గురువారం 04 జూన్ 2020
Warangal-rural - Jan 17, 2020 , 02:36:09

ప్రచార హోరు

ప్రచార హోరు
  • - మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముమ్మరం
  • - ప్రచారంలో మరింత స్పీడ్‌ పెంచిన కారు
  • - మూడు పురపాలికల్లోనూ టీఆర్‌ఎస్‌ జోరు
  • - వర్ధన్నపేటలో మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
  • - నర్సంపేటలో పెద్ది, పోచంపల్లి ప్రచారం
  • - పరకాలలో ఎమ్మెల్యేలు చల్లా, తాటికొండ
  • - కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు వినతి
  • - స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఎమ్మెల్సీ పోచంపల్లి

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ :  జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పలు పార్టీల ముఖ్య ప్రజాప్రతినిధులు, నాయకులు డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీ ప్రచారం ఊపందుకుంది. నర్సంపేట, వర్ధన్నపేట, పరకాలలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం గురువారం ధూంధాంను తలపించింది. మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమల్లోకి తెచ్చిన కార్యక్రమాలను స్వయంగా ఓటర్లకు వివరించారు. పట్టణాల అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వర్ధన్నపేట పురపాలక సంఘం పరిధిలోని 12 వార్డుల్లో గులాబీ అభ్యర్థుల విజయమే ఎమ్మెల్యే అరూరి టార్గెట్‌ పెట్టుకున్నారు. రాష్ట్ర గిరిజన, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వర్ధన్నపేట పురపాలక సంఘం టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జి, మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, టీఆర్‌ఎస్‌ రైతు విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. నర్సంపేటలోని 24 వార్డుల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 2, 1వ వార్డులో జరిగిన ప్రచారం, సభల్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. పరకాల మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో 11 వార్డుల ఎన్నికలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 11 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపును ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చాలెంజింగ్‌గా తీసుకుంటున్నారు.  పరకాల మున్సిపల్‌ ఎన్నికల టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రెండు రోజులు ఎమ్మెల్యే చల్లాతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. 


జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. సమయం తక్కువగా ఉండడం వల్ల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇంటింటి ప్రచారంతో నేరుగా ఓటర్లను కలుస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో పోటీపడుతున్నాయి. ఆయా పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులు, నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ జెండా, కండువాతో వాడవాడన ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీ ప్రచారం హోరెత్తిపోతుంది. ఎన్నికలు జరిగే ప్రతి పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డుల్లో జోరుగా సాగుతున్నది. గురువారం నర్సంపేట, వర్ధన్నపేట, పరకాలలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం ధూంధాంను తలపించింది. ఒక మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. తమ పార్టీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమల్లోకి తెచ్చిన కార్యక్రమాలను స్వయంగా ఓటర్లకు వివరించారు. పట్టణాల అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం మంగళవారం ముగిసిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత జిల్లాలోని మూడు పురపాలక సంఘాల పరిధిలో ఉన్న 58 వార్డులకు 11 వార్డుల్లో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ పదకొండు వార్డులూ పరకాల మున్సిపాలిటీ పరిధిలోనివి కావడం, వీటిలో ఏకగ్రీవంగా ఎన్నికైన పదకొండు మంది కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కావడం రాజకీయంగా సంచలనం కలిగించింది. ఇక్కడ ఉన్న మొత్తం 22 వార్డుల్లో యాభై శాతం అంటే 11 వార్డులు ఏకగ్రీవం కావడం, ఈ పదకొండు వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక జరగడం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. 


రాష్ట్రంలోని మరే మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ పరిధిలో గాని పదకొండు వార్డుల్లో ఏకగ్రీవ ఎన్నిక జరగలేదు. ఎన్నికలు జరగడానికి ముందే నామినేషన్ల విత్‌ డ్రాచివరి రోజే పరకాల పురపాలక సంఘం టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరడం విశేషం. ఇందుకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీసుకున్న ప్రత్యేక చొరవ రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మూడు మున్సిపాలిటీల్లో 11 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 47 వార్డుల్లో ఈ నెల 22న ఎన్నికలు జరుగనున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన 11 మందిని పక్కనపెడితే ఎన్నికలు జరిగే 47 వార్డుల్లో మొత్తం 193 మంది బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచార గడువు ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు ముగిసిపోనుంది. గడువు తక్కువగా ఉండడం వల్ల నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తెల్లవారి బుధవారం నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, సీపీఐతోపాటు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు  తమ పార్టీ అభ్యర్థుల గెలుపు నకు ఓటర్లను కలవడంలో పోటీపడుతున్నారు.  ప్రచారంలో సరిలేరు టీఆర్‌ఎస్‌కు ఎవరు అనే రీతిలో అంతటా కారు ముందంజలో ఉంది. నర్సంపేట, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో ప్రతి వార్డులోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. 


  వర్ధన్నపేటలో మంత్రి, ఎమ్మెల్సీ

వర్ధన్నపేట పురపాలక సంఘం పరిధిలోని 12 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ తమ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఇక్కడి పన్నెండు వార్డుల్లో గులాబీ అభ్యర్థులు విజయం సాధించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. బుధవారం నుంచి స్వయంగా ప్రచారంలో దిగారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గత సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్యే అరూరితో కలిసి వర్ధన్నపేటలో మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ శ్రేణులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. గురువారం ఎమ్మెల్యే వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 8, 9, 10, 11వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. రాష్ట్ర గిరిజన, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వర్ధన్నపేట పురపాలక సంఘం టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జి, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, టీఆర్‌ఎస్‌ రైతు విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు తదితరులు ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అరూరితో ఆయా వార్డుల్లో ఇంటింటి ప్రచారం ద్వారా స్వయంగా ఓటర్లను కలిశారు. 


ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేతారకరామారావు నేతృత్వంలో ప్రతి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ తనదైన ప్రచార శైలితో ఓటర్లను ఆకట్టుకున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ఐరన్‌ చేయడం, పూరీలు కాల్చటం, డోలు వాయించడం, పాపను ఎత్తుకోవడం వంటివి చేసి పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్నిచ్చారు.


  నర్సంపేటలో వార్డుల వారీగా సభలు

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. ఎన్నికలు జరిగే ఈ వార్డుల నుంచి 24 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ ప్రతి వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపును స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేయటంలో ఆచీతూచీ నిర్ణయం తీసుకున్న ఆయన గురువారం నుంచి తన ప్రచారంలో వేగం పెంచారు. ఇంటింటి ప్రచారంతో ఓటర్లను కలుస్తూనే వార్డు వారీ సభలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు 2, 1, 3, 13, 14, 15వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు. ఆయా వార్డులో జరిగిన సభలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నర్సంపేట పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మంజూరు చేసిన నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, కుల సంఘాల భవనాల నిర్మాణం, ఇంటింటికి వంట గ్యాస్‌ సరఫరా వంటి అనేక పనులను ప్రజలకు తెలిపారు. 


సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆశీస్సులతో నర్సంపేటను మోడల్‌ సిటీగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రతి వార్డులోని సమస్యలన్నింటినీ పరిష్కరించడం తన బాధ్యతగా హామీ ఇచ్చారు. 2, 1వ వార్డులో జరిగిన ప్రచారం, సభల్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని, ఇక్కడ మున్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని పోచంపల్లి అన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నర్సంపేట పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెస్తున్నారని, నర్సంపేట పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే పెద్ది పనిచేస్తున్నారని చెప్పారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్‌ కే వాసుదేవరెడ్డి తదితరులు సభల్లో పాల్గొన్నారు.


 పరకాలలో అపూర్వ స్వాగతం

పదకొండు వార్డుల్లో ఎన్నిక ఏకగ్రీవం కావడంతో పరకాల పురపాలక సంఘం పరిధిలో మిగిలిన పదకొండు వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ పదకొండు వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపును స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  చాలెంజ్‌గా తీసుకుంటున్నారు. తమ పార్టీ అభ్యర్థుల విజయానికి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పరకాల పట్టణంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అమల్లోకి తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఓటర్లకు వివరిస్తున్నారు. ఇక్కడ తాను గుర్తించి పరిష్కరించిన సమస్యలను, చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా పరకాలను రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా చేసిన అంశాన్ని ఎమ్మెల్యే చల్లా ప్రచారంతో ప్రస్తావిస్తున్నారు. పరకాల పట్టణం మరింత అభివృద్ధి చెందడానికి కారు గుర్తుకు ఓటువేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ధర్మారెడ్డి ప్రజలను కోరుతున్నారు. బుధ, గురువారం ఆయన ఇక్కడ 4, 5, 21, 22వ వార్డుల్లో ప్రచారం చేశారు. ఆయా వార్డుల్లో ప్రజలు రంగురంగుల ముగ్గులతో ఎమ్మెల్యే చల్లాకు అపూర్వ స్వాగతం పలికారు. పరకాల మున్సిపల్‌ ఎన్నికల టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి, స్టేషన్‌ఘణ్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రెండు రోజులు ఎమ్మెల్యే చల్లాతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. గురువారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పూజారి సాంబయ్య, అకినపల్లి ప్రేమ్‌చందర్‌.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరారు. 


logo