శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Jan 13, 2020 , 04:03:21

ఏకగ్రీవాలకు కేరాఫ్‌ పరకాల

ఏకగ్రీవాలకు కేరాఫ్‌ పరకాల

పరకాల, నమస్తే తెలంగాణ : ఏకగ్రీవ ఎన్నికలకు కేరాఫ్‌గా పరకాల నిలుస్తున్నది. నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగియకముందే పరకాల మున్సిపాలిటీలోని నాలుగు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విశేష కృషితో రాష్ట్రంలో ఎక్కడాలేనివిధంగా మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్ల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.  22 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా  గట్టిపోటీ ఇచ్చే వారిని ఎంపిక చేశారు. అభ్యర్థుల ప్రకటనను చూసి ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ కొన్ని వార్డుల్లో కనీసం అభ్యర్థులను కూడా నిలపలేకపోయాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆరు వార్డుల్లో అభ్యర్థులను నిలపనేలేదు. ఇక బీజేపీకి ఏకంగా తొమ్మిది వార్డుల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి పరకాలలో నెలకొంది. ఇదిలా ఉండగా ఆదివారం ఈ రెండు పార్టీలతోపాటు మరికొంత మంది కూడా  నామినేషన్లను ఉప సంహరించుకున్నారు.  


టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు 

పట్టణంలోని 8వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అడప రాము, 16వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండి రమాదేవి, 17వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాలకుర్తి గోపి, 20వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోదా అనిత ఏకగ్రీవంగా కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కృషితో 8, 16, 17, 20వ వార్డులకు చెందిన ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. దీంతో ఆ నాలుగు వార్డుల్లో ఎన్నిక లాంఛనమే అయినప్పటికీ అధికారులు ప్రకటించడమే మిగిలింది. మున్సిపాలిటీలో నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవం కావడం పట్ల టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు  చేసుకుంటున్నారు. స్థానిక 16వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండి రమాదేవి సారంగపాణి వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు స్వీట్లు తినిపించుకుని  పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.


42 మంది నామినేషన్లు ఉప సంహరణ

పరకాల మున్సిపాలిటీలో 22వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 156 నామినేషన్లు దాఖలు కాగా ఒక నామినేషన్‌ సరిగ్గా లేని కారణంగా అధికారులు తిరస్కరించారు. దీంతో పరకాలలో 121 మంది అభ్యర్థులకు చెందిన 155 నామినేషన్లు శనివారం వరకు ఉన్నాయి. కాగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి కృషితో ఇతర పార్టీల నుంచి నామినేషన్లు వేసిన వారు తమ నామినేషన్లు ఉప సంహరించుకోవడంతో నలుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. నామినేషన్లు వేసిన 121 మందిలో నుంచి 42 మంది ఆదివారం తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. కాగా 22 వార్డులకు 79 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండనున్నారని మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌ రాజు తెలిపారు.  


  ఏదైనా సంచలనమే.. 

పరకాలలో ఏం జరిగినా అది సంచలనమే. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల నుంచి మొదలుకుని స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పరకాల పోరుగడ్డ ఎన్నో సంచాలనాలు సృష్టించింది. తాజాగా పరకాల మున్సిపల్‌ ఎన్నికల్లో మరో సంచలనానికి నాంది పలికింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా ఎక్కడాలేని విధంగా పరకాలలో ఏకంగా ఒకేరోజు నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  


 రికార్డు తిరగరాస్తున్న ఎమ్మెల్యే చల్లా

పరకాల ప్రాంతంలో ఏ ఎన్నిక వచ్చినా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రికార్డులు సృష్టిస్తున్నారు. పరకాల ప్రాంతంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరోసారి గెలవడనే అపవాదు ఉన్నప్పటికీ రెండోసారి అత్యధిక మెజార్టీతో గెలిచి రికార్డు నెలకొల్పారు. అనంతరం జరిగిన సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలే అధికంగా ఉండేలా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం పరకాల మున్సిపాలిటీలోని 22వార్డులకు ఎన్నికలు జరుగనుండగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి పరకాల చరిత్రలో మున్సిపల్‌ ఎన్నికల్లో ఒకే రోజు నాలుగు వార్డులను ఏకగ్రీవం చేసి చూపించారు. పరకాలలో ఏకగ్రీవాల జోరుగా మరో రెండు రోజులు కొనసాగడంతోపాటు పట్టణంలో సుమారు 10 నుంచి 12 వార్డులు ఏకగ్రీవం అవుతాయని స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు, వార్డుల ఇన్‌చార్జిలు పేర్కొంటున్నారు.