e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home జనగాం పీపుల్స్‌ డాక్టర్‌ పాములపర్తి

పీపుల్స్‌ డాక్టర్‌ పాములపర్తి

  • అతడు చేయి పడితే నొప్పి మటుమాయం
  • అలుపెరుగని వైద్యుడిగా రామారావుకు గుర్తింపు
  • నాడు సర్కారు దవాఖానలో వైద్యాధికారిగా..
  • ప్రస్తుతం రిటైర్‌ అయినా ఉచితంగా సేవలు
  • చికిత్స కోసం ఆయన క్లినిక్‌కు రోగుల బారులు

వరంగల్‌, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రొఫెసర్‌ పాములపర్తి రామారావు. వరంగల్‌వాసులకే కాదు.. ఇతర రాష్ర్ర్టాలవారికీ పరిచయం అక్కర్లేని పేరు. వైద్యాన్ని వ్యాపారంలా కాకుండా ఒక సేవలా భావించే అతికొద్ది మంది వైద్యుల్లో ఈయన ఒకరు. వైద్యం చేయడమే ఆయనకు ఇష్టమైన పని. అదీ పూర్తి ఉచితంగానే. అంతేకాదు.. ఆయన వైద్యం అందించే తీరూ భిన్నంగా ఉంటుంది. ఎలాంటి పరీక్షలు చేయకుండానే కేవలం చేయి పట్టి చూసి నొప్పికి కారణమెంటే చెప్పేస్తారు. ఆయన దగ్గరికి వెళ్లే ఎలాంటి ఎలాంటి కీళ్లనొప్పులైనా సరే నయం చేస్తారనే పేరుంది. ప్రభుత్వ డాక్టర్‌గా రిటైర్‌ అయిన తర్వాత ఎక్కువమంది ఇంటిపట్టున ఉంటున్న ఈ రోజుల్లో రామారావు మాత్రం ప్రజలకు ఇష్టంతో వైద్యం అందిస్తున్నారు. వైద్యం చేయడం తనకు సంతృప్తిని ఇస్తుందని చెప్పే రామారావు 27 ఏండ్లుగా పంచకర్మ వైద్య సేవలను కొనసాగిస్తున్నారు.

నాన్న స్ఫూర్తితోనే..
పాముపర్తి రామారావుది వరంగల్‌లోని మట్టెవాడ. తండ్రి సదాశివరావు స్ఫూర్తితో రామారావు డాక్టర్‌ అయ్యారు. 1981 నుంచి 1984 వరకు కేరళలో ఆయుర్వేదంలో డిగ్రీ, ఎండీ కోర్సు పూర్తిచేశారు. 1987 డిసెంబర్‌లో భద్రాచలంలో వైద్యాధికారిగా ఉద్యోగంలో చేరారు. 1993లో వరంగల్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కాలేజీలో ప్రొఫెసర్‌గా చేరారు. వరంగల్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌గా రిటైర్‌ అయ్యారు. 1993లో ఇంటి వద్ద ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ప్రతిరోజు కాలేజీకి వెళ్లే ముందు, వచ్చిన తర్వాత మాత్రమే ఇంటి వద్ద సేవలు అందించారు. నాలుగేండ్ల క్రితం రిటైర్‌ అయనప్పటి నుంచి ఎక్కువ సమయం వైద్యసేవకే కేటాయిస్తున్నారు. ఇంటి వద్ద జనం రద్దీతో చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలుగుతోందని హన్మకొండలోని జూపార్కు సమీపంలోని ఓ భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు.

- Advertisement -

ఎక్కడెక్కడి నుంచో..
ఎలాంటి కీళ్ల నొప్పులు ఉన్నా రామారావు చేయి పడితే ఇట్టే నయమవుతాయి. అదే అందరి నమ్మకం. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి డాక్టర్‌ పాములపర్తి రామారావు వైద్యం కోసం నిత్యం రోగులు వస్తుంటారు. వెన్ను నొప్పులు, డిస్కులు జారడం, మెడనొప్పి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడే వారు ఎక్కువగా ఈయనను వెతుక్కుంటూ వస్తారు. ఇలాంటి అనారోగ్య సమస్యలకు ఎవరైనా ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ వంటివి ఉంటేనే వైద్యం సాధ్యమవుతుందని డాక్టర్లు చెబుతారు. రామారావు మాత్రం వేలితో తాకి మెడికల్‌ రిపోర్టుల్లో ఏం రాసి ఉందే చెబుతారు. అందుకే రోగులకు రామారావుపై నమ్మకం. వేడినీళ్లు, తేనేతో స్వయంగా ఆయనే మర్దన చేస్తారు. ఆయుర్వేద మందులే రాస్తారు. వీటిని తప్పనిసరిగా వాడాలని హెచ్చరించి మరీ చెబుతారు. పేదలు, పెద్దలు, ధనికులు, వీఐపీలు ఎవరైనా సరే తన దగ్గరికి వైద్యం కోసం వస్తే వరుసలో రావాల్సిందే. ఎవరి దగ్గరా ఫీజు తీసుకోరు. తన వద్దకు వచ్చి నయమైన వారు ఎవరైనా డబ్బులు ఇవ్వబోతే క్లినిక్‌లో ఉన్న డబ్బాలో వేయాలంటారు. ఆ డబ్బులతో తన దగ్గరికి వచ్చే పేద రోగులకు ఉచితంగా మందులు ఇస్తారు.

వైద్యంలోనే సంతృప్తి..
వైద్య సేవలందించేందుకు స్ఫూర్తి మా నాన్నే. 1947 నుంచి 1955 వరకు ఆయన వరంగల్‌ కేంద్రంగా కాకతీయ పత్రికను నడిపారు. సత్యం, ధర్మం, న్యాయం, సేవ, అహింస అంశాలు ఆ పత్రికలో ఎక్కువగా వచ్చేవి. వాటి స్ఫూర్తితోనే వైద్య వృత్తిని ఎంచుకున్నా. ఆయుర్వేదంలో ఎండీ పూర్తి చేసిన తర్వాత అధికారిగా చేరాను. అప్పటినుంచి వైద్యం ప్రారంభించాను. కాలేజీకి వచ్చిన తర్వాత టీచింగ్‌, వైద్యం రెండు సమాంతరంగా కొనసాగించాను. ఇప్పుడు రిటైర్‌ అయినా చేస్తున్నాను. ఏదైనా కారణంతో వైద్యం చేయని రోజు నాకు ఏదీ తోచదు. నాకు చేతనైన్ని రోజులు చేస్తా. కుటుంబ పరంగా వచ్చినదానితో పాటు ప్రభుత్వం ఇచ్చిన జీతం, ఇప్పుడు వస్తున్న పెన్షన్‌ నాకు సరిపోతాయి. పైసలు లేవని వ్యాధితో ఎవరైనా బాధపడితే నాకు మంచిగా అనిపించదు. ఎక్కడెక్కడో తిరిగినా తగ్గని నొప్పులు నా వైద్యంతో తగ్గాయని వచ్చి చెబుతుంటే నాకు ఎంతో తృప్తి అనిపిస్తుంది. అదే ఇంకా వృత్తిలో కొనసాగేలా చేస్తోంది.

  • డాక్టర్‌ పాములపర్తి రామారావు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana