గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Jan 19, 2020 , 01:56:09

మున్సిపోల్స్‌కు ఏర్పాట్లు పూర్తి

మున్సిపోల్స్‌కు ఏర్పాట్లు పూర్తి
  • -మూడు మున్సిపాలిటీలు.. 58 వార్డులు
  • -62,270 మంది ఓటర్లు
  • -బరిలో 190 మంది అభ్యర్థులు
  • -సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు
  • -సిద్ధంగా బ్యాలెట్‌ బాక్సులు
  • -మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 22న ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు సెలవు
  • -మద్యం అమ్మకాలపై ఆంక్షలు

నర్సంపేట టౌన్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో ఈనెల 22న ఎన్నికలను నిర్వహించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మూడు మున్సిపాలిటీల్లోని 58 వార్డుల్లో మొత్తం 62,270 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు 48 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పురుషులు 13,293, మహిళలు 14420 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పరకాల పరిధిలోని 22 వార్డులకు 44 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పురుషులు 12,311, మహిళలు 12,982 మంది ఓటు వేయనున్నారు.  వర్ధన్నపేట పరిధిలో 12 వార్డులకు 24 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పురుషులు 4,508 మంది, మహిళలు 4,756 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  నర్సంపేటకు రిటర్నింగ్‌ అధికారులు 8 మంది, సహాయ రిటర్నింగ్‌ అధికారులు 8 మంది, రిజర్వులో ఒకరు,  పరకాల మున్సిపాలిటీకి రిటర్నింగ్‌ అధికారులు ఏడుగురు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు ఏడుగురు, రిజర్వులో ఒకరు, వర్ధన్నపేటకు రిటర్నింగ్‌ అధికారులు నలుగురు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు నలుగురిని నియమించారు.

బరిలో 190 మంది అభ్యర్థులు !

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 190 మంది అభ్యర్ధులు  ఎన్నికల బరిలో  నిలిచారు. నర్సంపేట పరిధిలోని 24 వార్డుల్లో 110 మంది, పరకాల 11 వార్డుల్లో 30 మంది (మిగిలిన 11 వార్డులు ఏకగ్రీవం), వర్ధన్నపేట పరిధిలోని 12 వార్డుల్లో 50 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. బ్యాలెట్‌ బాక్సుల పంపిణీ, పర్యవేక్షణ, స్వీకరణ కోసం ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఐదు రూట్లు, ఐదు జోన్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి, అభ్యర్థుల వ్యయం, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ , నియంత్రణ తదితర అంశాలకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించారు.

33 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు !

జిల్లాలో సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 33 ఉన్నట్లు గుర్తించారు. వీటిలో నర్సంపేటలో సమస్యాత్మకం 13, అతి సమస్యాత్మకం 5, పరకాలలో సమస్యాత్మకం 5, అతి సమస్యాత్మకం 4, వర్ధన్నపేటలో సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలు 6 ఉన్నట్లు పోలీస్‌ అధికారులు గుర్తించారు. 33 పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌, 21 కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేశారు.

బ్యాలెట్‌ బాక్సుల వివరాలు..

నర్సంపేటలో 57 బ్యాలెట్‌ బాక్సులు అవసరం ఉండగా మరో 100 బాక్సులను అదనంగా ఉంచారు. పరకాలకు 25 అవసరం ఉండగా, అదనంగా 105,  వర్ధన్నపేటకు 18 అవసరం ఉండగా  అదనంగా 30 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. పోలింగ్‌ సిబ్బంది, బ్యాలెట్‌ బాక్సులు తరలించడానికి  నర్సంపేటకు బస్సులు 10, కార్లు 6, పరకాలకు బస్సులు 6, టాటా ఏస్‌ వాహనాలు 11, కార్లు 4, వర్ధన్నపేటకు బస్సులు 2, టాటా ఎస్‌ వాహనాలు 3, జీపులు 2 ఏర్పాటు చేశారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధి  వ్యవసాయ మార్కెట్‌లోని రైతు విశ్రాంతి భవనం, పరకాల మున్సిపాలిటీ పరిధిలోని గణపతి బీఈడీ కళాశాలలో బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచి ఓట్లను లెక్కిస్తారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో  బ్యాలెట్‌ బాక్సుల పంపిణీకి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, భద్రపరచడానికి, ఓట్ల లెక్కింపు కోసం  జిల్లా పరిషత్‌ పాఠశాలలోని ఆరో తరగతి గది, లైబ్రరీ భవనాన్ని కేటాయించారు. 

నేటి వరకు పోల్‌ చిట్టీల పంపిణీ..

అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఆదివారం వరకు ఓటర్లకు పోల్‌ చిట్టీలు పంపిణీ చేస్తారు. ఓటరు గుర్తింపు కార్డు లేని ఓటర్లు ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఫొటో గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్‌ బుక్‌, పాస్‌పోర్టు, ఉపాధి హామీ జాబ్‌ కార్డు తదితర కార్డుల్లో ఏదో ఒకటి ఉండాలని అధికారులు సూచించారు.

మూడు మున్సిపాలిటీల పరిధిలో 22న సెలవు..

 ఎన్నికలను పురస్కరించుకుని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు ఈ నెల 22వ తేదీన సెలవు ప్రకటించారు. బ్యాలెట్‌ బాక్సుల పంపిణీ, స్వీకరణ ఏర్పాటు చేసిన కార్యాలయాల సిబ్బందికి ఈ నెల 21, 22 తేదీల్లో సెలవు ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా మున్సిపాలిటీల్లో నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఆదేశాలు జారీ చేశారు.  అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలింగ్‌ రోజు వైద్య సిబ్బంది అవసరమైన మేరకు మందులతో సిద్ధంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. 

మద్యం అమ్మకాలు బంద్‌..

నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలోని 5 కిలోమీటర్లలోపు ఉన్న మద్యం దుకాణాలు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు, 25వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి లెక్కింపు ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసి వేయడానికి జిల్లా కలెక్టర్‌ హరిత  ఆదేశాలు జారీ చేశారు.logo