బుధవారం 03 జూన్ 2020
Warangal-rural - Jan 18, 2020 , 04:30:43

కారు టాప్‌ గేర్‌!

కారు టాప్‌ గేర్‌!
  • -మున్సి‘పోల్స్‌' ప్రచారం ఉధృతం
  • -మరింత వేగం పెంచిన టీఆర్‌ఎస్‌
  • -ఓటర్లను కలిసేందుకు ఇంటింటికీ
  • -నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాస్యం వినయ్‌ క్యాంపెయిన్‌
  • -పరకాలలో ఎమ్మెల్యేలు చల్లా, తాటికొండ
  • -అరూరి ప్రచారంతో వర్ధన్నపేటలో కారు జోరు
  • -నేడు నర్సంపేటలో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం

ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూసుకుపోతున్నది. కారు స్పీడ్‌కు ప్రతిపక్షాలు బెంబేలెత్తి పోతున్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం రోజురోజుకూ ఉధృతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తున్నారు.  శుక్రవారం మూడు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ నేతలు విస్తృత ప్రచారం చేపట్టారు. నర్సంపేట మున్సిపాలిటీలో ఎన్నికల ఇన్‌చార్జి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రచారం చేపట్టారు. నర్సంపేట విజన్‌, జరుగుతున్న అభివృద్ధిని కళ్లకు కట్టినట్లుగా ఓటర్లకు వివరించారు. శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నర్సంపేటలో ప్రచారం నిర్వహించనున్నారు. పరకాలలో 11వార్డులను కైవసం చేసుకున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మిగిలిన 11 వార్డులపై దృష్టి సారించారు. ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్యతో కలిసి పట్టణంలో గడపగడపకూ ప్రచారం నిర్వహించారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ తండాబాట పట్టారు. కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డితో తండాల్లో ప్రచారం నిర్వహించారు.
-వరంగల్‌రూరల్‌ జిల్లాప్రతినిధి/నమస్తే తెలంగాణ

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : ప్రచారానికి తెరపడే గడువు సమీపించడంతో మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ క్యాంపెయిన్‌ విస్తృతం చేశారు. ఓటర్లను కలుసుకోవడానికి పోటీ పడుతున్నారు. ఇంటింటి ప్రచారంతో తమను గెలిపించాలని కోరుతున్నారు. ఆయా వార్డుల్లోని ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తున్నారు. ఓటు వేసి తమను గెలిపిస్తే వార్డు రూపురేఖలు మార్చేస్తామని చెబుతున్నారు. తమ పార్టీ శ్రేణులు, అనుచరులతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తొలి నుంచి దూకుడుపై ఉన్న టీఆర్‌ఎస్‌ పుర పోరు ప్రచారంలో మరింత వేగం పెంచింది. గులాబీ శ్రేణులు డోర్‌టుడోర్‌ ప్రచారంతో స్వయంగా ఓటర్లను కలుస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.

దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో తెలంగాణలో అమలవుతున్న ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు సరఫరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, రైతు బంధు, రైతు బీమా, కంటివెలుగు తదితర కార్యక్రమాలను ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. పట్టణాల్లో అభివృద్ధి కొనసాగేందుకు కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై ప్రజల్లో ఉన్న ఆదరణకు తోడు ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్‌ వన్‌సైడ్‌ కనపడుతున్నది. మూడు పురపాలక సంఘాలను టీఆర్‌ఎస్‌ సునాయాసంగా కైవసం చేసుకోవటం ఖాయమనేది ఇప్పటికే తేలిపోయింది. మొత్తం 22 వార్డులకు 11 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు ముగిసిన ఈ నెల 14వ తేదీనే  పరకాల మున్సిపాలిటీ గులాబీ పార్టీ ఖాతాలో చేరింది. ఎన్నికలు జరిగే మిగిలిన పదకొండు వార్డుల్లోనూ కారు జోరు కొనసాగుతుంది. స్పీప్‌ చేయడమే లక్ష్యంగా ఇక్కడ టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. 24 వార్డులు ఉన్న నర్సంపేట, 12 వార్డులు గల వర్దన్నపేట పురపాలక సంఘాల పరిధిలో కూడా నూటికి నూరు శాతం వార్డులను గెలుచుకోవాలనే టార్గెట్‌తో కారు దూసుకెళ్తున్నది. మూడు మున్సిపాలిటీల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలతోపాటు టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జిలు ప్రచారంలో పాల్గొంటున్నారు.

నర్సంపేటలో చీఫ్‌ విప్‌ దాస్యం

నర్సంపేట పురపాలక సంఘం పరిధిలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి రెండో రోజు శుక్రవారం 6, 5, 4, 16, 23, 24వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచార రథం ద్వార ఆరు వార్డుల్లోనూ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే పెద్దితో కలిసి ప్రభుత్వ చీఫ్‌విప్‌, నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దాస్యం వినయ్‌భాస్కర్‌ ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఆయా వార్డులో జరిగిన సభలో ఎమ్మెల్యే పెద్ది, ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌ ప్రసంగించారు. నర్సంపేట పట్టణ అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేటాయించిన నిధులు, చేపట్టిన పనులను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలోనే నర్సంపేటను అభివృద్ధిలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే ప్రణాళికతో పనిచేస్తున్నట్లు చెప్పారు. గురువారం ఇక్కడ 2, 1, 3, 13, 14, 15వ వార్డుల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శుక్రవారం జెడ్పీలో టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న నర్సంపేట పురపాలక సంఘం పరిధిలోని 19వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. శనివారం ఎమ్మెల్యే పెద్ది ఇక్కడ 22, 21, 20, 19, 18, 17వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ ప్రచారంలో పాల్గొంటారు.
 

పరకాలలో ప్రచార హోరు..

పదకొండు వార్డులను ఏకగ్రీవ ఎన్నికతో టీఆర్‌ఎస్‌ గెలుచుకున్న పరకాల మున్సిపాలిటీ పరిధిలోని మిగతా వార్డుల్లో గులాబీ పార్టీ ప్రచారం హోరెత్తిపోతుంది. ఎన్నికలు జరిగే ఇతర పదకొండు వార్డులను సైతం కైవసం చేసుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పక్కా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే సదరు వార్డుల్లో పనిచేస్తున్న పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిలకు తోడు పదకొండు వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను రంగంలోకి దింపారు. సహచరులను గెలిపించి తమతో పాటు మున్సిపాలిటీ పాలకవర్గంలోకి తీసుకెళ్లేందుకు ఈ అభ్యర్థులు ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాలలోని 11, 14వ వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మున్సిపల్‌ శాఖ మంత్రి కే తారకరామారావు సహకారంతో పరకాల పట్టణ అభివృద్ధికి తాను చేసిన కృషిని వివరించారు. ఇక్కడ అభివృద్ధి కొనసాగేందుకు కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే, పరకాల మున్సిపాలిటీ ఎన్నికల పార్టీ ఇన్‌చార్జి తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే చల్లాతో కలిసి ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు.

ఆకట్టుకుంటున్న అరూరి..

వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో తనదైన ప్రచార శైలితో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన శుక్రవారం 4, 5, 6, 7వ వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపును కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  మహిళలతో కలిసి ఎమ్మెల్యే అరూరి నృత్యం చేశారు. రాష్ట్రంలోనే వర్ధన్నపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. పన్నెండు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి వర్ధన్నపేటపై గులాబీ జెండా ఎగురవేయాలని అన్నారు. గ్రామ పంచాయతీగా ఉన్న వర్ధన్నపేటను సీఎం కేసీఆర్‌ సహకారంతో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేసుకోవడం జరిగిందని అరూరి చెప్పారు.  ఎన్నికల టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిలు కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.logo