e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జనగాం పంట మార్చి.. లాభాలు పండించి..

పంట మార్చి.. లాభాలు పండించి..

  • ఉద్యానసాగులో చింతనెక్కొండ రైతుల రికార్డు
  • నాడు 15 ఎకరాలు.. నేడు 200 ఎకరాల్లో సాగు..
  • కూరగాయలు, పండ్ల సాగుకు పెట్టింది పేరు
  • మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పండ్ల సాగుపై ప్రత్యేక దృష్టి
  • లోకల్‌గానే గిట్టుబాటు ధరకు విక్రయాలు
  • ఆశించిన దిగుబడితో రైతుల్లో సంబురం
  • సాగులో ప్రత్యేకంగా నిలిచిన గ్రామం

వరంగల్‌ రూరల్‌, జూలై 28 (నమస్తే తెలంగాణ):‘తరచూ ఒకే రకం పంట వేయొద్దు. పంట మార్పిడి చేస్తూ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నవే సాగు చేసి లాభాలు పొందాల’నే సర్కారు పిలుపును ఆ పల్లె రైతులు ఆచరణలో పెట్టారు. అనుకున్నదే తడవుగా సంప్రదాయ పంటలైన పత్తి, మక్క సాగును క్రమంగా తగ్గించి దిగుబడి ఎక్కువ వచ్చే, లాభాలు తెచ్చే కూరగాయలు, పండ్ల సాగుపై దృష్టిపెట్టారు. మరే గ్రామంలో లేనివిధంగా రకరకాల కాయగూరలు, పండ్ల తోటలను సాగు చేస్తూ పర్వతగిరి మండలం చింతనెక్కొండ రైతులు ప్రభుత్వ దృష్టిని ఆకర్షిస్తున్నారు. పందిరి సాగుకు ఉద్యానశాఖ సబ్సిడీ కూడా ఇస్తుండడంతో ఒకటీ రెండు పంటలకు పరిమితం కాకుండా సుమారు 24 రకాలు సాగుచేస్తూ ఔరా అనిపిస్తున్నారు ఫలితంగా ఒకప్పుడు 15 ఎకరాల్లోపే ఉన్న ఉద్యాన పంటల విస్తీర్ణం ఇప్పుడు ఏకంగా 200 ఎకరాలు దాటింది. దిగుబడులను కొనేందుకు వ్యాపారులు పోటీపడుతుండడంతో రైతులకు ‘లోకల్‌’గానే లాభాల పంట పండుతున్నది.

ఫలించిన ‘పంట మార్పిడి’ విధానం
చింతనెక్కొండ రైతులు గతంలో పత్తి, మక్కజొన్న, మిరప, పసుపు పంటలను సాగుచేసేవారు. ఏటా వీటినే సాగు చేస్తుండడం వల్ల ఆశించిన దిగుబడులు అటుంచి నష్టాలు వచ్చేవి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు కొన్నేళ్ల నుంచి పంటల మార్పిడి విధానాన్ని అవలంబించడం ప్రారంభించారు. క్రమేపీ లాభాలు కనిపిస్తుండడంతో ఒకటీరెండు కాదు.. మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్న అన్ని రకాల కాయగూరలు, పండ్ల సాగు చేయడం మొదలుపెట్టారు.

- Advertisement -

సబ్సిడీతో మరింత ఉత్సాహంగా..
తొలుత కాకర, బోడకాకర, కీరదోస, దొండకాయ వంటి తీగజాతి పంటలను కర్రలతో పందిళ్లు ఏర్పాటు చేసి సాగుచేశారు. ఆ తర్వాత వీటి సాగుకు ప్రభుత్వం ఉద్యానశాఖ సబ్సిడీ ఇస్తుండడంతో శాశ్వత పందిళ్లు నిర్మించారు. కొందరు రైతులు తమకున్న వ్యవసాయ భూమిలో ఐదారు రకాల కాయగూరలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. ఒక ఎకరం ఉన్న రైతు పది గుంటల్లో కాకర, పది గుంటల్లో బీర, పది గుంటల్లో కీరదోస, పది గుంటల్లో సోరకాయ వంటివి పండిస్తున్నారు. ఏటా కచ్చితంగా రెండు పంటలు తీస్తున్నారు. వానకాలం కాకర సాగుచేసిన విస్తీర్ణంలో యాసంగిలో బీర లేదా కీరదోస వేస్తూ పంటల మార్పిడి చేస్తున్నారు. యాజమాన్య పద్ధతులు పాటించి ఆశించిన దిగుబడి సాధిస్తున్నారు.

‘లోకల్‌’గా విక్రయాలు..
సాగు చేస్తున్న కాయగూరలు, పండ్లను రైతులు స్థానికంగానే అమ్ముతున్నారు. వరంగల్‌- నెక్కొండ ప్రధాన రహదారిలో ఈ గ్రామం ఉండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు విక్రయిస్తున్నారు. అప్పుడే కోసినవి కావడం వల్ల ప్రయాణికులు ఆగి మరీ తీసుకెళ్తున్నారు. గతంలో వరంగల్‌లోని కాయగూరలు, పండ్ల మార్కెట్‌కు తీసుకెళ్లే రైతులు.. ఇప్పుడు లోకల్‌గా గిట్టుబాటు ధరకు అమ్ముకుంటూ లాభాలు పొందుతున్నారు. ట్రాన్స్‌పోర్టు ఖర్చులు, దళారీలు కూడా లేకుపోవడంతో నిశ్చింతగా ఉంటున్నారు. అంతేగాక వరంగల్‌ మార్కెట్‌లోని వ్యాపారులే వచ్చి ఇక్కడి రైతుల వద్ద హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తుండడంతో తమ పంట పండిందంటూ సంబురపడుతున్నారు.

మొత్తం కాయగూరలే పండిస్త..
నాకు ఎకరం భూమి ఉంది. మొత్తం కాయగూరలే పండిస్త. ఇదివరకు కట్టెలతో పందిరి వేసే కాకర, బీర, సోర, బోడకాకర సాగుచేసిన. ఈసారి సబ్సిడీ వచ్చినంక ఎకరంలో శాశ్వత పందిళ్లు వేసిన. 20గుంటల్లో కాకరకాయ పెట్టిన. ఇంకో 20గుంటల్లో బోడకాకరకాయ, చిక్కుడుకాయ పెట్టిన. పత్తి, మక్కజొన్న కంటే లాభం ఎక్కువ ఉండుట్ల వీటినే పండిస్తున్న. ఎక్కడికో పోయే పని లేకుంట ఊళ్లెనే మంచి రేట్‌కు పోతానయ్‌. మంచిగ తోట కాడనే రోడ్డుపై అమ్ముకుంటానం.

  • కాసాని సదయ్య, రైతు, చింతనెక్కొండ

మూడెకరాల్లో సాగు చేస్తున్న..
మూడెకరాల్లో కాయగూరలు, పండ్ల తోటలు సాగు చేస్తున్న. బీర, కాకర, కీర, సోర, పచ్చిమిర్చి, టమాట, బొప్పాయి, శామగడ్డ పండిస్తున్న. ఈ ఏడాది జామ, డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటలు పెట్టిన. బీర, కాకర, కీర, సోర, టమాట, బొప్పాయి, పచ్చిమిర్చి వంటివి ఏది కూడా పది గుంటల్లో పెడుత. ఏటా వానకాలం, యాసంగి పంటలను మార్చుత. ఇదివరకు కాయగూరలను వరంగల్‌ మార్కెట్‌కు తీసుకోయేది. రెండేళ్ల నుంచి ఊళ్లోనే అమ్ముతున్న. ఏం ఖర్చుల్లేవు. మంచి లాభమనిపిస్తుంది.

  • నల్లపు రాములు, రైతు, చింతనెక్కొండ

డిమాండ్‌ ఉన్న పంట వేయాలి..
పంటల మార్పిడితో రైతులు మంచి లాభాలను పొందవచ్చు. ఎప్పటికీ ఒకే పంట వేస్తే ఆశించిన దిగుబడులు రావు. నష్టం వస్తుంది. చింతనెక్కొండ రైతులు కొన్నేళ్ల నుంచి పంటలను మార్చుతున్నారు. పత్తి, మక్కజొన్న తగ్గించి కాయగూరలు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఏటా వానకాలం సాగుచేసిన పంట స్థానంలో యాసంగి మరో పంట వేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్లడం, వ్యాపారులు అడిగిన ధరకు అమ్మడం గాకుండా ఊళ్లోనే విక్రయిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 200 ఎకరాల్లో సాగు చేశారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రైతులెవరైనా పంటల మార్పిడితో డిమాండ్‌ ఉన్న పంటలు వేయడం మంచిది.

  • శంకర్‌, ఉద్యాన అధికారి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana