బుధవారం 20 జనవరి 2021
Warangal-rural - Jan 20, 2020 , 03:45:23

నిజాం కాలంలో కుగ్రామం.. స్వరాష్ట్రంలో మోడల్‌ సిటీ

నిజాం కాలంలో కుగ్రామం.. స్వరాష్ట్రంలో మోడల్‌ సిటీ
  • -అభివృద్ధి పథంలో నర్సంపేట
  • -జీపీ నుంచి మున్సిపాలిటీ వరకు మహాప్రస్థానంనర్సంపేట టౌన్‌, నమస్తే తెలంగాణ : నిజాం పాలనలో ఓ కుగ్రామం.. తదనంతర పరిణామాతో దిదినాభివృద్ధి చెంది నేడు స్వరాష్ట్ర పాలనలో జిల్లాకే తలమాణికమైన నర్సంపేట ఓ మోడల్‌ సిటీగా వెలుగొంతున్నది. నర్సంపేట గ్రామ పంచాయతీగా,  నగర పంచాయతీగా, నేడు మున్సిపాలిటీగా తన మహాప్రస్థానం కొనసాగిస్తుంది. కేవలం జనాభా ప్రాతిపదికన ఏర్పడిన మున్సిపాలిటీగానే కాకుండా రైస్‌ మిల్లులు, పత్తిమిల్లులు తదితర పరిశ్రమలను ఏర్పాటు చేశారు. దీంతో ఎంతో మందికి ఉపాధి లభిస్తున్నది.  ఇంజినీరింగ్‌, బీఈడీ, ఫార్మసీ , డిగ్రీ, పీజీ తదితర కళాశాలల ఆవిర్భావంతో విద్యాఖిల్లాగా శోభిల్లుతున్నది. సమీపంలోని మల్లంపల్లి గ్రామం నుంచి నర్సంపేట మీదుగా వెళ్లే సిరొంచరేణిగుంట(తిరుపతి) 365వ నంబర్‌ జాతీయ  రహదారి నర్సంపేటకు మరో కలికితురాయిగా చెప్పొచ్చు. పట్టణం చుట్టూ నిర్మితమైన  డబుల్‌ రోడ్లు ఒక వైపు, టౌన్‌లో  కాలికి మట్టి అంటనివ్వని  అంతర్గత రోడ్లతో ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి.  తెలంగాణ శబరిగా పేరుపొందిన ధర్మశాస్త అయ్యప్ప దేవాలయంతో ఆధ్యాత్మికత, రూ .కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఆధునిక పార్కులు పచ్చదనంతో మరో వైపు నర్సంపేటకు  ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. దినదినం అభివృద్ధి పథంలో పయనిస్తున్న నర్సంపేటపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.

1952లో గ్రామ పంచాయతీగా ఆవిర్భావం!

నర్సంపేట నిజాం పాలనలో పాకాల తాలుకాలో ఓ కుగ్రామంగా ఉండేది. నిజా పాలకులుగా నెక్కొండ నుంచి పాకాల సరస్సుకు వెళ్లే మార్గంలో ఒక విడిది చేసే సురక్షిత ప్రాంతంగా ఎంచుకున్నారు. అతితక్కువగా ఇండ్లు, జనాభాతో ఉన్న ఆ గ్రామం స్వాతంత్య్రం అనంతరం తొలి పంచాయతీరాజ్‌ చట్టంలో భాగంగా 1952లో నర్సంపేట గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. 1952లో పంచాయతీ రాజ్‌ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో చలపాటి వెంకటేశ్వరరావు మొదటి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నాటి నుంచి నర్సంపేట ప్రజాపాలనలో తన ప్రస్థానం కొనసాగిస్తుంది. 1952లో నెక్కొండ సమితిలో సభ్య గ్రామంగా కొనసాగిన నర్సంపేట అనంతరం జరిగిన శాసనసభ స్థానాల పునర్విభజనలో అసెంబ్లీ స్థానంగా అవతరించింది. గ్రామ పంచాయతీగా, అసెంబ్లీ స్థానం కేంద్రంగా  కొనసాగుతున్న నర్సంపేటలో ప్రజారవాణా కోసం ఆర్టీసీ బస్‌డిపో, బస్‌స్టాండ్‌ ఏర్పాటు చేశారు.  నర్సంపేట మండలంతో పాటు  ఖానాపురం, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి లాంటి వ్యవసాయాధారిత మండలాల పరిధిలోని 120 గ్రామాలు  ఉన్నాయి.  ఆసియాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌ నర్సంపేటలో  ఏర్పాటైంది. నేడు రైతులు పండించిన అన్ని రకాల పంటల క్రయవిక్రయాలు ఈ మార్కెట్‌లోనే కొనసాగుతున్నాయి. ప్రతి యేటా రూ.450 కోట్ల టర్నోవర్‌తో వ్యాపార పరంగా రైతులకు ఆదాయ వనరుగా, అండగా నిలుస్తుంది.

2002లో రెవెన్యూ డివిజన్‌ ఆవిర్భావం..

నర్సంపేట గ్రామ పంచాయతీగా ప్రజలకు సేవలు అందిస్తూనే  2002లో చెన్నారావుపేట, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట మండలాలతో కలిపి రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటైంది.  మొదటి ఆర్డీవోగా రామస్వామి వ్యవహరించారు.  ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మాత్రమే పరిమితమైన నర్సంపేట  ఇంజినీరింగ్‌, ఫార్మసీ, బీఈడీ, టీటీసీ, ఎంసీఏ, ఎంబీఏ తదితర  పీజీ  కోర్సులకు నిలయంగా మారింది. పట్టణంలో అక్షరాస్యత 81.67% ఉంది. అక్షరాస్యతలో తెలంగాణ రాష్ట్ర సగటు అక్షరాస్యత 67.02% కంటే నర్సంపేట అక్షరాస్యత అధికంగా ఉండడం గర్వకారణం. పట్టణంలో ప్రజలకు ఆర్డీవో కార్యాలయంతో పాటు మున్సిఫ్‌ కోర్టు అందుబాటులో ఉన్నాయి.

నగరపంచాయతీ, మున్సిపాలిటీగా..

గ్రామ పంచాయతీగా ఉన్న నర్సంపేటను 2011 సెప్టెంబర్‌ 3వ తేదీన నగర పంచాయతీగా ఉన్నతీకరణ పొందింది. నాడు పట్టణంలో ఉన్న జనాభా గణన ప్రకారం 20 వార్డులతో  నగర పంచాయతీగా ఏర్పాటైంది. నగర పంచాయతీగా పట్టణంలో ప్రజలకు తాగునీరు, రోడ్లు, తదితర మౌలిక సదుపాయాల కల్పన కొనసాగింది. అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వరాష్ట్రంలో ప్రజలకు మొరుగైన పాలన అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.  2014లో జరిగిన మొదటి మున్సిపాలిటీ ఎన్నికల్లో పాలెల్లి రాంచందర్‌ మొదటి చైర్మన్‌గా ఎన్నికైనారు. నాటి నుంచి మున్సిపాలిటీగా కొనసాగుతూ దిదినాభివృద్ధి చెందుతూ మోడల్‌ సిటీగా రూపాంతరం చెందుతుంది.  జిల్లాల పునర్విభజనలో భాగంగా నర్సంపేట వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోకి వెళ్లింది.  మున్సిపాలిటీ రెండో పాలకవర్గాన్ని ప్రజలు ఈనెల 22న ఎన్నుకోనున్నారు.

మోడల్‌ సిటీ వైపు అడుగులు..

కుగ్రామం నుంచి గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపాలిటీ ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న నర్సంపేట రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రత్యేక నిధులతో మోడల్‌ సిటీగా ఎదగడానికి అడుగులు వేస్తున్నది. రూ. 200 కోట్ల నిధులతో పట్టణంలో అభివృద్ధి పనులు ప్రారంభమై వివిధ స్థాయిల్లో ఉన్నాయి. మిషన్‌ భగీరథతో ఇంటింటికి రక్షిత తాగునీటి పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రూ. 2 కోట్ల నిధులతో అధునాతన వ్యవసాయ మార్కెట్‌ నిర్మాణం కొనసాగుతుంది. రూ. 4 కోట్ల వ్యయంతో సివిల్‌ జడ్జి భవనం నిర్మాణం పూర్తయింది.  పట్టణంలో ప్రధాన కూడళ్ల సుందరీకరణ, పార్కుల నిర్మాణం, మినీట్యాంకు బండ్‌,  యువతను క్రీడలలో ప్రోత్సహించడానికి స్టేడియం, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు పనులు చకచకా జరుగుతున్నాయి. నర్సంపేట మున్సిపాలిటీగానే కాకుండా  జిల్లాకే అధికార కేంద్రం స్థాయిలో అభివృద్ధి చెందుతున్నదని చెప్పవచ్చు.logo