e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News స్టార్ట‌ప్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఏంజిల్ ఇన్వెస్ట‌ర్లు ముందుకు రావాలి

స్టార్ట‌ప్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఏంజిల్ ఇన్వెస్ట‌ర్లు ముందుకు రావాలి

స్టార్ట‌ప్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఏంజిల్ ఇన్వెస్ట‌ర్లు ముందుకు రావాలి

హైదరాబాద్ : స్టార్టప్ ల‌లో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ర్టంలో ఉన్న పరిస్థితులు గొప్ప అవకాశాలను కల్పిస్తున్నాయని వరంగల్‌కు చెందిన ఎన్నారై, అమెరికా పారిశ్రామికవేత్త, ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూప్ (ఎస్ఎస్జీ) ఫౌండర్ ప్రెసిడెంట్, సీఈవో రవి పులి అన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేష‌న్ సెల్‌, టీహబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఏంజిల్ ఇన్వెస్టర్స్ వ‌రంగ‌ల్ ఎడిష‌న్ ఆన్‌లైన్‌ సదస్సులో ఆయన అమెరికా నుంచి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అంకుర సంస్థ‌ల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు వస్తాయనేది కేవలం అపోహ మాత్రమేనన్నారు. ఏంజిల్ ఇన్వెస్టర్లు గ్రూపులుగా ఏర్పడి తమకు అవగాహన, కన్విక్షన్ ఉన్న రంగాల్లో పెట్టబడులు పెడితే గొప్ప లాభాలతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులు సైతం లభిస్తాయన్నారు. ప్రస్తుతం ప్రపంచ దిగ్గజాలైన గూగుల్, ఫేస్‌బుక్‌, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు కూడా ఒకప్పుడు స్టార్టప్‌లేన‌ని గుర్తించాల‌న్నారు.

వాస్తవానికి రెగ్యులర్ కంపెనీలతో పోలిస్తే స్టార్టప్‌లే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయన్నారు. యువత ఉద్యోగాల కోసం చూడకుండా పదిమందికి ఉద్యోగాలు క్పలించే వ్యాపార దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. స్టార్టప్ ల‌లో లాభాలు మనం ఊహించని విధంగా ఉంటాయన్నారు. రాబోవు స్టార్టప్ యుగంలో అవకాశాలను అందింపుచ్చుకుని ఎదగాలని పిలుపునిచ్చారు.

వ‌రంగ‌ల్‌లో అన్ని వ‌స‌తులు..

హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న వరంగల్ నగరం మరో హైదరాబాద్ కాబోతున్నదని తెలిపారు. ఇక్కడ పెట్టుబడులకు గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పుడిప్పుడే ఏంజిల్ ఇన్వెస్టర్లు వరంగల్ పై ఫోకస్ పెడుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో వరంగల్ నగరం పెట్టబడులకు స్వర్గధామం కాబోతున్నదని వెల్లడించారు.

త‌ప‌న, అంకిత‌భావం ఉంటే పెట్టుబ‌డి అదే వ‌స్తుంది..

వ్యాపారం లేదా కంపెనీ ప్రారంభించాల‌నే త‌ప‌న‌, గొప్ప ఉత్ప‌త్తి లేదా ఆలోచ‌న‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయాల‌నే అంకిత‌భావం ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌లు పెట్టుబ‌డి గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేద‌ని ర‌వి పులి పేర్కొన్నారు. తాను అమెరికా వెళ్లిన కొత్త‌లో పెట్టుబడి ఏమీ లేకుండా కంపెనీ ప్రారంభించాన‌ని చెప్పారు. ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గాలి.. గొప్ప సంస్థ‌ల‌ను స్థాపించాల‌నే ప‌ట్టుద‌ల‌, శ్ర‌మ, విభిన్న‌మైన ఆలోచ‌న‌ ఉంటే పెట్టుబ‌డిదారులు ప‌రుగెత్తుకుంటూ వ‌స్తార‌ని వివ‌రించారు. ఒక్క రూపాయి పెట్టుబ‌డి కూడా లేకుండా సంస్థ‌ల‌ను ప్రారంభించ వ‌చ్చ‌ని అన్నారు. మ‌న వ‌ద్ద నైపుణ్యం, వినూత్న ఆలోచ‌న ఉంటే కంపెనీలు ఎటువంటి పెట్టుబ‌డి లేకుండా మ‌న‌ల్ని భాగ‌స్వాములుగా తీసుకుంటాయ‌ని తెలిపారు.

ఏంజిల్ ఇన్వెస్ట‌ర్ ఎవ‌రు ?

ఒక మంచి ఆలోచ‌న‌ను విశ్వ‌సించి, దానికి గొప్ప భ‌విష్య‌త్తు ఉంటుంద‌నే భావ‌న‌తో అంద‌రి కంటే ముందుగా అంకుర సంస్థ‌లో పెట్టుబ‌డి పెట్టేవారే ఏంజిల్ ఇన్వెస్ట‌ర్స్ అని ర‌వి పులి అన్నారు. ఏంజిల్ ఇన్వెస్ట‌ర్స్ స్టార్ట‌ప్‌ల విజ‌యంతో కీల‌క పాత్ర పోషిస్తార‌న్నారు. వినూత్న ఆలోచ‌న‌లో పెట్టుబ‌డి పెట్టాల‌ని ఆలోచ‌న ఉన్న ఏంజిల్ ఇన్వెస్ట‌ర్లు టీహ‌బ్ వంటి సంస్థ‌ల ద్వారా ఏంజిల్ ఇన్వెస్ట‌ర్స్ గ్రూప్‌ల‌తో అనుసంధానం కావ‌చ్చ‌ని ర‌వి పులి తెలిపారు.

హైదరాబాద్ ఏంజిల్స్ ఇన్వెంట్‌మెంట్ డైరెక్టర్ రత్నాకర్ సామవేదం మాట్లాడుతూ.. దేశంలో స్టార్టప్‌ల పురోగతి తీరుతెన్నులను వివరించారు. 2014 నుంచి 2020 వ‌ర‌కు హైద‌రాబాద్ అంకుర సంస్థ‌లు రూ. 10,950 కోట్ల నిధుల‌ను సేక‌రించాయ‌ని తెలిపారు. రానున్న రోజుల్లో బెంగళూరును మించి, తెలంగాణ రాష్ట్రంలో స్టార్టప్ సంస్థ‌లు వస్తాయని తెలిపారు. టీహబ్ సీఈవో రవి నారాయణ్ మాట్లాడుతూ తెలంగాణలో స్టార్టప్‌ల‌కు గొప్ప అవకాశాలు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్టార్ట‌ప్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఏంజిల్ ఇన్వెస్ట‌ర్లు ముందుకు రావాలి

ట్రెండింగ్‌

Advertisement