e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home జనగాం గత చరితకు ఘన సాక్ష్యం

గత చరితకు ఘన సాక్ష్యం

  • ఎటుచూసినా కాకతీయుల ఆనవాళ్లు
  • ఆధ్యాత్మికతను పంచే శివకేశవ, త్రికూటాలయాలు
  • శివకేశవాలయ గోడల నుంచి నిరంతరం నీటి ధారలు
  • పోచమ్మ ఆలయ ప్రాంగణంలో రాణి రుద్రమదేవి విగ్రహాలు
  • పెద్ద బండరాయిపై అబ్బురపరిచే కాళికామాత విగ్రహం

ఖిలావరంగల్‌, జూలై 31 : కాకతీయుల ఘన చరిత్రకు ఓరుగల్లు మహా సామ్రాజ్యంలోని సుందర కళారూపాలే ఘనమైన సాక్ష్యాలు. కాకతీయుల పాలనలో జీవం పోసుకొని శిల్పంగా అవతరించిన ప్రతి శిలా అపురూపమే. గత చరిత్రకు ఘనమైన సాక్ష్యంగా బొల్లికుంట గ్రామం నిలిచింది. ఎటు చూసినా కాకతీయుల ఆనవాళ్లతోపాటు అడుగడుగునా చారిత్రక ప్రాశ్యస్త్యంతో అలరారుతున్నది. 12.5 కిలోమీటర్ల వ్యాసం కలిగిన పుట్టకోటకు దక్షిణం దిక్కున అగడ్త(చెరువు) ఒడ్డున ఉన్న బొల్లికుంట, వరంగల్‌ మహానగర పాలక సంస్థ 17వ డివిజన్‌ పరిధిలో ఉంది.

అగడ్త ఒడ్డున శివకేశవాలయం
ఒకవైపు పుట్టకోట అగడ్త.. మరోవైపు ప్రకృతి అందాల మధ్య శివకేశవాలయం ఉన్నది. ఈ ఆలయ ప్రాంగణంలో వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, నాగేంద్రస్వామి విగ్రహాలున్నాయి. ఇవి ముష్కరుల దండయాత్రలో ధ్వంసమై ఉన్నాయి. ఆలయం ఎదుట నందీశ్వరుడు, అంతరాలయంలో గణపతి, గర్భాలయంలో శివలింగాన్ని ప్రతిష్టించారు. ఆల య ద్వారపాలకులుగా శివగణాల విగ్రహాలున్నాయి. ఆలయం గోడల నుంచి నీటి ధారలు నిరంతరం కారడం ఇక్కడి ప్రత్యేకత. కానీ, ఈ నీరు ఎక్కడినుంచి వస్తున్నదనేది అంతుచిక్కని రహస్యం. పక్కనే గరుడ పెరుమాళ్లు, ఆంజనేయస్వామి ద్వారపాలకులుగా గర్భాలయంలో వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలున్నా ఎవరి హయాంలో కట్టారనేది తెలియాల్సి ఉన్నది.

- Advertisement -

భక్తులను భద్రంగా కాచే అమ్మవారు
శివకేశవాలయానికి ఆగ్నేయ భాగంలో పది అడుగులు దూరంలో ఒక పెద్ద బండరాయిపై భక్తులను భద్రంగా కాచే కాళికామాత విగ్రహం దర్శనమిస్తుంది. ద్వాదశ భుజాలు, ఆయుధాలతో రాక్షసుల తలలను తెగనరికినట్లు గంభీరంగా కనిపిస్తుంది. అమ్మవారి విగ్రహానికి ఎదురుగా కొద్ది దూరంలో పోతురాజు విగ్రహం, పాదుకలున్నాయి. ఏడాదికోసారి స్థానికులు అమ్మవారిని గంగాభవానీ మాతగా కొలుస్తూ పూజలు చేస్తుంటారు. కొందరు క్షుద్ర కాళికాదేవిగా, మరికొందరు ఆది పరాశక్తిగా భావిస్తున్నారు. కాకతీయుల కాలంలో కరువు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న గంగాభవానీ మాతకు పూజలు చేయడం వల్లే వర్షాలు సమృద్ధిగా కురిసినట్లు ప్రచారంలో ఉన్నది.

అధ్యాత్మికతను పంచే త్రికూటాలయం
బొల్లికుంటలో వెలుగులోకి రాని అద్భుతమైన త్రికూటాలయం ఉన్నది. నాట్యమండపం కూలిపోగా ఆలయం మాత్రమే మిగిలి ఉన్నది. ప్రధాన ఆలయంలో కోదండరాముడు సీతాసమేత లక్ష్మణస్వామితో కొలువై ఉన్నాడు. భద్రపీఠంపై మహావిష్ణువు దశావతారాల విగ్రహాలు ఉండడం విశేషం. ఇలాంటి విగ్రహాలు దేశ వ్యాప్తంగా మూడు చోట్ల మాత్రమే ఉన్నట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ ఆలయంలో పూజలన్నీ ఆళ్వారుల పరంపరలో జరిగాయనేందుకు గర్భగుడిలో 10 మంది ఆళ్వారుల విగ్రహాలున్నాయి. అంతరాలయానికి ఎదురుగా కోదండరాముడు కొలువై ఉండగా ఇరువైపులా ఉన్న గర్భాలయాల్లోని విగ్రహాలు ముష్కరుల దాడిలో ధ్వంసమైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

రాణీ రుద్రమదేవి విగ్రహాలు
కాకతీయుల సామ్రాజ్యంలో గొప్ప పరాక్రమవంతురాలిగా, ధృవతారగా పేరొందిన రాణీ రుద్రమదేవి విగ్రహాలు సైతం ఇక్కడ ఉన్నాయి. బొల్లికుంటలోని గంగాభవానీ మాతకు, ఆదిపరాశక్తికి రుద్రమదేవి పూజలు చేసినట్లు స్థానికులు చర్చించుకుంటుంటారు. శివకేశవాలయానికి వెనుకభాగంలోని పోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్న రెండు విగ్రహాలు రాణీ రుద్రమ దేవివేనని ఊరి ప్రజలు అభిప్రాయం. అశ్వంపై కూర్చున్న యోధురాలు కత్తితో శత్రువులను సంహరిస్తున్నట్లు, కిందపడ్డ శత్రు సైనికుల తలలను vగుర్రం కాళ్లతో తొక్కిస్తూ కదనరంగంలో దూసుకుపోతున్నట్లు ఉన్న విగ్రహాలు ముమ్మాటికీ రాణీ రుద్రమ దేవివేనని పేర్కొంటున్నారు. గ్రామంలో అక్కడక్కడా ఆంజనేయస్వామి విగ్రహాలు, శివలింగం పానపట్టం ధ్వంసమై పడి ఉన్నాయి. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు, చరిత్రకారులు పరిశోధనలు చేస్తే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana