ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - Jan 15, 2020 , 02:55:24

పురపోరులో 193 మంది

పురపోరులో 193 మంది


వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి- నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం తెరపడింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 58 వార్డుల్లో 199 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పోటీదారులు తప్పుకోవడంతో 11 వార్డుల్లో ఒక్కో అభ్యర్థి మాత్రమే బరిలో మిగిలారు. దీంతో ఈ వార్డుల్లో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. సదరు 11 వార్డులు పరకాల పురపాలక సంఘం పరిధిలోనివి కావడం, వీటిలో ఏకగ్రీవంగా 11  మంది కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కావడం విశేషం. ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 22 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవ ఎన్నికతో 50 శాతం వార్డులను కైవసం చేసుకుంది. ఫలితంగా మూడు పురపాలక సంఘాల పరిధిలో ఇంకా 47 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ 47 వార్డుల్లో 193 మంది బరిలో నిలిచారు. ఏకగ్రీవంగా ఎన్నికైన 11 మందిని కలిపితే మొత్తం అభ్యర్థుల సంఖ్య 204. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తలపడుతున్నది మాత్రం 193 మంది అభ్యర్థులు. ఎన్నికల అధికారులు సాయంత్రం వీరికి గుర్తులు కేటాయించారు. ప్రధానంగా పరకాల మున్సిపాలిటీ పరిధిలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన లక్ష్యాన్ని సాధించుకున్నారు. ఇక్కడ ఉన్న 22 వార్డులకు కనీసం 10 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నికకు లైన్‌ క్లియర్‌ చేయాలనే టార్గెట్‌తో ఆయన రంగంలోకి దిగాడు. ఈ మేరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆరంభమైనప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ముందుగానే విడుతల వారీగా అన్ని వార్డులకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించారు. నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసిన వెంటనే ఎమ్మెల్యే చల్లా వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నికకు తన వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారు. తాను ఖరారు చేసిన అభ్యర్థులతో పాటు పార్టీ నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన ఇతరులను, వివిధ రాజకీయ పార్టీల నుంచి, స్వతంత్రంగా బరిలో దిగిన అభ్యర్థులతో మాట్లాడి టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమం చేశారు. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన ముగిసింది. దీంతో తెల్లవారి 12వ తేదీన ఇక్కడ నాలుగు వార్డుల నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఇలా మొదలైన కారు జోరు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వరకు కొనసాగింది. 13వ తేదీన మరో రెండు వార్డుల్లో ఇద్దరు, మంగళవారం అనూహ్యంగా ఐదుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆఖరు రోజు టీఆర్‌ఎస్‌ నుంచి 6వ వార్డులో దామెర మొగిలి, 7వ వార్డులో నల్లెల జ్యోతిఅనిల్‌, 9వ వార్డులో కోడూరి మల్లేశం, 10వ వార్డులో పసుల లావణ్యరమేశ్‌, 12వ వార్డులో బండిరాణిసదానందం ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. దీంతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టార్గెట్‌ దాటింది. పది కాదు పదకొండు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 22 వార్డులకు గాను సగం అంటే 11 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక జరగటంతో పరకాల మున్సిపాలిటీ పరిధిలో మరో 11 వార్డుల్లో మాత్రమే పుర పోరు జరుగనుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన పదకొండు మంది అభ్యర్థులను పక్కన పెడితే ఎన్నికలు జరిగే 11 వార్డుల్లో మొత్తం 33 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో టీఆర్‌ఎస్‌ నుంచి 11 మంది, కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి నలుగురు, సీపీఐ, టీడీపీ నుంచి ఒక్కొకరు, ఏఐఎఫ్‌బీ నుంచి ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థులు ఎనిమిది మంది ఉన్నారు. తన ఓటుతో లెక్కిస్తే పరకాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవిని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నట్టేనని ఎమ్మెల్యే ధర్మారెడ్డి చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పదకొండు మంది అభ్యర్థులు, వీరి ఏకగ్రీవ ఎన్నికకు కృషి చేసిన గులాబీ శ్రేణులకు ఎమ్మెల్యే చల్లా అభినందనలు తెలిపారు.

 ప్రతి వార్డులో టీఆర్‌ఎస్‌ పోటీ..
జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ప్రతి వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పుర పోరుకు దిగారు. నామినేషన్ల విత్‌డ్రా గడువు ముగిసిన మంగళవారం వరకు పరకాల పురపాలక సంఘం పరిధిలోని 22 వార్డుల్లో 11 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తేలిపోవటంతో మిగిలిన 11 వార్డుల్లో ప్రతి వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బరిలో నిలిచారు. నర్సంపేట, వర్దన్నపేట మున్సిపాలిటీల పరిధిలోనూ ప్రతి వార్డులోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోటీలో ఉన్నారు. నర్సంపేట పురపాలక సంఘం పరిధిలోని 24 వార్డులకు సోమవారం వరకు రెండు విడుతల్లో 19 వార్డులకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించిన స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మంగళవారం మిగత ఐదు వార్డులకు తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో ఇక్కడ ఉన్న 24 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ నుంచి 24 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మంగళవారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎవరనేది స్పష్టత ఇచ్చారు. ఆయన ఖరారు చేసిన 12 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇక్కడ 12 వార్డుల్లో పోటీకి నిలిచారు. ఈ లెక్కన మూడు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు జరిగే 47 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ నుంచి 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 47 వార్డుల్లో తలపడుతున్న మొత్తం 193 మందిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే 47 మంది కావటం గమనార్హం. పరకాలలో ఏకగ్రీవ ఎన్నిక జరిగిన 11 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ మినహా ఇతర పార్టీల నుంచి, స్వతంత్ర అభ్యర్థులు గాని లేకపోగా ఎన్నికలు జరిగే 11 వార్డుల్లోనూ కాంగ్రెస్‌ వంటి పార్టీ నుంచి 6 వార్డుల్లో మాత్రమే అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ పోటీలో ఉన్న 8 మంది స్వతంత్ర అభ్యర్థుల కంటే కాంగ్రెస్‌ అభ్యర్థుల సంఖ్య తక్కువ. ఇదే 11 వార్డుల్లో బీజేపీ నుంచి 4 వార్డుల్లో అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక టీడీపీ, సీపీఐ ఒక్కో వార్డుకు మాత్రమే పరిమితమయ్యాయి. రెండు వార్డుల్లో ఏఐఎఫ్‌బీ నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలో దిగారు. వర్ధన్నపేటలోనూ టీడీపీ నుంచి రెండు వార్డుల్లో అభ్యర్థులు పోటీలో ఉంటే సీపీఐ ఒకే వార్డు నుంచి తమ పార్టీ అభ్యర్థిని బరిలో పెట్టింది. ఇక్కడ 11 మంది స్వతంత్రులు ఉన్నారు.

 టీఆర్‌ఎస్‌ విస్తృత ప్రచారం..
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోడటంతో టీఆర్‌ఎస్‌ తమ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేసింది. స్వయంగా ఎమ్మెల్యేలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నర్సంపేటలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నేతృత్వం వహించిన సమావేశంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ పాల్గొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమల్లోకి తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ప్రతి వార్డులోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ నర్సంపేట పట్టణ అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని, ఈ నిధులతో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే నర్సంపేట పట్టణ రూపు రేఖలు మారిపోయాయని, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ పనులతో కొత్త శోభ వచ్చిందని ఆయన తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరించాలని అన్నారు. బుధవారం నుంచి నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం కోసం ఎమ్మెల్యే పెద్ది విస్తృత ప్రచారం నిర్వహించేందుకు షెడ్యూల్‌ తయారైనట్లు తెలిసింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం నుంచే పరకాల పుర పాలక సంఘం పరిధిలో తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే రెండు వార్డుల్లో ఇంటింటి ప్రచారం పూర్తి చేశారు. బుధవారం చల్లా 4, 5వ వార్డుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు. వర్ధన్నపేట పురపాలక సంఘం పరిధిలోని 12 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు తన ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ షెడ్యూల్‌ ఖరారు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ఈ నెల 20న ముగియనుంది.


logo