్నాయి.
నమస్తేతెలంగాణ : మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది?
మంత్రి: ఎన్నికల ప్రచారం అని బయటికి కనిపించినా.. విజయోత్సవాల తీరుగా ఉంటున్నయి. ఎక్కడికి పోయిన జనం అపూర్వ స్వాగతం పలుకుతున్నరు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తేనే మా మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని వాళ్లు నమ్మకంగా ఉన్నారు. నేను అనేక ఎన్నికలు చూసిన, నా 36 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంత వన్‌సైడ్ ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. అవతలివాళ్లు పోటీ ఇస్తే కదా! ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపాలిటీల్లో చేసిన అభివృద్ధి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్ సారథ్యంలో అన్ని మున్సిపాలిటీల్లో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు కాకుండా ఇంక దేనికి ఓటేస్తాం సార్ బహిరంగంగా చెప్తున్నరు. ఎక్కడికిపోయినా ఒక్కటే ముచ్చట సారూ..కారూ..కేసీఆరే అంటున్నరు. ఇంటిముందట కారు గుర్తుతో ముగ్గేసి మా ఓటు టీఆర్ఎస్కే అని బాజాప్త చెప్తున్నరు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరు.
నమస్తే తెలంగాణ: ఎన్నికలు వస్తున్నాయని తెలిసి మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చారని కాంగ్రెస్, బీజేపీలు అంటున్నాయి.. మరి మీరేమంటారు?
మంత్రి: టీఆర్ఎస్ ఎన్నికల కోసం పనిచేసే పార్టీ కాదు. తెలంగాణ తెచ్చిన బాధ్యతగల పార్టీ, తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు పని చేస్తున్న నాయకుడు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి వచ్చిన ఏ ఎన్నికల్లో అయినా వాళ్లు గెలిచారా? అప్పుడు గెలవలేదు. ఇప్పుడూ గెలవరు. అసలు ఎన్నికలు ఆపాలని కోర్టుల్లో కేసులేసి, ఎట్ల ఎన్నికల్ని ఆపాలని చూసినవాళ్లు, ప్రపంచం మెచ్చుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కడుతాంటే కూడా దాన్ని ఆపాలని కేసులేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజల మధ్యన లేకుండా ఎన్నికల్ని ఆపాలని, జరుగుతున్న అభివృద్ధిని ఆపాలని చూసే కుట్రదారులకు ప్రజలకు ఓట్లేలా వేస్తారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ప్రజలకు బ్రహ్మాండమైన గౌరవం, విశ్వాసం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు ముఖ్యం కాదు. ప్రజల అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే టీఆర్ఎస్ ఉండాలని ప్రజలు విపరీతంగా మద్దతు ఇస్తున్నరు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆశీర్వదిస్తున్నరు. ఎన్నికలు అనంగనే పండుగకు చుట్టాలొచ్చినట్టు వచ్చిపోయే పార్టీ టీఆర్ఎస్ కాదు. జనం మధ్యలో ఉండి. జనం కోసం పనిచేసే పార్టీ టీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు ఏనాడో గుర్తించారు. అందుకే ఎన్నిక ఏదైనా ఫలితం టీఆర్ఎస్దిగా ఉంటుంది. రేపు అన్ని మున్సిపాలిటీల మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమై పోయింది. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్టు కూడా రావు రాసిపెట్టుకొండి.
నమస్తే తెలంగాణ: టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమన్వయం ఎలా ఉంది?
మంత్రి: మా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరికి వారు ఎక్కడికక్కడ తామే పోటీచేస్తున్నామని బాధ్యతతో పనిచేస్తున్నరు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశంతో అందరం కష్టపడుతున్నం. ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, రెడ్యానాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పోటీపడి పనిచేస్తున్నరు. ఎన్నికలెప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు ముందే అందరం పార్టీ నాయకులతో వార్డుల వారీగా సమన్వయ కమిటీలు వేసుకున్నాం. ఎమ్మెల్యేలు కష్టపడుతున్నరు. మంత్రి సత్యవతిరాథోడ్, చీఫ్ విప్‌లు బొడకుండి వెంకటేశ్వర్లు, దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్, మేయర్ ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి. వాసుదేవరెడ్డి, కృష్ణారెడ్డి, జన్ను జకార్య, మెట్టు శ్రీనివాస్, నాగుర్ల వెంకటేశ్లర్లు ఇలా తొమ్మిది మున్సిపాలిటీల్లో ఇన్‌చార్జీలుగా అనుకొని పార్టీ ఆదేశంతో అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తున్నం. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ అన్ని విభాగాల నాయకులు, కుల సంఘాలు, పార్టీ యూత్, విద్యార్థి, రైతు సమన్వయ సమితిలు ఇలా ఒక్కరు కాదు అందరూ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్టు ఒక్కొక్క ఓటరును నాలుగైదుసార్లు కలిసినం. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ , ఎమ్మెల్యే టీఆర్ఎస్ మున్సిపాలిటీ వార్డుల్లో, మున్సిపల్ చైర్మన్ పీఠంపై టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే మా పట్టణం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దున్నపోతుకు గడ్డేసి పాలు పితికితే లాభం లేదని టీఆర్ఎస్ కాకుండా వేరే ఎవలకు ఓటేసినా మా వార్డు అభివృద్ధి జరగదని ప్రజలు గట్టిగా నిర్ణయం తీసుకున్నరు. ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నరు. మేం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఉన్నం. మా గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది.
నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీలకు మీరేం చేయలేదు? మా హయాంలో చేసినం అని కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రచారం చేస్తున్నరు. దీనికి మీ స్పందన?
మంత్రి: వాళ్లకు సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలను నాశనం చేసింది. ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నరో అర్థం కావడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ వరంగల్ కార్పొరేషన్, జనగామ మున్సిపాలిటీ రెండే రెండు ఉండేది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇయ్యాల తొమ్మిది మున్సిపాలిటీలను చేసిన మహాత్ముడు. పేరుకు మున్సిపాలిటీలను చేసిన వదలిపెట్టలేదు. వర్ధన్నపేట, డోర్నకల్, మరిపెడ వంటి చిన్నచిన్న మున్సిపాలిటీలకు రూ.20 కోట్ల నిధులిచ్చి కొత్త మున్సిపాలిటీలు అయినా పాత వాటితో పోటీపడేలా అభివృద్ధి చేస్తున్నం. జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలు ఇవ్వాళ అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. తొర్రూరు మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడిందే అయినా ఇప్పటికే రూ. 100కోట్లు ఖర్చుపెట్టి పాత మున్సిపాలిటీలతో పోటీపడి అభివృద్ధి జరుగుతుంది. ప్రతి మున్సిపాలిటీల్లో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, మెరుగైన శానిటేషన్, ప్రతి మున్సిపాలిటీల్లో వైకుంఠ ధామాలు, మోడల్ మార్కెట్లు, స్వచ్ఛమైన తాగునీరు ఇలా ఒకటారెండా అనేకం చేసినం. పనిచేసిన వాళ్లు ఎవరో? వచ్చిన నిధుల్ని దిగమింగిన వాళ్లెవరో ప్రజలకు బాగా తెలుసు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కులేదు. ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని అభివృద్ధి కోసం కాకుండా అవినీతి కోసమన్నట్టుగా ఆ పార్టీ కాలంలో చేసిన రోజులు మరిచిపోయి ఇయ్యాల ఎన్నికలు అనగానే మాకు ఓటేయండి అని సిగ్గులేకుండా మళ్ల జనం మధ్యకు వస్తున్నారని జనమే వాళ్లను ఛీ అంటున్నరు. బీజేపీ వాళ్లు అక్కడక్కడా మేం ఇంతపొడుగు చేసినం అని చెప్తున్నరు కదా? వాళ్లకు దమ్మూ ధైర్యం ఉంటే కేంద్రం నుంచి మనకు రావలసిన నిధుల్ని తెప్పించి ప్రజల దగ్గరికి వెళ్లండి అని నేను సవాల్ వేసిన ఇంత వరకు దీనిమీద మాట్లాడేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లేస్తే మురికి కాలువలలో వేసినట్టే. అసలు వాళ్లకు ఓట్లడిగే హక్కేలేదు.
తాజావార్తలు
- భార్యను చంపిన కేసులో ఏడేండ్ల జైలు
- బైకులు ఢీకొని ఒగ్గు కళాకారులు దుర్మరణం
- రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- చదువుకోక టీవీ చూస్తున్నాడని నిప్పంటించాడు
- కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది మృతి
- రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ
- మేడారం మినీ జాతరకు ప్రత్యేక బస్సులు
- అంగన్వాడీల సేవలు మరింత విస్తరణ
- దేశంలోనే తెలంగాణ పోలీస్ అగ్రగామి
- శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీ.. భారత్ 70/1