మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Jun 14, 2020 , 00:22:44

పూర్తికావొస్తున్న దేవాదుల టన్నెల్‌

పూర్తికావొస్తున్న దేవాదుల టన్నెల్‌

శాయంపేట, జూన్‌ 1౩: జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశ ప్యాకేజీ పనులు పుంజుకున్నాయి. రామప్ప నుంచి ధర్మసాగర్‌ వరకు 49 కిలో మీటర్లు సొరంగం తవ్వి గోదావరి జలాలను తరలించనున్నారు. ఇందుకు రూ. 1494 కోట్లతో టన్నెల్‌ పనులు చేపట్టారు. అయితే, శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని చలివాగు కింద నుంచి టన్నెల్‌ పనులు జరుగుతుండగా 2011 జూలైలో బుంగపడింది. టన్నెల్‌లోకి నీళ్లు చొచ్చుకెళ్లాయి. దీంతో అంతటా పనులు జరిగినా చలివాగు కింద ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తిరిగి  పనులను 2016లో మొదలుపెట్టారు. అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పనుల్లో వేగం పెరిగింది. ఇప్పటి వరకు దేవాదుల మూడో ప్యాకేజీలో 46 కిలో మీటర్ల టన్నెల్‌ పనులు పూర్తి చేశారు. సాగుతోపాటు తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను ఎక్కువ స్థాయిలో వినియోగించుకునేందుకు దేవాదుల మూడో ప్యాకేజీని డిజైన్‌ చేశారు.

ఆడిట్‌ పాయింట్ల ఏర్పాటుకు..

దేవాదుల మూడో ప్యాకేజీ పనుల్లో చలివాగు కింద నుంచి టన్నెల్‌ తవ్వకం ప్రధానంగా నిలిచింది. ఆడిట్‌ పాయింట్లు ఏర్పాటు చేసి భూమి లోపల టన్నెల్‌ పనులు చేస్తున్నారు. అయితే, అనుకోని విధంగా 2011లో సంభవించిన ప్రమా దం ఆటంకాలను మిగిల్చింది. శాయంపేట మండలంలోని మాందారిపేట, మైలారం, వసంతాపూర్‌ ప్రాంతాల్లో ఆడిట్‌ పాయింట్లను ఏర్పాటు చేసి, ఎటు రెండున్నర కిలో మీటర్ల టన్నెల్‌ పనులు చేపట్టారు. ఈ క్రమంలో వసంతాపూర్‌ వైపు నుంచి టన్నెల్‌ పనులు చేస్తుండగా చలివాగులో బుంగపడి నీళ్లు వచ్చాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు జలసమా ధి అయ్యారు. దీంతో పనులు నిలిచిపోయాయి. రూ. కోట్లు విలువ చేసే యంత్రాలు సొరంగంలో ఉండిపోయి భారీ నష్టం జరిగింది. తర్వాత శాస్త్రవేత్తల సాయంతో బుంగను గుర్తించి, నీటిని తీశారు.  2016లో పనులు మొదలయ్యాయి. చలివాగులో బుంగ పడిన సమయంలో 600 మీటర్ల టన్నెల్‌ తవ్వాల్సి ఉంది. చలివాగు వద్ద మళ్లీ ఎలాంటి ప్రమాదం జరుగకుండా పకడ్బందీగా పనులు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. చలివాగులో రింగ్‌బండ్‌ కూడా నిర్మించారు. వసంతాపూర్‌ వైపు నుంచి భారీ యంత్రాలతో బండను పేలుస్తూ టన్నెల్‌ తవ్వుతున్నారు. అయితే, టన్నెల్‌ పనులు జరుగుతుండగా నీళ్లు రావడంతో సమస్యగా మారింది. అయితే, మైలారం వైపు నుంచి ఇప్పటికే టన్నెల్‌ పూర్తి కావడంతో రూటు మార్చి ఇటువైపు నుంచి చలివాగు కింద టన్నెల్‌ పనులు చేపట్టారు. వసంతాపూర్‌ వైపు భూమి పైనుంచి కిందకు సుమారు 32 మీటర్ల లోపల టన్నెల్‌ తవ్వగా రాక్‌ బలంగా లేకపోవడంతో మైలారం వైపు 70 మీటర్ల లోపల సొరంగం పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ హార్డ్‌ రాక్‌ ఉండడంతో పనులు సజావుగా సాగుతున్నాయి. సొరంగం తవ్వుతూనే చుట్టూ సీసీ పనులు పూర్తి చేస్తున్నారు. మిషన్లతో డ్రిల్లింగ్‌ చేస్తూ రాయిని బయటకు తరలిస్తున్నారు. వెంటిలేషన్‌ సరిగాలేకపోవడంతో రెండు, మూడు చోట్ల రంధ్రాలు చేసి గాలి కోసం ఫ్యాన్లు అమర్చారు. బుంగ నుంచి 55మీటర్ల సొరంగం తవ్వితే మైలారం, వసంతాపూర్‌ రెండు వైపులా టన్నెల్‌ కలిసిపోయి పనులు పూర్తవుతాయి. సుమారు నెల రోజుల్లో ఈ టన్నెల్‌ను పూర్తి చేసి కలుపుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చలివాగు కింద టన్నెల్‌ నిర్మాణం సవాల్‌గా మారడంతో దానిని త్వరలోనే పూర్తి చేస్తామన్న ధీమా అధికారుల్లో వ్యక్తమవుతున్నది.

మూడు కిలో మీటర్లే బ్యాలెన్స్‌!

దేవాదుల మూడో ప్యాకేజీలో భాగంగా రామప్ప నుంచి ధర్మసాగర్‌ వరకు 49 కిలో మీటర్లు టన్నెల్‌ తవ్వి గోదావరి జలాలను తరలించేందుకు పనులు చేపట్టారు. పనులు చేపట్టే కంపెనీ మారి మరో ఏజెన్సీ టేకోవర్‌ చేసి పనులు చేయిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మూడో ప్యాకేజీని మొదట రూ. 1410 కోట్లతో చేపట్టగా, ఆ తర్వాత రివైజ్‌ చేసి రూ. 1494 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులను 2016 నుంచి ప్రభుత్వం వేగిరం చేసింది. నాలుగేళ్లలో టన్నెల్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. మేజర్‌ టన్నెల్‌కు సీసీ లైనింగ్‌ పనులు పూర్తయ్యా యి. మొత్తంగా మరో మూడు కిలో మీటర్ల టన్నెల్‌ తవ్వితే పనులు పూర్తవుతాయి. రామప్ప నుంచి జాకారం మధ్య, ని జాంపల్లి, దేవన్నపేట వద్ద మూడు చోట్ల టన్నెల్‌ పనులు జరుగాల్సి ఉంది. దేవన్నపేట వద్ద సర్జిపూల్‌ పంప్‌హౌస్‌ పనులు జరుగుతున్నాయి. దేవాదుల నుంచి గోదావరి నీళ్లను సాగుతోపాటు వరంగల్‌, జనగామ, సిద్దిపేటకు తాగునీటి కోసం తరలించనున్నారు. ఇప్పటి వరకు దేవాదుల ప్యాకేజీల్లో మూడో ప్యాకేజీనే మేజర్‌ పార్ట్‌గా మారింది. రామప్ప నుంచి గోదావరి జలాలు నేరుగా టన్నెల్‌ ద్వారా దేవన్నపేట సర్జిపూల్‌కు చే రుకుంటాయి. అక్కడి నుంచి ఆరు కిలో మీటర్ల దూరంలోని ధర్మసాగర్‌ చెరువులోకి పైపులైన్‌ ద్వారా చేరుతాయి. మొత్తం గా మూడో ప్యాకేజీ ద్వారా ఏటా సుమారు 29 టీఎంసీ నీళ్లు వాడుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.


logo