వేసవికాలం ప్రారంభం అవుతుంటే చాలు పాత టోపీలను వెతుకుతాం.. అవి లేకపోతే మళ్లీ ఓ కొత్త టోపీని కొనుగోలు చేస్తాం. ఈ మేరకు వేసవి సీజన్లో పలువురు టోపీల వ్యాపారం మొదలుపెడుతారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద, నిత్యం ప్రయాణాలు సాగే దారుల్లో వీటిని విక్రయిస్తుంటారు. చిరువ్యాపారులు ఈ సీజన్లో టోపీలు అమ్మి ఉపాధి పొందుతున్నారు. గతంలో ఎండవేడి నుంచి కాపాడుకోవడానికి తలకు దస్తీ లేదా టవల్ కట్టుకునేవారు. కానీ, ఇప్పుడు మార్కెట్లోకి వివిధ రకాల టోపీలు వచ్చేశాయి. ముఖ్యంగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఫ్యాషన్ క్యాప్స్ కూడా వచ్చాయి.
ఇప్పుడు ఎక్కువగా నగర ప్రజలు ైస్టెలిష్.. మోడల్.. నాణ్యత వైపు మొగ్గు చూపుతూ బ్రాండెడ్ టోపీలను కొనుగోలు చేస్తున్నారు. వివిధ బ్రాండ్ల టోపీలకు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తున్నది. బ్లూమ్యాక్స్, అడిడాస్, నైక్, రీబాక్, పుమా, ఫ్యాషన్, మిలటరీ క్యాప్స్ వంటి బ్రాండెడ్ కంపెనీల టోపీలకు మార్కెట్లో గిరాకీ బాగుంది. వివిధ రకాల డిజైన్లలో టోపీలు అందుబాటులోకి వచ్చాయి. కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వివిధ కంపెనీలు సైతం ఎన్నో రకాల డిజైన్లతో క్యాపులను తయారు చేశాయి. అమ్మాయిలకు కూడా ప్రత్యేకంగా టోపీలు వచ్చేశాయి. వివిధ బ్రాండెడ్ కంపెనీల టోపీల ధరలు రూ.100 నుంచి రూ.600 వరకు ఉన్నాయి.
నగరంలో టోపీ విక్రయాలు జరిపే సెంటర్లు 50కిపైగా ఉన్నాయి. సీజన్ ప్రారంభం కావడంతో వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలామంది టోపీలను అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఎక్కడో ఒకచోట మాత్రమే వీటిని అమ్మేవారు. కానీ, ఇప్పుడు చిరు వ్యాపారం చేసేవారు అడ్డాల వద్ద టోపీలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దారిలో ఏదో ఒక చోట పెట్టి, అమ్మకాలు సాగిస్తున్నారు. వేసవి మొదలవడంతో టోపీల కొనుగోలు కూడా ఊపందుకుంది.. ఎండ నుంచి రక్షించుకోవడానికి చిన్న పిల్లల నుంచి అందరికీ అందుబాటులో ఉండేలా వివిధ రకాల టోపీలు మార్కెట్లోకి వచ్చాయి.
వేసవి సీజన్లో టోపీల వాడకం ఎక్కువగా ఉంటుంది. యువత సరికొత్త రంగులతో ఉన్న టోపీలను వినియోగిస్తున్నారు. మార్కెట్లో వివిధ రకాలైన టోపీలు అందుబాటులో ఉన్నాయి. ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. ఎండ నుంచి రక్షించుకోవడానికి టోపీ తప్పనిసరి.
– సునీల్, విక్రయదారుడు
ఎండలో పనిమీద బయటికి వెళ్లాలంటే టోపీ తప్పనిసరిగా మారింది. వేసవిలో ఎండ తగులకుండా టోపీ రక్షణగా ఉంటుంది. ప్రస్తుతం అందరూ టోపీ పెట్టుకుని ప్రయాణాన్ని సాగిస్తున్నారు. వివిధ రకాల వెరైటీ క్యాపులు బాగున్నాయి. కలర్ఫుల్గా కనపడేందుకు ఇప్పుడు విద్యార్థులు వీటిని ఎక్కువగా పెట్టుకుంటున్నారు.
– రాజేశ్, వరంగల్