వరంగల్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అందరూ మెచ్చే నాణ్యమైన జకార్డ్ చీరల తయారీకి మడికొండ కేంద్రంగా మారింది. దేశవ్యాప్తంగా ఈ రకం చీరలకు మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ తయారైన ఈ ముడి చీరలు వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా ఉండే సూరత్‌కు పంపుతున్నారు. ఆ తర్వాత అక్కడి వ్యాపారులు చీరలకు రంగులు అద్ది మార్కెట్‌కు పంపిస్తారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వీటిని విక్రయిస్తారు. నాణ్యత బాగుండడంతో రోజురోజుకూ సూరత్ నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి. దీంతో మడికొండ చేనేత కార్మికులకు పని దొరుకుతోంది. టెక్స్టైల్ పార్కులో చైనా నుంచి పవర్ లూమ్స్ తెప్పించారు. వీటికి ఎలక్ట్రానిక్ పరదాలు అమర్చారు. ఎంపిక చేసిన డిజైన్‌ను ఎలక్ట్రానిక్ పరికరంతో పవర్లూమ్ మిషన్‌కు అనుసంధానం చేస్తారు. ఎలక్ట్రానిక్ పరికరానికి పెన్‌డ్రైవ్ పెట్టి కోరుకున్న డిజైన్‌లో జకార్డు చీరలను తయారు చేయవచ్చు. ఇలా అత్యాధునిక డిజైన్ జకార్డు చీరలను మడికొండలో తయారు చేస్తున్నారు.
పూర్వ వైభవం..
వరంగల్ మహానగరం పరిధిలోని మడికొండలో 60 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాకతీయ టెక్స్టైల్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీలో జకార్డు చీరలు తయారవుతున్నాయి. 364 యూనిట్లు స్థాపించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. దేశంలోనే మొదటి పవర్లూమ్ టెక్స్టైల్ పార్కుగా మడికొండ పార్కు గుర్తింపు దక్కింది. ఉపాధి కోసం సూరత్, భీవండి, షోలాపూర్ ప్రాంతాలకు వెళ్లిన వారు.. తెలంగాణ ప్రభుత్వం చేయూతతో తిరిగి వచ్చి ఇక్కడ యూనిట్లు పెట్టుకున్నారు. దశలవారీగా యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటివరకు 160 యూనిట్లు సిద్ధమయ్యాయి. ప్రతి యూనిట్లో 16 మిషన్లను ఏర్పాటుచేసేలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 60 యూనిట్లలో జకార్డు చీరలు తయారవుతున్నాయి. ప్రతి యూనిట్లో నాలుగు చొప్పున జకార్డు మిషన్లను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతికతో మడికొండలో చీరలు తయారవుతుండడంతో వస్త్ర తయారీరంగంలో వరంగల్‌కు పూర్వ వైభవం వస్తోంది.
పెన్డ్రైవ్తోనే డిజైన్..
సాధారణ జకార్డ్ యంత్రాల్లో డిజైన్ కోసం అట్టముకలను ఏర్పాటు చేసుకొని కాలితో యంత్రాన్ని తొక్కాల్సి ఉంటుంది. డిజైన్‌కు అనుగుణంగా లోపల అట్టముకలను పెట్టాలి. చీరపై రెండు మూడు రకాల డిజైన్లు వేయాలంటే అన్ని రకాల అట్టముకలను మిషన్‌తో అనుసంధానం చేయాలి. ఈ పద్ధతిలో జకార్డు చీర తయారీ కష్టమైన పని. అయితే తాజాగా వచ్చిన జకార్డు పవర్ లూమ్‌లో శ్రమ చాలా తక్కువ. వేగంగా పని పూర్తవుతుంది. కోరుకున్న డిజైన్లు ఉంటాయి. పెన్ డ్రైవ్ లేదా చిప్ పెట్టి అందులో ఉన్న ఏ డిజైన్‌ను అయినా ఎంపిక చేసుకోవచ్చు. ఇలా డిజైన్‌ను ఎంపిక చేసి బటన్‌ను నొక్కితే కోరుకున్న డిజైన్‌తో చీర తయారవుతుంది. ఏ డిజైన్.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మెమరీ కార్డులో పెట్టుకుని మార్చుకునే వీలుండేలా జాకార్డ్ యంత్రాన్ని రూపొందించారు.
మనకు గుర్తింపు
మడికొండ టెక్స్టైల్ పార్కులోని ప్రతి యూనిట్లో ఎనిమిది చొప్పున జకార్డు, డాలీ మిషన్లను ఏర్పాటు చేస్తున్నాం. రెండో దశలో ఇంతే చొప్పున రెండు రకాల మిషన్లు పెట్టాలనుకుంటున్నాం. ప్రస్తుతం జకార్డు మిషన్లు అత్యాధునికమైనవి. వీటితో తయారవుతున్న చీరలకు మంచి డిమాండ్ ఉంటోంది. సూరత్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. నాణ్యత బాగుంటోంది. నాణ్యతతో ఇలాగే పని చేస్తే మరింత గిరాకీ ఉంటుంది. ఇక్కడి జకార్డు చీరలతో మడికొండకు గుర్తింపు వస్తుంది.