e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home జనగాం గురిజాలలో పల్లె నిద్ర.. ఉదయం కాలినడకన పర్యటన

గురిజాలలో పల్లె నిద్ర.. ఉదయం కాలినడకన పర్యటన

  • పండ్లపుల్ల వేసుకొని లుంగీతో కలియదిరిగిన ఉద్యమ నేత
  • బీసీ, యాదవ, ఎస్సీకాలనీల్లో నేలపై కూర్చొని సమావేశాలు
  • భీమ్లాతండాలో గిరిజనులతో కలిసి జొన్న రొట్టె తిన్న కేసీఆర్‌

వరంగల్‌, అక్టోబర్‌ 26(నమస్తేతెలంగాణ) : తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా మార్చాలన్న సంకల్పానికి తెలంగాణ ఉద్యమ సమయంలో బీజం పడింది. సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలను స్వయంగా తెలుసుకునేందుకు నాడు ఉద్యమనేత కేసీఆర్‌ అనేక పల్లెల్లో పర్యటించారు. జనంతో మమేకమై వారితో మాట్లాడారు. వారి ఆవేదన, ఆర్తిని విని చలించిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యలన్నింటినీ పరిష్కరించుకుందామని వారిలో ధైర్యం నింపారు. అలా ఆయన జరిపిన ప్రతి పర్యటన నుంచి ఒక పథకం పురుడుపోసుకుంది. వీటిలో గురిజాల పర్యటన ఒకటి. తండాలు, గూడేలు, శివారు పల్లెలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఆవిర్భవించడానికి గురిజాల పర్యటన స్ఫూర్తినిచ్చింది. ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొలువు దీరగానే గిరిజన తండాలు, గూడేలు, శివారు పల్లెలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. స్వపరిపాలనలో అభివృద్ధి దిశగా పరుగుపెడుతున్నాయి. ఉద్యమ సమయంలో ప్రజలను కలిసేందుకు కేసీఆర్‌ 2009 సెప్టెంబర్‌ 22న నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామాన్ని సందర్శించారు. సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడకు చేరుకున్న ఆయనకు స్థానిక మహిళలు బోనాలు, బతుకమ్మలు, మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. టీఆర్‌ఎస్‌ సీనియర్లు బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌, బొంతు రామ్మోహన్‌, దాస్యం వినయభాస్కర్‌ తదితరులు కేసీఆర్‌ వెంట ఉన్నారు. తొలుత కేసీఆర్‌ గురిజాలలోని సెంటర్‌లో టీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. సభ ముగిశాక కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో గ్రామంలోని ఓ మండపం వద్ద కొలువుదీరిన విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. చివరగా టీఆర్‌ఎస్‌ కార్యకర్త నామాల కృష్ణమూర్తి ఇంటికి చేరుకున్నారు. ఆరోజు రాత్రి కృష్ణమూర్తి ఇంట్లో బస చేశారు.

గురిజాలలో ప్రెస్‌మీట్‌
రెండోరోజు మధ్యాహ్నం కేసీఆర్‌ గురిజాలలో కృష్ణమూర్తి ఇంటి వద్ద ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నరం చూసి వాత పెడతామని హెచ్చరించారు. దళిత కాలనీల్లో అనేక సమస్యలు పేరుకపోయాయని ఆవేదన వెలిబుచ్చారు. సాగునీటి వనరులను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ వచ్చాక దళితకాలనీలపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. భీమ్లాతండా వాసులతో మాట్లాడిన సమయంలో గిరిజన తండాలు ప్రత్యేక పంచాయతీలు కావాల్సిందేనని అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా చేసుకుందామని చెప్పారు. కేసీఆర్‌ అనుకున్నది సాధించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయదుందుబి మోగించింది. కొలువుదీరినప్పటి నుంచి కేసీఆర్‌ ఉద్యమ సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. ఈ క్రమంలో భీమ్లాతండావాసులకు ఆయన చెప్పినట్లు గిరిజన తండాలు, గూడేలు, శివారు పల్లెలన్నీ ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా అవతరించాయి. స్వపరిపాలనతో వాటి రూపురేఖలు మారిపోతున్నాయి. పల్లె ప్రగతి వంటి కార్యక్రమంతో కొత్త పంచాయతీలన్నీ అభివృద్ధి దిశలో ముందుకుసాగుతున్నాయి. దళిత కాలనీల్లోని సమస్యలను పరిష్కరించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దళిత కాలనీల్లో సర్వేలు జరిపి మౌలిక వసతులు కల్పిస్తుంది. దళితబంధు పథకాన్ని సైతం అమల్లోకి తెచ్చింది.

- Advertisement -

పథకాలకు అప్పట్లోనే బీజం పడింది..
తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఉద్యమ సమయంలో జరిగిన కేసీఆర్‌ పల్లెనిద్ర కార్యక్రమంలోనే బీజం పడింది. ముందు చూపు ఉన్న వ్యక్తి కేసీఆర్‌. 2009లో కేసీఆర్‌ నిర్వహించిన పల్లెనిద్రలో ప్రజా సమస్యలకు పరిష్కారం లభించింది. పల్లె నిద్రచేసి దళిత కాలనీ, యాదవ కాలనీ, బీసీ కాలనీ, మారుమూల భీమ్లాతండాకు స్వయంగా కాలినడకన వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకు సమస్యలు ఉండవని అప్పట్లో కేసీఆర్‌ చెప్పారు.-మోటూరి రవి, న్యాయవాది, ఉద్యమనేత, గురిజాల

పండ్లపుల్ల వేసుకుని…కాలినడకన
తెల్లవారి ఉదయం గురిజాలలోని కృష్ణమూర్తి ఇంటివద్ద కేసీఆర్‌ కాలకృత్యాలు తీర్చుకున్నారు. పండ్లపుల్ల వేసుకుని లుంగీపైనే స్థానికులను కలిసేందుకు కృష్ణమూర్తి ఇంటి నుంచి బయల్దేరారు. బురదలో కాలినడకన గురిజాలలోని బీసీ, యాదవ, ఎస్సీకాలనీని సందర్శించారు. బీసీలు, యాదవ కులస్తులు, ఎస్సీలతో వేర్వేరుగా నేలపై ఒక పరదాలో కూర్చుని మాట్లాడారు. ఆప్యాయంగా వారిని పలకరించి సమస్యలను తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారు చెప్పేవి ఓపిగ్గా విన్నారు. తర్వాత కేసీఆర్‌ కాలినడకన సమీపంలోని గుంటూరుపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని భీమ్లాతండాకు చేరుకున్నారు. గిరిజనులు నివసిస్తున్న ఈ తండా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భీమ్లాతండాలోని గిరిజన మహిళ బానోత్‌ సరోజన ఇంటిముందు నేలపై ఒక పరదాలో కూర్చుని ఉదయం సరోజన అందించిన జొన్నరొట్టె తిన్నారు. ఇక్కడ కొద్దిసేపు గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో రహదారులు సరిగా లేవని, సమస్యలతో సతమతమవుతున్నామని, సాగు నీటి కొరత ఉందని, బోర్లపై ఆధారపడడం వల్ల వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయని గిరిజనులు కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు. భీమ్లాతండా నుంచి తిరిగి గురిజాలలోని కృష్ణమూర్తి ఇంటికి చేరుకున్న కేసీఆర్‌ అక్కడే అల్పాహారం చేశారు. పర్యటన ముగిసేవరకు ప్రస్తుత నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement