శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Jan 14, 2020 , 03:35:32

వీఆర్వో శైలజ సస్పెన్షన్‌

వీఆర్వో శైలజ సస్పెన్షన్‌

(వరంగల్‌రూరల్‌ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ) అక్రమాలకు పాల్పడిన మరో విలేజ్‌ రెవెన్యూ అధికారి(వీఆర్వో)పై వేటు పడింది. భూమి లేకపోయినా ఉన్నట్లు రికార్డులు సృష్టించిన దామెర మండలంలోని ముస్త్యాలపల్లి వీఆర్‌వో  టీ శైలజపై ప్రభుత్వం శాఖపరమైన చర్యలు తీసుకుంది. ఆమెను సస్పెన్షన్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఎం హరిత ఉత్తర్వులు జారీ చేశారు. ముస్త్యాలపల్లి రెవెన్యూ శివారులోని తక్కళ్లపాడు గ్రా మంలో గల 392 సర్వే నెంబరులో రెవెన్యూ రికార్డుల ప్రకారం 15.17ఎకరాల భూమి మాత్రమే ఉంది. అయితే ముస్త్యాలపల్లి వీఆర్వోటీ శైలజ ఈ సర్వే నెంబరులో 21.24 ఎకరాలు ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. అదనంగా 5.05 ఎకరాల భూమి ఇదే సర్వే నెంబరులో ఉన్నట్లు ముగ్గురి పేర రికార్డుల్లో రాశారు. దీంతో సదరు 5.05 ఎకరాల్లో దాడి మానస పేర  3 ఎకరాలు, బొడ్డు ఐలమ్మ పేర 1 ఎకరం, మార్త కోటి పేర 1.05 ఎకరాలు ఉన్నట్లు 2017లో వెలిశాయి. 5.05 ఎకరాలకు హక్కుదారులుగా పహాణీలో సైతం ఈ ముగ్గురి పేర్లు చేరాయి.


392 సర్వే నెంబరులో రెవెన్యూ రికార్డుల ప్రకారం 15.17 ఎకరాలు ఉంటే అదనంగా మరో 5.05 ఎకరాలకు అక్రమంగా ముగ్గురి పేర రికార్డులు సృష్టించి మొత్తం ఈ సర్వే నెంబరులో 21.24 ఎకరాలు ఉన్నట్లు పహాణీలో పేర్కొనడంపై గత డిసెంబరు 10వ తేదీన ‘రెవెన్యూ లీల’ శీర్షికన ‘నమస్తేతెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. ఒక సర్వే నెంబరులో ఉండాల్సిన భూమికంటే ఎక్కువగా ఉండటాన్ని ‘నమస్తేతెలంగాణ’ వెలుగులోకి తేవడంతో జిల్లా కలెక్టర్‌ ఎం.హరిత తక్కళ్లపాడ్‌ గ్రామంలో జరిగిన వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. దీనిపై పరకాల ఆర్డీవో కిషన్‌ తక్కళ్లపాడు గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి ఇక్కడ 392  సర్వే నెంబరులో ఉండాల్సిన భూమి కంటే ఎక్కువ భూమికి అక్రమంగా ముగ్గురి పేర 5.05 ఎకరాలకు రికార్డులు తయారైనట్లు, ఇందులో స్థానిక వీఆర్‌వో  టీశైలజ పాత్ర ఉన్నట్లు నిర్థారణకు వచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌  హరితకు తాజాగా నివేదిక పంపారు. పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ సోమవారం విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన వీఆర్వో శైలజను సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులు విడదల చేశారు. వీఆర్వో శైలజ సస్పెన్షన్‌ రెవెన్యూ శాఖలో కలకలం రేపింది.


logo