వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 20 : ఆరు నెలలకే గర్భస్రావమై, మృత కవలలు బయటకు రావడంతో ఓ తల్లికి కడుపుకోతే మిగిలింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. ఒకరికి ఇంజెక్షన్ మారిపోవడం వల్లే ఇలా జరిగిందని, సంబంధిత హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలో ని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన కళ్యాణపు శ్రీవాణి ఆరు నెలల గర్భిణి. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30గంటల సమయంలో వెన్ను నొప్పి వస్తున్నదని కు టుంబసభ్యులతో కలిసి గంగా హాస్పిటల్‌కు వెళ్లింది. సిబ్బంది ఈ విషయాన్ని డాక్టర్‌కు చెప్పారు. హాస్పిటల్‌కు చేరుకున్న డాక్టర్, నొప్పి తగ్గేందుకు ట్రమడాల్ ఇంజెక్షన్ చేశారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితురాలిని వీల్‌చైర్‌లో వార్డుకు తరలిస్తున్న క్రమంలోనే ప్రసవమై ఓ శిశువు నేలపై పడిపోయింది. 14 నిమిషాల తర్వాత మరో శిశువు జన్మించగా, పుట్టిన ఐదు నిమిషాల్లోనే ఇద్దరు శిశువులు చనిపోయారు. శిశువుల బరువు 400 గ్రాములే ఉంది. అయితే శ్రీవాణి పేరుతో నెలలు నిండిన మరో గర్భిణి హాస్పిటల్లో అడ్మిట్ అయిందని, ఆమెకు వేయాల్సిన ఇంజెక్షన్ శ్రీవాణికి వేయడం వల్లే గర్భస్రావం అయిందని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. హాస్పిటల్ ఎదుట ధర్నా చేశారు. పోలీసులు న్యా యం చేస్తామని నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. కుటుంబసభ్యుల ఆరోపణల్లో వాస్తవం లేదని దవాఖాన వైద్యులు చెబుతున్నారు.
డీఎంహెచ్‌వో విచారణ..
వరంగల్ లక్ష్మీపురం జంక్షన్‌లోని గంగా హాస్పిటల్లో నెలలు నిండని కవల శిశువుల మృతి ఘటనపై వరంగల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ విచారణ చేపట్టారు. సోమవారం హాస్పిటల్‌కు చేరుకొని బాధితురాలిని హాస్పిటల్‌కు తీసుకువచ్చినప్పటి నుంచి అందించిన వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలితో పాటు, కుటుంబసభ్యులను సైతం విచారించారు. బాధితురాలికి ఇచ్చిన ఇంజక్షన్ వయల్స్‌ను, నమూనాలను సేకరించా రు. వైద్యసేవలు అందించేందుకు ముందు ఎలాంటి కేస్‌షీట్, రికార్డులు నమోదు చేయకపోవడంపై వివరణ కో రారు. నమూనాల రిపోర్టుల ఆధారంగా తదుపరి విచార ణ చేస్తామని చెప్పారు. శిశువుల మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణమని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ గోపాల్‌రావు, మా తాశిశు సంరక్షణాధికారి డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ ప్రకాశ్, పట్టణ ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ హర్షవర్ధిని, డాక్టర్ సందీప్ తదితరులు విచారణలో పాల్గొన్నారు.