e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home జిల్లాలు పోటెత్తిన వరద

పోటెత్తిన వరద

నాలుగు రోజులుగా ఎడతెరిపి లేని వాన
శుక్రవారం గెరువిచ్చినా రాత్రి వరకు కుండపోత
చెరువులు, కుంటలకు జలకళ
మత్తళ్లు దుంకుతున్న నీటి వనరులు
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
గోదావరి ఉగ్రరూపం
కాళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
కనువిందు చేస్తున్న జలపాతాలు

వరంగల్‌, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉన్నది. శుక్రవారం కాస్త గెరువిచ్చినట్లే ఇచ్చి సాయంత్రం నుంచి మళ్లీ పడుతూనే ఉన్నది. నాలుగు రోజులుగా పడుతున్న వానలతో వరద పోటెత్తింది. చెరువులు, కుంటలు నిండాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండకు చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ ఆటోలో నర్సంపేట దవాఖానకు వస్తుండగా వాగు దాటే వీలు లేకపోవడంతో స్థానిక యువకులు ఆమెను వాగు దాటించారు. వాజేడు మండలంలోని టేకులగూడెం శివారు పావురాల వాగు బ్రిడ్జిపైకి గోదావరి వరద నీరు చేరి నీటమునిగింది. దీంతో హైదరాబాద్‌-భూపాలపట్నం 163 జాతీయ రహదారిపై ఛత్తీస్‌గఢ్‌- తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి వద్ద ఉన్న బొగత జలపాతం ఉధృతంగా దుంకుతుండగా శుక్రవారం నుంచి రెండురోజులపాటు అధికారులు అనుమతి నిలిపివేశారు.
రూరల్‌ జిల్లాలో 682 శాతం ఎక్కువ వర్షపాతం
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం వరంగల్‌ రూరల్‌ జిల్లాలో శుక్రవారం ఒక్క రోజే సాధారణం కంటే 682 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. వరంగల్‌ అర్బన్‌లో 680 శాతం నమోదైంది. రోజువారీ సాధారణ వర్షపాతంతో పోల్చితే జనగామ జిల్లాలో 410 శాతం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 426 శాతం, మహబూబాబాద్‌ జిల్లాలో 360శాతం, ములుగు జిల్లాలో 316 శాతం ఎక్కువ వర్షాలు పడ్డాయి.
ఉగ్రరూపం దాల్చిన గోదావరి
మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పుష్కరఘాట్‌ పూర్తిగా మునిగి పోయింది.అక్కడ ఉన్న ఇండ్లల్లోని ప్రజలను అధికారులు దగ్గరలోని ప్రాథమిక పాఠశాలలోకి తరలించారు. మహదేవపూర్‌ మండలం చండ్రుపల్లి, నాగపెల్లి, మద్దులపల్లి, పలుగుల, కుంట్లం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్‌ వద్ద గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తూ రాత్రి వరకు 82.6 మీటర్లకు చేరుకుంది.
జలపాతాలకు జలకళ
బయ్యారం మండలంలోని పెద్దగుట్ట పాండవుల, గంగారం మండలంలోని ఏడుబావుల జలపాతాలు పాలనురగలా ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నాయి. వెంకటాపురం మండల పరిధిలోని వీరభద్రవరానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ముత్యంధార జలపాతం విశేషంగా ఆకట్టుకుంటున్నది. చుట్టూ అడవి గుట్టల నడుమ ప్రకృతి అందాలతో జలపాతాలు కట్టిపడేస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana