బల్దియాలో లక్ష్యం దిశగా వ్యాక్సినేషన్
14 రోజుల్లో 83,143 మందికి టీకాలు
వరంగల్, జూన్ 11 : గ్రేటర్ వరంగల్ పరిధిలో సూపర్ స్ప్రెడర్స్ టీకా సక్సెస్ అవుతున్నది. నగరంలో కరోనా వ్యాప్తికి వాహకులుగా గుర్తించిన వారందరికీ టీకాలు వేయడంలో బల్దియా చేపట్టిన కార్యక్రమం విజయవంతమవుతున్నది. గ్రేటర్లో 93,035 మంది సూపర్ స్ప్రెడర్స్ను బల్దియా అధికారులు గుర్తించారు. గత నెల 29 నుంచి కార్పొరేషన్ పరిధిలో ఐదు సెంటర్లు ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నారు. గత 14 రోజులుగా నగరంలో 83,143 మంది సూపర్ స్ప్రెడర్స్కు టీకాలు వేశారు. నగరంలోని రైతు బజార్, కూరగాయలు, పండ్లు, మాంసం వ్యాపారులు, వీధి వ్యాపారులు, కిరాణా, ఐరన్, హెయిర్ కటింగ్, మెడికల్ షాపుల ఉద్యోగులు, హమాలీలు, శ్మశాన వాటికల్లో దహన సంస్కారాలు చేసే వారిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. బల్దియా అధికారులు లక్ష మంది సూపర్ స్ప్రెడర్లకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రతి రోజూ 5 వేల టీకాలు
ప్రతి రోజూ 5 వేల మందికి టీకాలు వేస్తున్నారు. కార్పొరేషన్లో మొదట 5 కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అదనంగా మార్కెట్, గిర్మాజిపేటలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలుత టీకాలు వేసుకునేందుకు సూపర్ స్ప్రెడర్లు ముందుకు రాలేదు. ప్రజల్లో అవగాహన పెరుగడం, కార్పొరేటర్లు, సిబ్బంది షాపుల వద్దకే వెళ్లి టోకెన్లు ఇవ్వడంతో టీకాల కార్యక్రమం జోరందుకున్నది. ఒక్కో కేంద్రానికి ప్రత్యేక అధికారిని నియమించి టీకా కార్యక్రమం సజావుగా సాగేలా బల్దియా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
83,143 మందికి వ్యాక్సినేషన్
ప్రత్యేక కేంద్రాల ద్వారా గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 83,143 మంది సూపర్ స్ప్రెడర్స్కు టీకాలు వేశారు. రైతు బజార్ ఉద్యోగులు 6,848, కూరగాయాల వ్యాపారులు, గుమస్తాలు 9,994, పండ్లు, పూల వ్యాపారులు, గుమస్తాలు 6,031, చికెన్, మటన్, చేపల వ్యాపారస్తులు, గుమస్తాలు 4773, కిరాణా వ్యాపారస్తులు, గుమస్తాలు 24,673, లిక్కర్ వ్యాపారస్తులు, గుమస్తాలు 2,234, వీధి వ్యాపారులు 19,274, సెలూన్లలో పనిచేసే వారు 1,592, లాండ్రీ, దోభీ ఘాట్లలో 1890, హోటల్ వర్కర్లు 1066, మెడికల్ షాపు గుమస్తాలు 1135, శ్మశాన వాటికలలో దహన సంస్కారాలు చేసే వారు 103, పోలీస్, వ్యవసాయ శాఖ సిబ్బంది, ఆర్టీసీ, మెగా ఇంజినీరింగ్ వర్కర్లు 3,401, మామూనూరు పోలీస్ బెటాలియన్ 129 మందికి ప్రత్యేక శిబిరాల ద్వారా టీకాలు వేశారు.