e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home జనగాం భూపాలపల్లికి ఉజ్వల భవిష్యత్‌

భూపాలపల్లికి ఉజ్వల భవిష్యత్‌

  • ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభించుకోవడం శుభపరిణామం
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
  • బొగ్గు ఉత్పత్తి పెరిగితే మరిన్ని ఉద్యోగాలు
  • కరోనా కట్టడిపై ప్రత్యేక దృష్టి
  • సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్‌, బలరాం

భూపాలపల్లి, ఆగస్టు 2 : సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ర్టానికి తలమానికంగా నిలుస్తున్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి ఏరియా సింగరేణి దవాఖాన వద్ద రూ.46లక్షలతో నిర్మించిన ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. స్థానిక జీఎం టీ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సింగరేణి సంస్థ డైరెక్టర్లు ఎస్‌ చంద్రశేఖర్‌ (ఆపరేషన్‌), ఎన్‌ బలరాం(ఫైనాన్స్‌, ఫా, పీపీ), డీ సత్యనారాయణ (ఈఅండ్‌ఎం), టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ సింగరేణి కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కారుణ్య నియామకాల ద్వారా అనేక మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని, ఈ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పడం శుభపరిణామమన్నారు. భూపాలపల్లి ఏరియాలో అత్యాధునిక సౌకర్యాలతో 994 క్వార్టర్లు నిర్మిస్తున్నారని, వచ్చే మార్చినాటికి పూర్తవుతాయన్నారు. జిల్లా కేంద్రంలో మోడల్‌ మార్కెట్‌ నిర్మాణం కోసం స్థలం ఇవ్వాలని ఇంతకుముందే సింగరేణి సీఎండీ, డైరెక్టర్లను కోరామని, ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.

భూగర్భ గనుల్లో నష్టాలు తగ్గాలి
భూపాలపల్లి ఏరియాకు మంచి భవిష్యత్‌ సింగరేణి డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎస్‌ చంద్రశేఖర్‌ అన్నారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగితేనే మరిన్ని ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందని, ఈ దిశగా ప్రతి సింగరేణీయుడు పనిచేయాలన్నారు. గత ఆరేడు సంవత్సరాల కాలంలో ఒక ఎస్డీఎల్‌ రోజుకు 150 టన్నులు బొగ్గు వెలికి తీసేదని, కానీ, ప్రస్తుతం వంద టన్నులు మాత్రమే తీస్తున్నదన్నారు. ప్రధానంగా భూగర్భ గనుల్లో నష్టాలను తగ్గించుకోవాల్సిన అవసరముందన్నారు. కేటీపీపీని దృష్టిలో పెట్టుకొని సామర్థ్యం లేకున్నా కేటీకే ఓసీపీ-3 నూతన గనిని ప్రారంభించుకున్నామని, ఈ గనికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. భూపాలపల్లి ఏరియాలో అత్యంత నాణ్యమైన జీ-5 గ్రేడ్‌ బొగ్గు లభిస్తుందని, దీనిని ఫార్మసీ తదితర పరిశ్రమలు ఎక్కువగా వినియోగిస్తాయన్నారు. ఇప్పటి వరకు సింగరేణి వ్యాప్తంగా 6500 మందికి కరోనా సోకిందని, ఇందులో భూపాలపల్లి ఏరియాలో 789 మంది ఉన్నారని చెప్పారు. సింగరేణి డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) ఎం.బలరాం మాట్లాడుతూ.. భూపాలపల్లిలో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ ప్రారంభించుకొని నిరంతరం 350 మంది రోగులకు ఆక్సిజన్‌ అందించే సామర్థ్యానికి చేరుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొత్తగూడెం, బెల్లంపల్లి, రామక్రిష్ణాపూర్‌ ఏరియా వైద్యశాలల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఉన్నాయన్నారు.

- Advertisement -

గోదావరిఖనిలో త్వరలో మరో పెద్ద ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాలో మెరుగ్గానే ఉన్నామన్నారు. కరోనా కట్టడి విషయంలో సింగరేణి సీఎండీ శ్రీధర్‌ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 90శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ ఇప్పటివరకు వైరస్‌ బారిన పడిన వారి వైద్యానికి రూ.70 కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. రెండో విడుత వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలని ఆయన డైరెక్టర్లను కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణీసిద్ధు, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, టీబీజీకేఎస్‌ భూపాలపల్లి బ్రాంచ్‌ కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, ఏఐటీయూసీ నేత మోటపలుకుల రమేశ్‌, సింగరేణి ఏరియా అధికారులు డీవైసీఎంవో డాక్టర్‌ పద్మజ, విజయప్రసాద్‌, రవీందర్‌, రామలింగం, అజ్మీరా తుకారాం, కృష్ణప్రసాద్‌, కార్మికులు పాల్గొన్నారు. అనంతరం భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని కేటీకే ఓసీపీ-2, కేటీకే ఓసీపీ-3 గనులను సింగరేణి డైరెక్టర్లు సందర్శించారు. గనుల వ్యూ నుంచి గనుల పరిస్థితిని పరిశీలించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana