శుక్రవారం 05 జూన్ 2020
Warangal-rural - Jan 17, 2020 , 02:35:13

జనసంద్రమైన కొత్తకొండ

జనసంద్రమైన కొత్తకొండ

భీమదేవరపల్లి : ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మకరసంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధ, గురువారాల్లో లక్షలాదిమంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ఆలయ కోనేరులో పవిత్రస్నానాలు ఆచరించారు. కోరిన కోర్కెలు తీర్చాలని స్వామివారికి కోరమీసాలు సమర్పించుకున్నారు. గండాలు తొలిగిపోవాలని గండాదీపంలో నూనె పోశారు. వీరభద్రుని సన్నిధిలో కోడెప్రదక్షిణలు చేశారు. మకరసంక్రాంతి పర్వదినం కావడంతో లక్షలాదిమంది భక్తులు వేకువజామునే స్వామివారిని దర్శించుకునేందుకు గంటలతరబడి బారులుతీరారు. భక్తులు అధికం కావడంతో శీఘ్రదర్శనం సైతం కిక్కిరిసిపోయింది. జాతరలోని దుకాణాలు, రంగులరాట్నం, సర్కస్‌ తదితర షాపులన్ని రద్దీగా మారాయి. భక్తుల సౌకర్యార్థం వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో భక్తజనసేవా కమిటీ సభ్యులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు భక్తులకు సేవలందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండాఆలయ ఈవో సులోచన, సిబ్బంది పూర్తి ఏర్పాట్లు చేశారు. 


సంక్రాంతి పర్వదినం బుధవారం వేకువజామునే ఆనవాయితీ ప్రకారం వేలేరుకు చెందిన యాదవులు మేకలబండితో ఆలయంచుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఎడ్లబండ్లతో వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు. స్వామివారి గుట్టపైన కొలువుదీరిన వీరభద్రస్వామి ఆత్మలింగం ఆలయంలో దివ్యాలంకరణ పూజలు జరిగాయి. గుట్టపైకి వెళ్లి భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, వంగర గ్రామంలోని మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు ఇంటి నుంచి కొత్తకొండకు ఎడ్లబండి రథం మకరసంక్రాంతి రోజున వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది సైతం ఎడ్లబండి రథాన్ని అందంగా అలంకరించి గ్రామస్తుల సమక్షంలో మకరసంక్రాంతి రోజున మంగళవారం కొత్తకొండకు తీసుకెళ్లారు. శివసత్తుల నృత్యాలు, మహిళల కోలాటాల నడుమ ఎడ్లబండి రథాన్ని కొత్తకొండకు గ్రామస్తులు సాగనంపారు.  


కొత్తకొండకు కొత్తపల్లి రథాలు

ప్రతి ఏటలాగే ఈ ఏడాది సైతం కొత్తపల్లి నుంచి కొత్తకొండకు సుమారు 60వరకు ఎడ్లబండ్లను పూలతో వివిధ రంగులతో అందంగా అలకంరించి రథాలుగా తీర్చిదిద్ది కొత్తకొండకు తీసుకొచ్చారు. ఎడ్లబండి రథాలను తిలకించేందుకు ప్రజలు దారి వెంట బారులు తీరారు. ఈ ఏడాది సైతం హిందూముస్లింలు ఎడ్లబండ్లతో వచ్చి ఆలయ ప్రదక్షిణలు చేసి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. సంక్రాంతి పండుగరోజున భక్త ప్రహ్లాద నాటకం భక్తులను అమితంగా అలరించింది. రంగస్థలంపై సురభి కళాకారులు పాత్రలకు జీవం పోశారని పలువురు అభినందించారు.


దర్శించుకున్న ప్రముఖులు

బ్రహ్మోత్సవాల్లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, హుస్నాబాద్‌, మానకొండూరు ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్‌, రసమయి బాలకిషన్‌, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, ఎమ్మెల్సీలు మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, పర్యాటకశాఖ చైర్మన్‌ పన్యాల భూపతిరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ మారపల్లి సుధీర్‌కుమార్‌, సాగునీటిపారుదల అభివృద్ధి చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, టీటీడీ డైరెక్టర్‌ మొరంశెట్టి రాములు, కరీంనగర్‌ జేసీ శ్యాంప్రసాద్‌రావు, అడిషనల్‌ ఎస్పీ మల్లారెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఈవో సులోచన శేషవస్ర్తాలు సమర్పించి స్వామివారి జ్ఞాపికను ప్రదానం చేశారు.  


logo